Hari bhushan
-
బావ కోసం దళంలో చేరి...
సాక్షి, హైదరాబాద్/గంగారం: మన్యంలో పుట్టిన ప్రేమకథ.. దండకారణ్యంలో సమాప్తమైంది. కష్టాలు, కన్నీళ్లు, తూటాలు, చట్టాలు, అనారోగ్యం, బంధాలు, బంధువులు ఏవీ వారిని ఆపలేకపోయాయి. చనిపోతావని బంధువులు బెదిరించినా.. ఆమె లెక్కచేయలేదు. బంధాలను తెంచుకుంది. అడవిలో ఉన్న బావను వెతుక్కుంటూ వెళ్లింది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసింది. చివరికి అతనితోపాటే కరోనా వైరస్‌కు బలైపోయింది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్–జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్ కరోనాతో మరణించాడు. 24న సమ్మక్క కూడా వైరస్‌తో పోరాడుతూ చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బావ వెంటే బతుకు అంటూ... వీరిద్దరి మరణంతో మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ– సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు ‘సాక్షి’కి చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది. 2012లో తిరిగి అడవిలోకి.. సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్ తమ్ముడు అశోక్ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు. -
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
కొత్తగూడెం అర్బన్: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా నాయుడుపాలెంకు చెందిన మందా రంజిత్‌రావు ప్రస్తుతం హైదరాబాద్‌లో తన అన్నయ్య వద్ద ఉంటూ.. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. అయితే 2014 నుంచి మావోయిస్టు హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులు, సామగ్రి (బూట్లు, చెప్పులు, బెల్టులు, ముద్రించిన విప్లవ సాహిత్య పుస్తకాలు) సమకూర్చుతున్నాడు. ఈ క్రమంలో 2018, జూన్ 8న మావోయిస్టు పార్టీకి ఆయుధ సామగ్రి (9 జిలెటిన్ స్టిక్స్, 9 డిటోనేటర్లు, 2 బాక్సుల ఎక్స్‌ప్లోజివ్ వైర్లు) తరలించే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపించారు. విడుదలైన తర్వాత కూడా రంజిత్‌రావు తన పద్ధతి మార్చుకోకుండా, 20 రోజుల క్రితం మావోయిస్టు హరిభూషణ్‌ను కలసి, ఆయన పంపిన విప్లవ సాహిత్యం, ఉత్తరాలను హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో కొత్తగూడెం–ఇల్లెందు క్రాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. -
ముందస్తు ఎన్నికలను బహిష్కరించండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సోమవారం ఓ లేఖలో డిమాండ్ చేసింది. సరైన కారణాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ శక్తులను ఏకం కాకుండా చేసి ముందస్తు ఎన్నికల్లో నెగ్గేందుకు ఎత్తుగడ వేశారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారని, బీజేపీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందం బట్టబయలుకావడంతో ఆశించిన రీతిలో ఫ్రంట్‌కు అడుగులు పడలేదన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసి ప్రతిపక్షాలను బలహీనపరిచారన్నారు. నీళ్లు నిధులు నియామకాలతో ప్రభుత్వంలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు.. ఏనాడూ ఉద్యమం చేయని, తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారిని మంత్రి మండలిలోకి చేర్చుకొని లక్షల కోట్లు కాంట్రాక్టుల పేరుతో కొల్లగొట్టారన్నారు. టీపాస్ పేరుతో పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని, నీళ్లు, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించి కోట్ల రూపాయల్లో లాభాలు కల్పించినట్టు హరిభూషణ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో 4 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటి నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం, రైతులకు బేడీలు వేసిన ఘనత దేశంలో కేసీఆర్‌కే దక్కుతుందని ఆరోపించారు. రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకే ఆర్థిక సహాయం చేస్తూ నిరుపేద రైతులను కేసీఆర్ మోసం చేశారన్నారు. మహాకూటమి పేరుతో కొత్త డ్రామా దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా మహాకూటమి పేరుతో డ్రామా మొదలుపెట్టి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని హరిభూషణ్ విరుచుకుపడ్డారు. సీపీఐ, సీపీఎంలు పాలక పార్టీలతో అంటకాగుతూ ఏదో ఒక దోపిడీ వర్గానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తూ ప్రజలను విప్లవోద్యమంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలతో పనిచేసిన కోదండరాం ఇప్పుడు దోపిడీ వర్గ పార్టీలకు మేలు చేసేలా వ్యవహరించడం సరైంది కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని హరిభూషణ్ పిలుపునిచ్చారు. -
బూటకపు ఎన్నికలను బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, ప్రజలకు వ్యతిరేకం గా పాలన సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని మోసం చేశారని తెలిపారు. ప్రజాద్రోహిగా, నియంతగా పరిపాలించిన కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఆ ఆగ్రహం సంఘటితం కాకముందే వీలైనంత త్వరగా బయటపడాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని ఊహించారన్నారు. కేసీఆర్ ముందుగానే ప్రధాని మోదీని, ఎన్నికల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిద్ధపడ్డారన్నారు. 25 లక్షల మం దితో గొప్పసభ నిర్వహించాలని భావించి ఘోరంగా విఫలమయ్యారన్నారు. మొదటి నుంచీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇతర పార్టీలలోని ఎమ్మెల్యే, ఎంపీలకు పదవులు, డబ్బు ఆశ చూపించి ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీన పరిచారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు బంగారు తెలంగాణ సాధన లక్ష్యం అని ప్రకటించారన్నారు. తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహార, ఈఎస్ఐ వంటి స్కాము ల్లో నిందితుడని ఘాటుగా విమర్శించారు. షాబుద్దీన్ కేసులో అమిత్‌షా వ్యవహారం బయటకు రాకుండా, రామేశ్వర్‌రావుకు నయీం వల్ల సమస్యలు రాకుండా హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరో పించారు. సీపీఎం దళితుల ఓట్లు సంపాదించడానికి గద్దర్ వంటి వాళ్లతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పా టు చేసి అధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కూటమితో కలిసి చివరికి చేరాల్సిన చోటుకే చేరారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ దోపిడీ వర్గ పార్టీలేనని, సీపీఐ, సీపీఎంల రివిజనిస్టు విధానాలను బహిష్కరించాలని కోరారు. ధర్నా చౌక్‌ను పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అడవుల్లో మళ్లీ తుపాకుల మోత
సాక్షి, జయశంకర్ జిల్లా : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతంలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ మరవకముందే మరో సారి ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించి దాడి చేయడంతో కాల్పుల మోత మోగుతోంది. పూజారి కాకేరు తడపాల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో కోడిపుంజుల గుట్ట కాల్పులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో తప్పించుకున్న అగ్రనేతలను మట్టుబెట్టేందుకు పోలీసులు ఈ కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన గ్రేహౌండ్స్ జవాన్ సుశీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. -
తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
-
తడపలగుట్టల్లో తుపాకులమోత
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్/భద్రాచలం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన గ్రేహౌండ్స్ జవాన్ సుశీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. రాత్రే చుట్టుముట్టిన పోలీసులు ఎన్కౌంటర్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మావోయిస్టులు విడిది చేసిన ప్రదేశానికి సంబంధించి పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో మావోయిస్టుల బస ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఉదయం మెరుపుదాడికి దిగినట్లు సమాచారం. మావోయిస్టు మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరణించిన జవాన్‌తో పాటు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతదేహాలను బట్టి వీరిని బుద్రి ఆలియాస్ రేణుకా, సంజీవ్‌గా భావిస్తున్నారు. కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బి.సుశీల్ కుమార్ మరణించగా మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన నాలుగు గ్రేహౌండ్స్ దళాలు ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు సమాచారం. డ్రోన్లను రంగంలోకి దింపారా? 24 నిమిషాలపాటు గాల్లో ఉంటూ 7 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అత్యాధునిక టెక్నాలజీ కల్గిన డ్రోన్లను గ్రేహౌండ్స్ బలగాలు ఛత్తీసగఢ్ సరిహద్దు ప్రాంతంలో రంగంలోకి దించారు. 2.5 కిలోమీటర్ల పై నుంచి 24 మెగాపిక్సల్ ఫొటోలు, వీడియోలు తీసే కెపాసిటీ ఉన్న ఈ డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మృతుల్లో అగ్రనేతలు! ఎన్కౌంటర్లో మరణించిన పది మంది మావోయిస్టులు ఎవరన్నది శనివారం రాత్రి వరకు పోలీసులు వెల్లడించలేదు. మృతుల్లో రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ (మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెం), రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లి), ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొయ్యడ గోపన్న ఆలియాస్ ఆజాద్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా మండలంలోని మొద్దులగూడెం)తో పాటు కేకేడబ్ల్యూ డివిజన్ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి (కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట) ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. చనిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టుల్లో హరిభూషణ్ భార్య ఉన్నట్లు సమాచారం. మరోవైపు హరిభూషణ్ బంధువులు భద్రాచలం ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలను చూసి.. అందులో అతడు లేడని నిర్ధారణకు వచ్చారు. మిగతా మృతదేహాలు వస్తే తప్ప చెప్పలేమన్నారు. ఎన్కౌంటర్ నుంచి హరిభూషణ్ తప్పించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కానీ పోలీసులు దాన్ని ధ్రువీకరించడం లేదు. ఘటనా స్థలంలో ఏకే 47, ఇన్సాన్ రైఫిల్స్ 5, ఓ ఎస్ఎల్ఆర్ , రెండు సింగిల్ బోర్ రైఫిళ్లు, ఒక 303 తుపాకీ, ఒక పిస్టోల్, ఒక సోనీ రేడియో, మూడు క్లెమోర్ మైన్స్, ఆరు రాకెట్ బాంబులు, రెండు సోలార్ ప్లేట్స్, రూ.41,000 నగదు, విప్లవ సాహిత్యం లభించాయి. ఏకే 47 ఆయుధం లభించడంతో అగ్రనేత ఎవరైనా ఎన్కౌంటర్లో మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవల పెరిగిన అలజడి ఇటీవల ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల అలజడి పెరిగింది. ముఖ్యంగా వెంకటాపురం, చర్ల మండలాల పరిధిలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మావోయిస్టులు అమర్చిన బాంబులను పోలీసులు ఐదుసార్లు నిర్వీర్యం చేశారు. ఏడాది వ్యవధిలో వెంకటాపురం మండలం పరిధిలో మావోయిస్టులు నాలుగుసార్లు వాల్ పోస్టర్లు వేశారు. ఫిబ్రవరి 4న వెంకటాపురం మండలం వెదిర గ్రామంలో బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ పేల్చి వేశారు. అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో జనవరి 26న దాడి చేసి వాహనాలు దగ్ధం చేశారు. ఈ ప్రాంతంలో హరిభూషణ్ పార్టీ కార్యకలాపాలను, రిక్రూట్మెంట్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాడు. మావోయిస్టు పార్టీ గతేడాది నవంబర్ నుంచి పినపాక, చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో 500 మందికిపైగా రిక్రూట్మెంట్ చేసినట్టు తెలిసింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ పెరిగింది. సరిహద్దు అడవులను అనువుగా మార్చుకుని తెలంగాణలో ప్రభావం చూపేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం పోలీసులకు ఉంది. దీనికితోడు ఐదు రోజుల కిందట ఐదుగురు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రాబట్టిన సమాచారంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మృతులపై స్పష్టత రావాలి ఉంది: ఎస్పీ కిశోర్ ఝా ఛత్తీస్‌గఢ్‌లోని పూసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు కూంబింగ్‌కు వెళ్లినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బస చేశారని తెలియటంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహించామన్నారు. మావోయిస్టులు తమపై కాల్పులు జరిపారని ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారన్నారు. కొందరు మావోయిస్టులు తప్పించుకుపోవడంతో ఇంకా ఆపరేషన్ జరుగుతోందన్నారు. ఇద్దరు మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మృతదేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించామని, మిగిలిన మృత దేహాలను శనివారం తీసుకొస్తామన్నారు. ఘటన జరిగిన స్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూసురు పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తున్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామన్నారు. మృతదేహాలను కుళ్లబెడతారా? ఎన్కౌంటర్ మృతదేహాలను సకాలంలో బంధువులకు అప్పగించకపోవటం సరికాదని మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ సోదరి యాప భారతి అన్నారు. హరిభూషణ్ మృతి చెందారన్న ప్రచారం నేపథ్యంలో తమ్ముడు అశోక్‌తో కలసి ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం నుంచి శుక్రవారం భద్రాచలం వచ్చారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఆవేదనతో వచ్చామని, కానీ మృతదేహాలను తరలించటంలో అధికారులు ఇలా వ్యవహరించటం సరైంది కాదన్నారు. చంపేసిన రెండు రోజులకు శవాలను కుళ్లబెట్టి వాటిని బంధువులకు అప్పగిస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మృతుల్లో అన్నయ్య లేడనే అనుకుంటున్నాం. లేకపోతే బాగుంటుందని ఆశ పడుతున్నాం. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఎత్తుకొని జోలపాడిన గుర్తులే తప్ప.. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎలా ఉంటాడో కూడా తెలియదు’’అన్నారు. – హరిభూషణ్ సోదరి భారతి -
ఆదివాసులకు అన్యాయం చేయొద్దు
ఆదివాసీల రిజర్వేషన్లలో 1976 నుంచి లంబాడీలను చేర్చినందువల్ల ఆదివాసులు చాలా నష్టపో యారు. ఇప్పటికైనా లంబాడీలను వేరు చేసి వారికి విడిగా రిజర్వేషన్లు కల్పించాలి. సమస్యను ఇరువర్గాలు మిత్రవైరుధ్యంగా గుర్తించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఆదివాసులకు పది శాతం రిజర్వేషన్లు, ముస్లింలకు 12 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఆమోదం పొందక తిరిగి వచ్చింది. ఆదివాసుల రిజర్వేషన్ పెంపు, ముస్లిం రిజర్వేషన్ పెంపు, వేరు వేరు బిల్లుల రూపంలో ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా పాటించకుండా ఆది వాసులపట్ల, ముస్లింలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు రూపొందించిన ఈ బిల్లు 1986లో ఎన్టీఆర్ బీసీలకు 25 శాతం నుంచి 40 శాతానికి పెంపు చేస్తూ రూపొందించిన బిల్లు వంటిదే. అది హైకోర్టు కొట్టి వేస్తే టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోలేదు. ఆ తాను నుంచే వచ్చిన ముక్క అయిన కేసీఆర్, ఆయన స్థాపించిన టీఆర్ఎస్ ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ సామ్రాజ్యవాద, బ్రాహ్మణీయ భూస్వామ్య భావజాలానికి, పాలనకు వ్యతిరేకంగా ముందు భాగాన నిలబడి పోరాడుతున్న మూల ఆదివాసులపై, ముస్లింలపై ప్రేమ చూపుతారంటే తోడేళ్లు, గొర్రెలకు మేలు చేయడం వంటిదే. ఆదివాసులకే పరిమితమై ఆలోచించినా ఒకవైపు రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ రూపొందించిన మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కి ఎస్టీ జాబితాలోకి లంబాడాలను చేర్చి మూల ఆది వాసీలకు, లంబాడాలకు మధ్యన చిచ్చు పెట్టి పీడిత వర్గాల ఘర్ష ణల్లో, విభేదాలు, వైమనస్యాలు, విద్వేషాల్లో రగుల్కొంటున్న మంటల్లో పేలాలేరుకుంటున్న ప్రభుత్వం.. మరొ కవైపు ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచి బిల్లును శాసనం చేయగలదని, చేసినా మూల ఆదివాసులకు న్యాయం చేయగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇపుడున్న ఆరు శాతం రిజ ర్వేషన్లలోనూ నాలుగు శాతమే అమలవుతున్నది. ఈ నాలుగు శాతంలో నాలుగో వంతు కూడా మూల ఆదివాసులకు దక్కడం లేదు. కారణం 1976లో లంబాడాలను అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన దగ్గర్నించే గత నలభై రెండేళ్లలో మూల ఆదివాసుల జనాభాకు లంబాడాల జనాభా ఇరవై రెట్లకు పెరిగింది. లంబాడాల వలసలు వేగవంతంగా పెరగడమే ఇందుకు కారణం. 1961లో 81,366గా ఉన్న లంబాడా జనాభా 2011లో 20,99,524కు పెరిగింది. ఏజెన్సీలో మూల ఆదివాసుల జనాభా 2011లో 9 లక్షలుగా మైనారిటీకి పడిపోయింది. కనుక ఈ పరిస్థితిలో ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతం అమలయినా మూల ఆదివాసులు పొందే ప్రయోజనమెంతో, పాలక వర్గాలు ఆడుతున్న ఓటు బ్యాంకు రాజ కీయాలు ఎంత దుర్బుద్ధితో కూడినవో ఎవరైనా న్యాయంగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. రాజ్యాంగం ప్రకారం అడవిలో, ఏజెన్సీలో మూల ఆదివాసులకు మాత్రమే దక్కవలసిన జల్, జంగల్, జమీన్లపై అధి కారం గ్యారంటీ కావాలన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక, విద్యా, ఉద్యోగ, భూసంబంధ హక్కులు అమలు కావాలన్నా 1976లో చేసిన చట్ట సవరణను రద్దు చేయవలసిందే. రిజర్వేషన్ల అమలులో 1976ను కటాఫ్ డేట్‌గా గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులను, భూమి పట్టాలను బ్యాక్లాగ్ పద్ధతిలో అమలు చేయాల్సిందే. ఎస్టీ వర్గీకరణ అంటే మూల ఆదివాసీ తెగల్లోనే గోండు, కోలాము, పరధాను, పరమేశు, నాయకపోడు, చెంచు వంటి ఆదివాసీ తెగల జనాభా ప్రాతిపదికపైననే కానీ మైదాన ప్రాంత సంచార జాతి అయిన లంబాడాలను కలిపి కాదు. 1976ను కటాఫ్ తేదీగా గుర్తించి వలస లంబాడాలను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలి. 1976 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడాలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు ఇక్కడ ఇవ్వాలి. అయితే అది రాజ్యాంగంలోని ఎస్సీ, ఎస్టీ గుర్తింపు కాజాలదు. కాయితా లంబాడాలు, వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరజాలరు. అడవిలో మూల ఆదివాసుల నివాసం, తొలి రోజుల్లో ఆహారాన్వేషణ, వేట, కాలక్రమంలో పోడు వ్యవసాయం, ఏజెన్సీలో ఉనికి, ఎస్టీ గుర్తింపుకు ప్రాతిపదిక కావాలి. ఐదవ షెడ్యూల్డు ఏజెన్సీ (అటవీ) ప్రాంతాల్లో ఏజెన్సీ సర్టిఫికెట్లు మూల ఆదివాసులకు మాత్రమే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వగైరా రాజకీయాధికారా లన్నీ మూల ఆదివాసు లకే పరిమితం కావాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు మూల ఆదివాసులకే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రెసి డెన్షియల్ స్కూళ్లలో, కాలేజీలలో మూల ఆది వాసుల పిల్లలకే సీట్లు ఇవ్వాలి. జీసీసీలో మూల ఆదివాసులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆదివాసుల సంస్కృతిని అగౌరవ పరిచే చర్యలు చేపట్టవద్దు. సూకీ మాత, సేవాలాల్ చిత్రాలను ఆదివాసీ మ్యూజియంలో పెట్టడం సరిౖయెంది కాదు. మేడారం ట్రస్టులో ఆదివాసులు మాత్రమే ఉండాలి. జోడన్ఘాట్లో కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం రాజ్య ప్రేరేపిత అవమానకర చర్య. ఆదివాసుల మనోభావాలను గాయపరిచే చర్య. ఏజెన్సీ ప్రాంత ఐడీడీఐలలో మూల ఆదివాసులకు మాత్రమే హక్కులుండాలి. లంబాడా ప్రజలకు ప్రత్యేకంగా మైదాన ప్రాంతాలలో రిజర్వేషన్లు కల్పించాలి. ఐటిడీ ఏలు నెలకొల్పాలి. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లపై హైకోర్టు న్యాయ మూర్తులతో ఒక కమిషన్ వేయాలి. ప్రభుత్వ రంగం రోజురోజుకూ కుంచించుకు పోతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు పీడిత, పేద ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరింప జాలవు. వాటివల్ల ఉపయోగం చాలా పరిమిత మైందనే ఎరుక ఉండాలి. మూల ఆదివాసులకు జల్ జంగల్ జమీన్లపై సర్వాధికారాలు దక్కాలంటే ఆదివాసీయేతరులైన పేదలు, పీడితులు ముఖ్యంగా లంబాడాలు మూల ఆదివాసులకు శత్రువులనీ, లంబాడాలకు దక్కవల సిన న్యాయం దక్కకూడదనీ అర్థం కాదు. పాలకవర్గాలు పెట్టిన కుట్ర తప్ప మూల ఆదివాసులకు, లంబాడాలకు మధ్యనున్నది మిత్ర వైరు ధ్యమే. దీనిని మిత్ర వైరుధ్యంగానే గుర్తించి మూల ఆదివాసులు, లంబాడాలు, ఆదివాసీయేతర పీడిత, పోరాట ప్రజానీకంతో కలిసి పరిష్కరించుకోవాలి. భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద ఏజెంట్లే అసలైన శత్రువులు. వాళ్లే ఈ ఘర్షణలకు మూలం. ప్రభుత్వాలు వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలు. మూల ఆదివా సులు, లంబాడాలు, పీడిత ప్రజలందరూ ఐక్యమై దోపిడీ పాలక వర్గా లకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే పేద ప్రజలం దరికీ న్యాయమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. మూల ఆదివాసులు జల్, జంగల్, జమీన్, స్వీయ గౌరవం కోసం పీడిత ప్రజలందరితో ఐక్యమై పోరాడాలి. స్వపరిపాలన కోసం పోరాడాలి. మిలిటెంటు పోరాటాల ద్వారా తప్ప ఎన్నికల రాజకీ యాల ద్వారా పేద, పీడిత ప్రజలకు లభించేది ఎండమావులే. అంతిమ సారాంశంలో పీడిత ప్రజలందరితోపాటు మూల ఆదివా సుల సమస్యలకు పరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే సాధ్యం. పోరాటానికి అది మార్గదర్శకం, లక్ష్యం కావాలి. (మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి యాపనారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్.. ఎన్కౌంటర్ ఘటన జరగటానికి ముందు రోజు ‘సాక్షి’కి పంపిన వ్యాసం) -
మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : నిషేధిత సీపీఐ -మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతిచెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. కీలక నేతలు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 12 మంది ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మమిళల్లో హరిభూషణ్ సహచరి సమ్మక్క కూడా ఉన్నారు. ఎదురుకాల్పుల్లో పోలీస్ కమాండో సుశీల్ కూడా చనిపోయారు. ఇదే ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గాయపడినట్లు సమాచారం. ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు : రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా హరిభూషణ్ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉత్తర తెలంగాణాలోని కెకెడబ్ల్యు(ఖమ్మం, కరీంనగర్, వరంగల్) డివిజన్లో కార్యకలాపాలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. అగ్రనేతగా ఎప్పటి నుంచో హిట్ లిస్టులో ఉన్న హరిభూషణ్ కోసం పలుమార్లు ప్రత్యేక ఆపరేషన్లు కూడా జరిగాయి.హరిభూషణ్‌పై దాదాపు 50 కేసులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు కూడా ఉంది. పట్టుకుని చంపేశారా? : సరిగ్గా రెండేళ్ల కిందట (2016, మార్చి 2న) ఇదే భద్రాద్రిజిల్లా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో సౌత్ సెంట్రల్ జోన్ కార్యదర్శి లచ్చన్న సహా ఏడుగురు దళ సభ్యులు చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లో హరిభూషణ్ కూడా మృ తి చెందారని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు ప్రకటించాయి. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఆ ప్రకటనను కొట్టిపారేశారు. అదే సమయంలో హరిభూషణ్ దొరికిపోయినట్లు, కీలక నేత కావడంతో ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రయత్నించిన పోలీసులు ఎట్టకేలకు చర్ల ఎన్కౌంటర్లో హరిభూషణ్‌ను హతం చేసినట్లు ప్రకటించారు. కాగా, చర్ల ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు సానుభూతిపరులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నాయకులను పోలీసులు ముందే పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, ఈ విషయంలో న్యాయవిచారణకు ఆదేశించాలని శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలుచేశారు. ఏం జరిగింది? : పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ మరణించారు. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
93 మంది మావోయిస్టులు
- రాష్ట్రంలో మావోల సంఖ్యపై పోలీసుల నిర్ధారణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభవం తగ్గిపోతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 93 మందే మావోయిస్టులు ఉన్నట్లు నిర్ధారించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం మావోయిస్టులు 93 మందిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు 35 మంది కాగా, కరీంనగర్‌కు చెందిన వారు 30 మంది ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంట మావోల కదలికలుఉన్నట్లు పోలీసుశాఖ నిర్ధారించింది. కొత్తగా రిక్రూట్మెంట్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో జాడే లేకుండా పోయినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేశారు. అయితే మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి హవా కొనసాగుతోంది. పార్టీ సెంట్రల్ కమిటీలో 20 మందికిగాను ఏపీ, తెలంగాణకు చెందిన వారు 12 మంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ హరిభూషణ్ నేతృత్వంలో కొనసాగుతున్నట్లు పోలీసుల సమాచారం. - సాక్షి, హైదరాబాద్ వరుస ఎదురుదెబ్బలతో కుదేలు రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీగా హతమయ్యారు. తాజాగా గడ్చిరోలి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేత ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్లో 180 మంది మావోయిస్టులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 140కి పడిపోయింది. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 93 మంది ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అందులోనూ ముఖ్యనేతలు, రివార్డులున్న వారు 28 మందే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో ఉన్న గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, గణపతి, మల్లా రాజిరెడ్డి, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాలరావు వంటి వారిపై రూ.25 లక్షలు, అలాగే స్టేట్ కమిటీలో ఉన్న వారిపై రూ.20 లక్షలు, జిల్లా కమిటీలో ఉన్న వారిపై రూ.10 లక్షలు ఉన్న వారున్నారు. వ్యూహాత్మకంగా కట్టడి పోలీసులు పకడ్బందీ వ్యూహంతో మావోయిస్టులను అణచివేశారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయగలిగారు. దీంతో రాష్ట్రంలో అర్బన్ జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మావోయిస్టుల జాడ లేదని ఇంటెలిజెన్స్ రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది. కేవలం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ కదలికలున్నట్లు పేర్కొంది. అంతేకాదు మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్కు అవకాశం లేకుండా పోలీసులు గట్టిదెబ్బ కొట్టారు. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎంటెక్ విద్యార్థిని మహిత అలియాస్ శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను పోలీసులు ఎన్కౌంటర్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుతో కొత్త వారు పార్టీలో చేరేందుకు భయపడేలా చేశారు.