సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్/భద్రాచలం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలోని తడపలగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన గ్రేహౌండ్స్ జవాన్ సుశీల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
రాత్రే చుట్టుముట్టిన పోలీసులు
ఎన్‌కౌంటర్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేడ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మావోయిస్టులు విడిది చేసిన ప్రదేశానికి సంబంధించి పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో మావోయిస్టుల బస ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఉదయం మెరుపుదాడికి దిగినట్లు సమాచారం. మావోయిస్టు మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరణించిన జవాన్‌తో పాటు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతదేహాలను బట్టి వీరిని బుద్రి ఆలియాస్ రేణుకా, సంజీవ్‌గా భావిస్తున్నారు. కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బి.సుశీల్ కుమార్ మరణించగా మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన నాలుగు గ్రేహౌండ్స్ దళాలు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు సమాచారం.
డ్రోన్లను రంగంలోకి దింపారా?
24 నిమిషాలపాటు గాల్లో ఉంటూ 7 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అత్యాధునిక టెక్నాలజీ కల్గిన డ్రోన్లను గ్రేహౌండ్స్ బలగాలు ఛత్తీసగఢ్ సరిహద్దు ప్రాంతంలో రంగంలోకి దించారు. 2.5 కిలోమీటర్ల పై నుంచి 24 మెగాపిక్సల్ ఫొటోలు, వీడియోలు తీసే కెపాసిటీ ఉన్న ఈ డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మృతుల్లో అగ్రనేతలు!
ఎన్‌కౌంటర్‌లో మరణించిన పది మంది మావోయిస్టులు ఎవరన్నది శనివారం రాత్రి వరకు పోలీసులు వెల్లడించలేదు. మృతుల్లో రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ (మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెం), రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లి), ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి కొయ్యడ గోపన్న ఆలియాస్ ఆజాద్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా మండలంలోని మొద్దులగూడెం)తో పాటు కేకేడబ్ల్యూ డివిజన్ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి (కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట) ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. చనిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టుల్లో హరిభూషణ్ భార్య ఉన్నట్లు సమాచారం. మరోవైపు హరిభూషణ్ బంధువులు భద్రాచలం ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలను చూసి.. అందులో అతడు లేడని నిర్ధారణకు వచ్చారు. మిగతా మృతదేహాలు వస్తే తప్ప చెప్పలేమన్నారు. ఎన్‌కౌంటర్ నుంచి హరిభూషణ్ తప్పించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కానీ పోలీసులు దాన్ని ధ్రువీకరించడం లేదు. ఘటనా స్థలంలో ఏకే 47, ఇన్సాన్ రైఫిల్స్ 5, ఓ ఎస్‌ఎల్‌ఆర్ , రెండు సింగిల్ బోర్ రైఫిళ్లు, ఒక 303 తుపాకీ, ఒక పిస్టోల్, ఒక సోనీ రేడియో, మూడు క్లెమోర్ మైన్స్, ఆరు రాకెట్ బాంబులు, రెండు సోలార్ ప్లేట్స్, రూ.41,000 నగదు, విప్లవ సాహిత్యం లభించాయి. ఏకే 47 ఆయుధం లభించడంతో అగ్రనేత ఎవరైనా ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇటీవల పెరిగిన అలజడి
ఇటీవల ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల అలజడి పెరిగింది. ముఖ్యంగా వెంకటాపురం, చర్ల మండలాల పరిధిలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మావోయిస్టులు అమర్చిన బాంబులను పోలీసులు ఐదుసార్లు నిర్వీర్యం చేశారు. ఏడాది వ్యవధిలో వెంకటాపురం మండలం పరిధిలో మావోయిస్టులు నాలుగుసార్లు వాల్ పోస్టర్లు వేశారు. ఫిబ్రవరి 4న వెంకటాపురం మండలం వెదిర గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్ పేల్చి వేశారు. అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో జనవరి 26న దాడి చేసి వాహనాలు దగ్ధం చేశారు. ఈ ప్రాంతంలో హరిభూషణ్ పార్టీ కార్యకలాపాలను, రిక్రూట్‌మెంట్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాడు. మావోయిస్టు పార్టీ గతేడాది నవంబర్ నుంచి పినపాక, చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో 500 మందికిపైగా రిక్రూట్‌మెంట్ చేసినట్టు తెలిసింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ పెరిగింది. సరిహద్దు అడవులను అనువుగా మార్చుకుని తెలంగాణలో ప్రభావం చూపేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం పోలీసులకు ఉంది. దీనికితోడు ఐదు రోజుల కిందట ఐదుగురు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రాబట్టిన సమాచారంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
మృతులపై స్పష్టత రావాలి ఉంది: ఎస్పీ కిశోర్ ఝా
ఛత్తీస్‌గఢ్‌లోని పూసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు కూంబింగ్‌కు వెళ్లినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు బస చేశారని తెలియటంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహించామన్నారు. మావోయిస్టులు తమపై కాల్పులు జరిపారని ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారన్నారు. కొందరు మావోయిస్టులు తప్పించుకుపోవడంతో ఇంకా ఆపరేషన్ జరుగుతోందన్నారు. ఇద్దరు మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మృతదేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించామని, మిగిలిన మృత దేహాలను శనివారం తీసుకొస్తామన్నారు. ఘటన జరిగిన స్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూసురు పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తున్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామన్నారు.
మృతదేహాలను కుళ్లబెడతారా?
ఎన్‌కౌంటర్ మృతదేహాలను సకాలంలో బంధువులకు అప్పగించకపోవటం సరికాదని మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ సోదరి యాప భారతి అన్నారు. హరిభూషణ్ మృతి చెందారన్న ప్రచారం నేపథ్యంలో తమ్ముడు అశోక్‌తో కలసి ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం నుంచి శుక్రవారం భద్రాచలం వచ్చారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఆవేదనతో వచ్చామని, కానీ మృతదేహాలను తరలించటంలో అధికారులు ఇలా వ్యవహరించటం సరైంది కాదన్నారు. చంపేసిన రెండు రోజులకు శవాలను కుళ్లబెట్టి వాటిని బంధువులకు అప్పగిస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మృతుల్లో అన్నయ్య లేడనే అనుకుంటున్నాం. లేకపోతే బాగుంటుందని ఆశ పడుతున్నాం. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఎత్తుకొని జోలపాడిన గుర్తులే తప్ప.. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎలా ఉంటాడో కూడా తెలియదు’’అన్నారు. – హరిభూషణ్ సోదరి భారతి
Comments
Please login to add a commentAdd a comment