=అటవీ హక్కుల కల్పనలో అగ్రస్థానం
=రాష్ట్రంలోనే ముందంజలో ఉండాలి
=రెవెన్యూ, అటవీ శాఖలదే బాధ్యత
=ఐటీడీఏ పీవో వినయ్‌చంద్
పాడేరు, న్యూస్‌లైన్: అటవీహక్కుల చట్టం అమలులో విశాఖ ఏజెన్సీ రాష్ట్రం లోనే మొదటిస్థానంలో ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ ఆకాంక్షించారు. ఏజెన్సీలోఅటవీ హక్కు ల చట్టం అమలులో భాగంగా రెండు విడతల భూ పట్టాల పంపిణీ, భూము ల సర్వేపై గురువారం తన కార్యాల యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతుల సాగులో ఉన్న భూములకు పట్టాలు పంపిణీ చేసి గిరిజనులకు సామాజిక హోదా కల్పిం చాలని కోరారు.
అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి అటవీ భూములపై సర్వే నిర్వహించి రికార్డులను వెంటనే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేయడం వలన అభ్యంతరాలు ఉత్పన్నం కావని చెప్పారు. సర్వే చేసిన భూముల వివరాలను జిల్లా స్థాయీ సంఘానికి పంపించి అనుమతులు పొందాలని కోరారు. ఇప్పటివరకు 7500 క్లెయిములకుగాను 7068 క్లెయిములకు సంబంధించి సర్వే పూర్తి చేశారని చెప్పారు.
అటవీహక్కుల భూముల సర్వేపై ప్రతి వారం ప్రగతి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి నివేదికలు కచ్చితంగా ఉండాలని కోరారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు తెలియజేయవద్దని చెప్పారు. రహదారుల నిర్మాణంతోనే గిరిజనాభివృద్ధి ఆధారపడి ఉందని చెప్పారు. కించూరు రోడ్డు నిర్మాణానికి గల అభ్యంతరాల గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కించూరు రోడ్డు పూర్తయితే పాడేరు, పెదబయలు మండలాల్లోని 50 గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో డివిజనల్ అటవీశాఖ అధికారి ఎస్.శాంతారామ్, పాడేరు ఆర్‌డీవో ఎం.గణపతిరావు, ఐటీడీఏ ఎపీవో పీవీఎస్‌నాయుడు, 11 మండలాల తహశీల్దారులు, అటవీశాఖ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.