Top Maoist Leader Haribhushan Wife Sammakka Dies Of COVID-19 - Sakshi
Sakshi News home page

బావ కోసం దళంలో చేరి...

Published Sun, Jun 27 2021 5:12 AM | Last Updated on Sun, Jun 27 2021 8:47 AM

Sammakka And Haribhushan who died with Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గంగారం: మన్యంలో పుట్టిన ప్రేమకథ.. దండకారణ్యంలో సమాప్తమైంది. కష్టాలు, కన్నీళ్లు, తూటాలు, చట్టాలు, అనారోగ్యం, బంధాలు, బంధువులు ఏవీ వారిని ఆపలేకపోయాయి. చనిపోతావని బంధువులు బెదిరించినా.. ఆమె లెక్కచేయలేదు. బంధాలను తెంచుకుంది. అడవిలో ఉన్న బావను వెతుక్కుంటూ వెళ్లింది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసింది. చివరికి అతనితోపాటే కరోనా వైరస్‌కు బలైపోయింది. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌–జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్‌ కరోనాతో మరణించాడు. 24న సమ్మక్క కూడా వైరస్‌తో పోరాడుతూ చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

బావ వెంటే బతుకు అంటూ...
వీరిద్దరి మరణంతో మహబూబాబాద్‌ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ– సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు ‘సాక్షి’కి చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్‌కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది. 

2012లో తిరిగి అడవిలోకి..
సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్‌ తమ్ముడు అశోక్‌ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement