తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్‌ ప్లాన్‌ ఫలిస్తుందా? | Ksr Comments On Telangana Government's Demolition Of Film Actor Nagarjuna's N Convention Centre | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్‌ ప్లాన్‌ ఫలిస్తుందా?

Published Mon, Aug 26 2024 11:26 AM | Last Updated on Mon, Aug 26 2024 3:30 PM

Ksr Comments On Telangana Government's Demolition Of Film Actor Nagarjuna's N Convention Centre

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారా? లేక హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం కట్టారా? అన్నది ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ హైడ్రా కూల్చివేసిన తీరు అత్యంత సంచలనమే అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ వివాదం నడుస్తున్నప్పటికీ, ఇంత ఆకస్మికంగా రేవంత్ సర్కార్ ఇలా కూల్చివేతకు దిగుతుందని ఎవరూ ఉహించలేదు. అలాగే గండిపేట, తదితర కొన్ని చెరువులలోని ఆక్రమణలు, ఫుల్ టాంక్ లెవెల్ లోపు ఉన్న ఇళ్లను కూడా కూల్చివేశారు. వీటిలో పలు ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి.

నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ఉత్తర్వులు వచ్చేలోగానే అధికారులు కూల్చే పని దాదాపు పూర్తి చేశారు. తొలుత ఈ కూల్చివేతల పర్వం ఆరంభం అయినప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. తదుపరి మరికొన్ని కూల్చివేతలలో ఇతర పార్టీలకు చెందినవారి ఆస్తులు కూడా ఉండడంతో ఏమి జరుగుతుందా అని అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. కొందరిలో భయం కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్‌లో చేరిన  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైడ్రా నోటీసు ఇవ్వడం, హైడ్రా ఉన్నతాధికారి రంగనాథ్‌పై నాగేందర్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగాయి.

కొన్నిచోట్ల ఎంఐఎంకి చెందిన కొంతమంది చోటా నేతల అక్రమ భవనాలను కూడా తొలగించారు. ఈ మొత్తం ప్రక్రియను కేవలం హైదరాబాద్‌ను వరదలు, కాలనీల మునక నుంచి రక్షించడానికే ఆరంభించారన్న భావన కలిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనిపిస్తుంది. కానీ, తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి, హామీలను అమలు చేయలేకపోవడం, ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి రేవంత్ సర్కార్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు విమర్శించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉందని చెప్పాలి.


స్వార్థపరులు కొందరు చెరువులు, నదులు, నాలాలు, తదితర వాటర్ బాడీస్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. కొంతమంది బిల్డర్లు చెరువులలో ఆక్రమిత స్థలాలలో అపార్టుమెంట్ నిర్మించి మధ్య తరగతివారికి అమ్మేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ విశేషం ఏమిటంటే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కృష్ణానది ఒడ్డున ఒక అక్రమ నిర్మాణంలో నివసించడం. ఆయన ఆ ఇల్లు ప్రభుత్వానిదని ఒకసారి, ప్రైవేటు ఆస్తి అని మరో సారి చెప్పారు. ఎలాగైతేనేం గత తొమ్మిదేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అంతేకాక తన ఇంటి చెంతనే ప్రభుత్వ ధనంతో అక్రమంగా ప్రజావేదిక పేరుతో ఒక హాల్ నిర్మించారు. దానిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూల్చివేస్తే విధ్వంసం అంటూ తెలుగుదేశంతోపాటు జనసేన, బీజేపీ తదితర అప్పటి ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.

టీడీపీ మీడియా ఈనాడు, జ్యోతి వంటివి కూడా దానిని విధ్వంసంగానే చిత్రీకరించి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృషి చేశాయి తప్ప, నదీ గర్భంలో అక్రమంగా ప్రభుత్వమే నిర్మాణం చేస్తే ఎలా అని ప్రశ్నించలేదు. తెలంగాణలో మాత్రం రేవంత్‌కు వ్యతిరేకంగా ఒక ముక్క రాయడం లేదు. ఇది విధ్వంసం అని ఆ మీడియా వ్యాఖ్యానించడం లేదు. అక్రమ నిర్మాణాలే అని చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటితో పాటు పలు ఇతర భవనాలు కూడా కృష్ణా తీరాన ఉన్నాయి. వాటి నుంచి మురుగు నదిలోకి వెళుతోందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఏమైనా చర్య తీసుకుందామని ఆలోచించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేశారు.

అదే తెలంగాణలో గత కొన్ని రోజులుగా కాని, అంతకు ముందుకాని చెరువుల శిఖం భూములలోని నిర్మాణాలను కూల్చి వేస్తుంటే ప్రతిపక్షాలు ఏవీ నేరుగా విమర్శించడం లేదు. బీజేపీ ఎంపీ రఘునందనరావు అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొంచెం భిన్నంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన  బీఆర్‌ఎస్‌ ఇందులో రాజకీయ కక్ష, పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తోందే తప్ప, ఈ కూల్చివేతలు చేయవద్దని చెప్పలేదు. కాకపోతే కొందరు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖుల ఇళ్లు కూడా హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల భూములలో ఉన్నా వాటి జోలికి వెళ్లడం లేదని విమర్శించింది.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి6 చానల్ అధినేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తదితరుల ఫామ్ హౌస్‌ల ఫోటోలను కూడా తీసి వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక రెండు పేజీల కథనాలు ఇచ్చింది. అలాగే ఓవైసీ కాలేజీ ఫోటోలను కూడా ప్రచురించారు. కాగా  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన విద్యా సంస్థలకు కూడా అధికారులు నోటీసు ఇచ్చారు. ఇది కక్షపూరితమేనని  బీఆర్‌ఎస్‌ అంటోంది. ఇంతవరకు హైడ్రా దాడులకు గురైనవారిలో ఎక్కువ మంది  బీఆర్‌ఎస్‌ వారే ఉన్నారని చెబుతున్నారు. కాని హైడ్రా మాత్రం తాము ఎవరి పట్ల పక్షపాతం చూపడం లేదని స్పష్టం చేస్తోంది.

నాగార్జున సెలెబ్రెటి కావడంతో ఆయన ఫంక్షన్ హాల్ కూల్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన తన కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చడం చట్ట విరుద్దం అని, ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని ప్రభుత్వంపై వ్యాఖ్యానించారు. నాగార్జున గత ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల కూడా ఇప్పుడు టార్గెట్ అయ్యారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో ఉంది. చెరువులు, కాల్వలలోకి నీరు రాకుండా ఎవరు ఏ నిర్మాణం చేపట్టినా తొలగించవలసిందే. ఎన్‌ కన్వెన్షన్ వల్ల కూడా అలాంటి నష్టం జరుగుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే టెక్నికల్‌గా అది చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వస్తుందని అంటున్నారు. నాగార్జున వంటి ప్రముఖుల భవనాన్ని కూల్చితే అది సమాజానికి ఒక సంకేతం ఇచ్చినట్లవుతుందని, ఇతరులు ఇలా చెరువులు ఆక్రమించకుండా ఉంటారన్నది ప్రభుత్వ అధికారుల వాదనగా ఉంది. పైగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా ఎన్‌ కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు.

హైడ్రా లిస్ట్ లో ఒవైసీ కాలేజీ.. ఇంకా ఎవరెవరు ఉన్నారు ?

నిజంగానే ఇదే స్పీడ్‌తో రేవంత్ ప్రభుత్వం చెరువులను ఆక్రమించి నిర్మించిన వాటన్నిటిని కూల్చివేయగలుగుతుందా? అనే మీమాంస ఏర్పడుతోంది. హైదరాబాద్‌లో కాని, చుట్టుపక్కల కాని వందల చెరువులు కబ్జాలకు గురై పోయాయి. ఖైరతాబాద్, సరూర్ నగర్, సైనిక్ పురి, యూసఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ, ఫిర్జాదీగూడ తదితర పలు చోట్ల చెరువుల చుట్టూరా ఇళ్లు వచ్చేశాయి. మూసినది వెంట అనేక కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో అత్యధికంగా పేదలు, దిగువ మధ్య తరగతివారు నివసిస్తున్నారు. మూసినది ఆధునీకరణలో భాగంగా వాటిని తొలగించగలుగుతారా? అన్నది చూడాలి. దానివల్ల రాజకీయంగానే కాక, సామాజికంగా కూడా చాలా చిక్కులు వస్తాయి. పైగా ఇళ్లు కోల్పోయినవారు లక్షలలో నష్టపోతారు. ఇప్పటికే కూల్చివేసిన అపార్టుమెంట్లను కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. ఇలాంటివారిని సమర్థించజాలం కాని ఎవరో చేసిన తప్పుకు వీరు బలి అవుతారు. ఈ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

