ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జయశంకర్ జిల్లా : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతంలో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరవకముందే మరో సారి ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించి దాడి చేయడంతో కాల్పుల మోత మోగుతోంది. పూజారి కాకేరు తడపాల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో కోడిపుంజుల గుట్ట కాల్పులతో దద్దరిల్లుతోంది.
శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న అగ్రనేతలను మట్టుబెట్టేందుకు పోలీసులు ఈ కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం వరకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన గ్రేహౌండ్స్ జవాన్ సుశీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment