సాక్షి,విశాఖపట్నం: ‘అసలే పీకల్లోతు బాధల్లో ఉన్నాను. ఇప్పుడున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాను. మీరొచ్చి మీ బాధలు చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలు నాకేం చెప్పొద్దు. ఏదోలా మీరే పరిష్కరించుకోండి. నా వరకు తీసుకురావద్దు’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పార్టీ నేతలపై రుసరుసలాడారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు విశాఖలోని 15 నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కమిటీలతో శనివారం ఐదు గంటల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎక్కడికక్కడ ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు.
జనం మనల్ని నమ్మడం లేద ని కొందరు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సీమాంధ్రలో కాంగ్రెస్ నుంచి చాలామంది బయటకు రావాలని చూస్తున్నారని, అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాలని, ప్రజాబలం ఉన్నా లేకపోయినా పార్టీలోకి ఆహ్వానించాలని ఆదేశించినట్టు సమాచారం. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశాఖ ఏజెన్సీలో కొందరు గంజాయి, దొంగనోట్ల పంపిణీ కేసుల్లో చిక్కుకున్న వారికి వారికి పార్టీలోని కొందరు మద్దతుగా నిలుస్తున్నారని, ఇలాంటి విషయాలు జిల్లా నేతల వద్దే తేల్చుకోవాలని బాబు సలహా ఇచ్చినట్టు భోగట్టా.
తమ నియోజకవర్గంలో ఇన్‌చార్జిని నియమించలేదని, దీనివల్ల పార్టీపరంగా కార్యక్రమాలకూ ఎవరూ ముందుకు రావడం లేదనగానే బాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తనకు చాలా సమస్యలున్నాయని, విభజన విషయంలో తలెత్తే విమర్శలు, పార్టీని కాపాడుకోవడం వంటి అనేక బాధలున్నా యని, మీ సమస్యలు నాకు చెప్పొద్దంటూ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఇప్పట్లో ఇన్‌చార్జిల నియామకం కూడా ఉండదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో దెబ్బతిన్న పార్టీకి మళ్లీ ప్రజల్లో బలం పెరిగేలా త్వరలో అన్నిప్రాంతాలతోపాటు విశాఖలో పర్యటిస్తానని, జనాన్ని సమీకరించాలని చెప్పి సమావేశం ముగించారు.
సమస్యల్లో ఉన్నా.. బాధలు చెప్పొద్దు
Published Sun, Sep 29 2013 1:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement