- రాష్ట్రంలో మావోల సంఖ్యపై పోలీసుల నిర్ధారణ
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభవం తగ్గిపోతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 93 మందే మావోయిస్టులు ఉన్నట్లు నిర్ధారించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం మావోయిస్టులు 93 మందిలో వరంగల్ జిల్లాకు చెందిన వారు 35 మంది కాగా, కరీంనగర్‌కు చెందిన వారు 30 మంది ఉన్నట్లు గుర్తించింది. అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంట మావోల కదలికలుఉన్నట్లు పోలీసుశాఖ నిర్ధారించింది.
కొత్తగా రిక్రూట్‌మెంట్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు పార్టీ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో జాడే లేకుండా పోయినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేశారు. అయితే మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి హవా కొనసాగుతోంది. పార్టీ సెంట్రల్ కమిటీలో 20 మందికిగాను ఏపీ, తెలంగాణకు చెందిన వారు 12 మంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ హరిభూషణ్ నేతృత్వంలో కొనసాగుతున్నట్లు పోలీసుల సమాచారం.
- సాక్షి, హైదరాబాద్
వరుస ఎదురుదెబ్బలతో కుదేలు
రాష్ట్ర సరిహద్దుల్లో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు భారీగా హతమయ్యారు. తాజాగా గడ్చిరోలి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేత ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్‌లో 180 మంది మావోయిస్టులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 140కి పడిపోయింది. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 93 మంది ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అందులోనూ ముఖ్యనేతలు, రివార్డులున్న వారు 28 మందే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో ఉన్న గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, గణపతి, మల్లా రాజిరెడ్డి, నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాలరావు వంటి వారిపై రూ.25 లక్షలు, అలాగే స్టేట్ కమిటీలో ఉన్న వారిపై రూ.20 లక్షలు, జిల్లా కమిటీలో ఉన్న వారిపై రూ.10 లక్షలు ఉన్న వారున్నారు.
వ్యూహాత్మకంగా కట్టడి
పోలీసులు పకడ్బందీ వ్యూహంతో మావోయిస్టులను అణచివేశారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో వారిని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయగలిగారు. దీంతో రాష్ట్రంలో అర్బన్ జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మావోయిస్టుల జాడ లేదని ఇంటెలిజెన్స్ రూపొందించిన నివేదికలో స్పష్టం చేసింది. కేవలం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ కదలికలున్నట్లు పేర్కొంది. అంతేకాదు మావోయిస్టులకు కొత్త రిక్రూట్‌మెంట్‌కు అవకాశం లేకుండా పోలీసులు గట్టిదెబ్బ కొట్టారు. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎంటెక్ విద్యార్థిని మహిత అలియాస్ శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుతో కొత్త వారు పార్టీలో చేరేందుకు భయపడేలా చేశారు.
93 మంది మావోయిస్టులు
Published Tue, Jun 21 2016 8:05 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement