మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ మృతి | Top Maoist Leader Hari Bhushan Killed In Charla Encounter | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు భారీ షాక్‌ ; అగ్రనేత హరిభూషణ్‌ మృతి

Published Fri, Mar 2 2018 12:22 PM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

Top Maoist Leader Hari Bhushan Killed In Charla Encounter - Sakshi

భద్రాచలం ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలు (ఇన్‌సెట్‌లో హరిభూషణ్‌ పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : నిషేధిత సీపీఐ -మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మృతిచెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. కీలక నేతలు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 12 మంది ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మమిళల్లో హరిభూషణ్‌ సహచరి సమ్మక్క కూడా ఉన్నారు. ఎదురుకాల్పుల్లో పోలీస్‌ కమాండో సుశీల్‌ కూడా చనిపోయారు. ఇదే ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గాయపడినట్లు సమాచారం.

ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు : రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా హరిభూషణ్‌ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉత్తర తెలంగాణాలోని కెకెడబ్ల్యు(ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌) డివిజన్‌లో కార్యకలాపాలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. అగ్రనేతగా ఎప్పటి నుంచో హిట్‌ లిస్టులో ఉన్న హరిభూషణ్‌ కోసం పలుమార్లు ప్రత్యేక ఆపరేషన్లు కూడా జరిగాయి.హరిభూషణ్‌పై దాదాపు 50 కేసులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై రూ.30లక్షల క్యాష్ రివార్డు కూడా ఉంది.

పట్టుకుని చంపేశారా? : సరిగ్గా రెండేళ్ల కిందట (2016, మార్చి 2న) ఇదే భద్రాద్రిజిల్లా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సౌత్ సెంట్రల్ జోన్ కార్యదర్శి లచ్చన్న సహా ఏడుగురు దళ సభ్యులు చనిపోయారు. ఆ ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్ కూడా మృ తి చెందారని ఛత్తీస్‌గఢ్‌ పోలీసు వర్గాలు ప్రకటించాయి. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఆ ప్రకటనను కొట్టిపారేశారు. అదే సమయంలో హరిభూషణ్ దొరికిపోయినట్లు, కీలక నేత కావడంతో ఆయనను రహస్య ప్రాంతంలో  విచారిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రయత్నించిన పోలీసులు ఎట్టకేలకు చర్ల ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్‌ను హతం చేసినట్లు ప్రకటించారు. కాగా, చర్ల ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు సానుభూతిపరులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నాయకులను పోలీసులు ముందే పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, ఈ విషయంలో న్యాయవిచారణకు ఆదేశించాలని శుక్రవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలుచేశారు.


ఏం జరిగింది? : పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తొండపాల్‌  సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్‌-ఈవోఎస్‌ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌ కుమార్‌ మరణించారు. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement