Tribal deaths
-
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మృతి
అరకులోయ/పెదబయలు: విశాఖ ఏజెన్సీలో పోలీసు కూంబింగ్ పార్టీల కాల్పులకు ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో ఇద్దరు పరుగులు తీసి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. మృతి చెందిన గిరిజనులు మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యులని పోలీసులు ప్రకటించారు. వేటకు వెళ్లిన ఇద్దరిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపారని పెదకోడాపల్లి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి మెట్టవీధికి చెందిన బట్టి భూషణ్‌రావు (50), సిదేరి జమదరి (35) నాటు తుపాకులను వెంటబెట్టుకుని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి అరనంబయలు కొండ, గంగోడిమెట్ట కొండలపైకి బయల్దేరారు. వారికి సహాయంగా కోడా బొంజుబాబు, సిదేరి రాంబాబు ఉన్నారు. కుందేళ్లు, ఇతర అడవీ జంతువుల వేట కోసం వెళ్లారు. అయితే వారి వేట సాగకపోవడంతో, అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో గ్రామానికి కాలినడకన బయల్దేరారు. నాటు తుపాకులు కలిగి ఉన్న భూషణ్‌రావు, జమదరి ముందు నడుస్తుండగా, వారి వెనుకన బొంజుబాబు, రాంబాబు వెళ్తున్నారు. పెదకోడాపల్లి గ్రామానికి సమీపంలోని బురదమామిడి పంట భూముల సమీపంలోకి రాగానే పోలీసు పార్టీలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ముందు నడుస్తున్న బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక ఉన్న బొంజుబాబు, రాంబాబు తప్పించుకుని సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ నిజమేనని, సుమారు 20 మంది మావోయిస్టులు సంచరిస్తుండడంతో వారిపై కాల్పులు జరిపామని ప్రకటించారు. భగ్గుమన్న గిరిజనులు కాల్పుల్లో మృతి చెందిన బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి మావోయిస్టు సభ్యులని పోలీసులు చెప్పడంపై పెదకోడాపల్లి గిరిజనులంతా భగ్గుమన్నారు. దకోడాపల్లి పంచాయతీలోని గిరిజనులంతా శనివారం మధ్యాహ్నం పాడేరుకు చేరుకుని పోలీసుల తీరుపై నిరసన ప్రదర్శన చేశారు. పాడేరు సబ్‌కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. పోలీసులు కాల్పులు జరపడంపై న్యాయ విచారణ చేసి, బాధిత గిరిజనుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే పెదకోడాపల్లి అటవీ ప్రాంతంలో పోలీసు కూంబింగ్ పార్టీలు అధికంగా సంచరించాయి. నాటు తుపాకులు కలిగిన ఉన్నందున వారిని మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్ ద్వారా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ఆదివాసీ మరణాలు
- అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు - కలెక్టర్ల సదస్సు రెండో రోజూ జిల్లాపై చర్చ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలో ఏటా జరుగుతున్న ఆదివాసీల మరణాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందుస్తు ప్రణాళిక సిద్దం చేయాలని సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో వర్షా కాలంలో విజృంభించే విషజ్వరాల అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. అలాగే మిషన్ కాకతీయ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది చేపట్టిన పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మిషన్ కాకతీయ పనుల్లో భాగస్వాములుగా చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వారందరికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సులో కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్, జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్చ్.. నిరాశే..!
‘గిరి’ మరణాలపై ఎలాంటి హామీ ఇవ్వని డిప్యూటీ సీఎం * మొక్కుబడిగా జిల్లా పర్యటన * రిమ్స్, ఉట్నూర్ సీహెచ్‌సీ సందర్శన ఆదిలాబాద్ రిమ్స్/టౌన్/అర్బన్ : ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య జిల్లా తొలి పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. పిట్టల్లా రాలుతున్న గిరిజన మరణాలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని అందరూ భావించారు. అలాగే రిఫరల్ ఆసుపత్రిగా తయారైన రిమ్స్ స్థితిగతులు కాస్తయినా మెరుగుపడతాయని ఆశించారు. కానీ ఈ పర్యటన ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎంపర్యటన అంతా మొక్కుబడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకున్న రాజయ్యకు మంత్రి జోగు రామన్న, కలెక్టర్ ఎం.జగన్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. నేరుగా రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని.. అక్కడ రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ ఎస్డీపీ యంత్రాన్ని ప్రారంభించారు. చిన్నపిల్లల వార్డుకు వెళ్లి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా చిన్నపిల్లకు వైద్య పరీక్ష చేశారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ప్రసూతి విభాగంలోకి వెళ్లారు. అక్కడ బాలింతలకు సూచనలు అందించారు. తమకు రిమ్స్‌లో సరైన వైద్యం అందడం లేదని కొందరు రోగులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఆయన పెద్దగా స్పందించలేదు. అనంతరం రిమ్స్ ఆవరణలో ఉన్న స్థలాన్ని పరిశీలించిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అక్కడి నుంచి జెడ్పీ సమావేశం హాలుకు చేరుకుని వైద్యారోగ్య, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మీడియాను అనుమతించలేదు. అనంతరం ఇంద్రవెల్లి చేరుకుని అక్కడి పీహెచ్‌సీని పరిశీలిస్తారని జిల్లా అధికార యంత్రాంగం భావించింది. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన రాజయ్య ఉట్నూర్‌కు చేరుకుని అక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల హామీ మేరకు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిమ్స్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం నుంచి రూ.120 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు, రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. పీహెచ్‌సీలు, ఏరియాసుపత్రులకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ గజరావు భూపాల్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ జోయల్ డేవిస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. 104 బడ్జెట్‌ను రిలీవ్ చేయాలి.. జిల్లాలోని 104 సర్వీసులకు బడ్జెటన్‌ను రిలీవ్ చేయాలని కోరుతూ 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. బడ్జెట్ లేక ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని, వాహనాలు మూలన పడుతున్నా మరమ్మతులు చేయడం లేదని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో 104 సేవలు అందేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో యూనియన్ నాయకులు నవీన్‌కుమార్, నాగ్నాథ్, ఇబ్రహిం, సుభాష్, సురేందర్ ఉన్నారు. రెసిడెన్షియల్ హాస్టల్లో మెడికల్ క్యాంపు పెట్టాలి.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ప్రతి వారం మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నాయకులు ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు ఆర్థికంగా పేదవారని, వీరు అనారోగ్య బారిన పడితే నాణ్యమైన వైద్యం అందడం లేదని తెలిపారు. జిల్లాలోని ప్రతి హాస్టల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, నాయకులు ఉన్నారు.