అవినీతికి పాల్పడ్డ అధికారులు, రాజకీయ నేతలపై కూడా చర్యలు తీసుకుంటారా? లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూల్చివేతకు గురైన వాటిలో ఎన్నిటికి బ్యాంకులు రుణాలు ఇచ్చాయో, వాటి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం. హుస్సేన్ సాగర్ చుట్టూ గతంలో ప్రభుత్వమే కొన్ని నిర్మాణాలు చేసింది. ఆ సమీపంలో కూడా ఎప్పటి నుంచో కాలనీలు వచ్చేశాయి. వాటిని కదలించే పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు నెక్లెస్ రోడ్డు అయితే హుస్సేన్ సాగర్‌ను కొంతమేర పూడ్చి నిర్మించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా చెరువుల చెంత ఉన్నాయని వాటిని ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. గండిపేటలోని టీడీపీ ఆఫీస్ కూడా చెరువులోనే ఉందన్నది  బీఆర్‌ఎస్‌ తాజా విమర్శ. దాని జోలికి వెళ్లే ధైర్యం రేవంత్ సర్కార్ చేస్తుందా? ఇవి కాకుండా ప్రభుత్వ స్థలాలు, ట్రస్టుల భూముల స్థలాలలో నిర్మించిన వివాదాలు చాలానే ఉన్నాయి.

అయ్యప్ప సొసైటి భూముల వ్యవహారం తెలిసిందే. ఇలాంటి  వాటి జోలికి వెళితే తేనెతుట్టె కదల్చినట్లే కావచ్చు. అందుకే రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొన్ని కీలకమైన చోట్ల ప్రత్యేకించి చెరువులలోని నిర్మాణాలను తీసివేయడానికి పూనుకున్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్‌ను రక్షించడానికే తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోందని, ఇలా చేయలేకపోతే తాను వైఫల్యం చెందినట్లే అని అన్నారు. చెరువుల ఆక్రమణదారులలో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉన్నారని అన్నారు. ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగస్వాములైనవారు కూడా ఉండవచ్చని రేవంత్ వ్యాఖ్యానించడం గమనించవలసిన అంశం.

ఇప్పటికే పొంగులేటితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా గండిపేట తదితర చోట్ల ఫార్మ్ హౌస్‌లు నిర్మించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే పొంగులేటి తను ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణం చేయలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిని చివరికంటా కొనసాగించడం అంత తేలికైన పనికాదు. గతంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలు, చెరువు కబ్జాలపై కొంత హడావుడి చేసినా, ఆ తర్వాత వదలివేసింది. అప్పుడు కూడా  బీఆర్‌ఎస్‌పై విమర్శలు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా  మధ్యలో కూల్చివేతలు  ఆపితే రకరకాల ఆరోపణలు రావచ్చు. పార్టీ నిధులు పోగు చేయడానికి,  బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకు రావడానికి ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని కనుక ప్రచారం ఆరంభమై, ప్రజలు దానిని నమ్మడం మొదలైతే మాత్రం రేవంత్ ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. అలాకాకుండా చిత్తశుద్ధితో కొనసాగిస్తే మంచిపేరే రావచ్చు.

అందులో కూడా సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు పీవీ నరసింహారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు భూ సంస్కరణలను అమలు చేయడానికి సంకల్పించారు. అది ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో చేరి దానిని తీవ్రం చేశారని, దాంతో పీవీ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిందని అంటారు. ఎన్.టి రామారావు మద్య నిషేధాన్ని గట్టిగా అమలు చేయడం ఇష్టం లేని కొన్ని వర్గాలు ఆయనను పదవి నుంచి దించివేయడానికి చంద్రబాబు నాయుడుకు సహకరించాయన్న ప్రచారం కూడా లేకపోలేదు. కొన్ని సార్లు మంచి పనులు చేయడానికి ప్రయత్నించినా పదవీ గండం రావచ్చు. లేదా వేరే ఉద్దేశ్యాలతో ఈ చర్యలకు దిగినా పదవులకు చేటు రావచ్చు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఉండే వర్గపోరు ఎటు తీసుకువెళ్లేది చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్‌కు కాంగ్రెస్‌లో మద్దతు బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అవరోధాలు అన్నిటిని తట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక విజయవంతంగా చెరువుల ఆక్రమణలను నిర్మూలించి ప్రజల మన్నన చూరగొంటే ఆయన తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నవారు అవుతారు.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement