‘మావో’..రేవో! | Maybe bauxite havoc again | Sakshi
Sakshi News home page

‘మావో’..రేవో!

Published Mon, Aug 25 2014 1:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

‘మావో’..రేవో! - Sakshi

‘మావో’..రేవో!

  •     బాక్సైట్‌పై మన్యంలో మళ్లీ అలజడి
  •      బహిరంగంగా మావోయిస్టుల సభలు
  •      భారీ విధ్వంసాలకు వ్యూహం?
  • ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీలో మళ్లీ యుద్ధమేఘాలు అలముకున్నాయి. బాక్సైట్‌పై చావో రేవో అన్నట్లు మావోయిస్టులు ఉద్యమాన్ని ముందుకు నడపాలని భావిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ కాస్త ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, కేవలం మిలీషియా వ్యవస్థే కొద్దిపాటిగా పని చేస్తోందని పోలీసు యంత్రాంగం భావిస్తున్న తరుణంలో.. అగ్నికి ఆజ్యం పోసినట్లు బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రశాంతమైన మన్యంలో అశాంతికి కారణమైంది.
     
    పాడేరు: గిరిజనుల్లో తమ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో మావోయిస్టులంతా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో బాకై ్సట్ తవ్వకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉండటంతో ఈ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో బాకై ్సట్ వ్యతిరేక ఉద్యమాన్ని మావోయిస్టులు ఉధృతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యమంతో మావోయిస్టు పార్టీ గిరిజనులతో మమేకమయ్యేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో ప్రజాకోర్టుల నిర్వహణను వేగవంతం చేస్తోంది. ఏజెన్సీలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలను కూడా బాకై ్సట్ ఉద్యమానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రకటనలు చేస్తోంది.
     
    అలజడి మొదలైంది ఇలా..!
     
    కొద్దిరోజుల క్రితం జి.మాడుగుల మండలంలోని మారుమూల కిల్లంకోట ప్రాంతంలో పోలీసు ఇన్‌ఫార్మర్ పేరిట బాలకృష్ణ అనే గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. ప్రజాకోర్టును నిర్వహించారు. తాజాగా శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దులో గాలికొండ దళ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాక్సైట్ వ్యతిరేక సదస్సును నిర్వహించిన విషయం విదితమే. ఈ సదస్సుకు ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో మావోయిస్టు పార్టీలో నూతనోత్సాహం ఏర్పడింది. అలాగే ఒడిశాలోని మాచ్‌ఖండ్ ఏఎస్‌ఐ నివాస గృహంలో బాంబులు అమర్చి మరింత భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే తరహాలో అన్ని మారుమూల గ్రామాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల పేరిట సదస్సులు నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం.  
     
    మావోయిస్టు పార్టీకి కొత్త క్యాడర్?
     
    ఏఓబీ, విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు కొత్తక్యాడర్ రూపుదిద్దుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల ఏఓబీలో సంచరించి కీలకమైన సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఛతీస్‌ఘడ్ రాష్ట్రంలో పని చేసిన కొంత మంది మావోయిస్టు నేతలను ఏఓబీలోకి రప్పించినట్లు తెలుస్తుంది. గాలికొండ, కోరుకొండ దళాల్లో కూడా కొత్తక్యాడర్ నియమితులైనట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాలను వేదికగా చేసుకొని కొత్త దళాల ఏర్పాటు, యువతను భాగస్వామ్యం చేసి మావోయిస్టు ఉద్యమాన్ని మరింత ఉధతం చేసే ఆలోచనలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో గ్రామస్థాయి పోరాట కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి.
     
    పోలీసుల్లో గుబులు!
     
    మావోయిస్టుల ఉనికి లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మళ్లీ గట్టి నిఘా పెట్టాల్సివస్తోంది. ఇందుకు ఇన్‌ఫార్మర్ల వ్యవస్థపైనే వారు అధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
     
    ఉలిక్కిపడిన పోలీసులు
     
    సీలేరు : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఒకే రోజు మావోయిస్టులకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంత పోలీసులు ఉలిక్కి పడ్డారు. కొయ్యూరు, జీకేవీధి సరిహద్దు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టడం, ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం, ఒడిశా ఒనకఢిల్లీలో ఒక పోలీసు అధికారి ఇంటిలో మావోయిస్టులు బాంబు పెట్టారన్న అంశాలు కలకలం రేపడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు.
     
    సీలేరులో ఆదివారం జరిగిన వారపుసంతలో సీఆర్‌పీఎఫ్ బలగాలు అణువణువూ గాలింపు చేపట్టారు. అనుమానితులను ఆరాతీసి విడిచిపెట్టారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు ఉపక్రమిస్తే బుద్ధి చెబుతామని ప్రకటించడంతో, అధికార పార్టీ కావడంతో టీడీపీ నాయకులకు గుబులు పట్టుకుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement