ప్చ్.. నిరాశే..! | Deputy Chief Minister T. RAJAIAH First tour of district | Sakshi
Sakshi News home page

ప్చ్.. నిరాశే..!

Published Thu, Oct 30 2014 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

ప్చ్.. నిరాశే..!

ప్చ్.. నిరాశే..!

‘గిరి’ మరణాలపై ఎలాంటి హామీ ఇవ్వని డిప్యూటీ సీఎం
* మొక్కుబడిగా జిల్లా పర్యటన
* రిమ్స్, ఉట్నూర్ సీహెచ్‌సీ సందర్శన

ఆదిలాబాద్ రిమ్స్/టౌన్/అర్బన్ : ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య జిల్లా తొలి పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. పిట్టల్లా రాలుతున్న గిరిజన మరణాలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని అందరూ భావించారు. అలాగే రిఫరల్ ఆసుపత్రిగా తయారైన రిమ్స్ స్థితిగతులు కాస్తయినా మెరుగుపడతాయని ఆశించారు. కానీ ఈ పర్యటన ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎంపర్యటన అంతా మొక్కుబడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకున్న రాజయ్యకు మంత్రి జోగు రామన్న, కలెక్టర్ ఎం.జగన్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

నేరుగా రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని.. అక్కడ రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లేట్‌లెట్స్ ఎస్డీపీ యంత్రాన్ని ప్రారంభించారు. చిన్నపిల్లల వార్డుకు వెళ్లి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా చిన్నపిల్లకు వైద్య పరీక్ష చేశారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ప్రసూతి విభాగంలోకి వెళ్లారు. అక్కడ బాలింతలకు సూచనలు అందించారు. తమకు రిమ్స్‌లో సరైన వైద్యం అందడం లేదని కొందరు రోగులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఆయన పెద్దగా స్పందించలేదు.

అనంతరం రిమ్స్ ఆవరణలో ఉన్న స్థలాన్ని పరిశీలించిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అక్కడి నుంచి జెడ్పీ సమావేశం హాలుకు చేరుకుని వైద్యారోగ్య, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మీడియాను అనుమతించలేదు. అనంతరం ఇంద్రవెల్లి చేరుకుని అక్కడి పీహెచ్‌సీని పరిశీలిస్తారని జిల్లా అధికార యంత్రాంగం భావించింది. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన రాజయ్య ఉట్నూర్‌కు చేరుకుని అక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.
 
ఎన్నికల హామీ మేరకు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిమ్స్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం నుంచి రూ.120 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు, రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. పీహెచ్‌సీలు, ఏరియాసుపత్రులకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ గజరావు భూపాల్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ జోయల్ డేవిస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు.
 
104 బడ్జెట్‌ను రిలీవ్ చేయాలి..

జిల్లాలోని 104 సర్వీసులకు బడ్జెటన్‌ను రిలీవ్ చేయాలని కోరుతూ 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. బడ్జెట్ లేక ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని, వాహనాలు మూలన పడుతున్నా మరమ్మతులు చేయడం లేదని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో 104 సేవలు అందేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో యూనియన్ నాయకులు నవీన్‌కుమార్, నాగ్‌నాథ్, ఇబ్రహిం, సుభాష్, సురేందర్ ఉన్నారు.
 
రెసిడెన్షియల్ హాస్టల్‌లో మెడికల్ క్యాంపు పెట్టాలి..
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ప్రతి వారం మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నాయకులు ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు ఆర్థికంగా పేదవారని, వీరు అనారోగ్య బారిన పడితే నాణ్యమైన వైద్యం అందడం లేదని తెలిపారు. జిల్లాలోని ప్రతి హాస్టల్‌లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement