
హుకుంపేట–అరకు రోడ్డులో రంగశీల వద్ద నీటమునిగిన పంట పొలాలు
మన్యం మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో ఏజెన్సీ పూర్తిగా జలమయమైంది. అరకులోయ, అనంతగిరి డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, హుకుంపేట, జి,కె.వీధి, కొయ్యూరు మండలాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రంతా కుండపోతగా భారీ వర్షం కురవడంతో మారుమూల గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటు కాలం గడిపారు. శుక్రవారం కూడా వర్షం తెరిపినివ్వకపోవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అరకులోయ, అనంతగిరి ఘాట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పర్యాటక ప్రాంతాలు కళతప్పాయి. మత్స్యగెడ్డలో వరద నీరు పొటేత్తింది. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సాక్షి, అరకులోయ: కుండపోతగా కురిసిన భారీవర్షంతో ఏజెన్సీలోని ప్రధాన గెడ్డలు, కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు పోటెత్తడంతో సమీప గ్రామాల గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.
పొంగిన మత్స్యగెడ్డ..
పాడేరు, జి.మాడుగుల ప్రాంతాలలో కురిసిన భారీవర్షాలకు మత్స్యగెడ్డలో వరద నీరు పొటేత్తింది. మత్స్యగుండం వద్ద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. హుకుంపేట మండలంలోని మఠం, శోభకోట, మట్టుజోరు, తీగలవలస పంచాయతీల గిరిజనులంతా మత్స్యగెడ్డలో వరదనీరు పరవళ్లు తొక్కుతుండడంతో గెడ్డను దాటేందుకు గిరిజనులు సాహసించడం లేదు.
పోటెత్తిన వరద నీరు..
పరదానిపుట్టు కాజ్‌వే మీదుగా మత్య్సగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెదకోడాపల్లి–గుత్తులపుట్టు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే పాడేరు నుంచి హుకుంపేట మీదుగా రాళ్లగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. హుకుంపేట సమీపంలోని చీడిపుట్టు కాజ్‌వే మీదుగా వరద నీరు పోటెత్తింది. రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోవడంతో హుకుంపేట మండలంలోని అడ్డుమండ, బారామోసి, గడికించుమండ పంచాయతీల గ్రామాల గిరిజనులు రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు. సంతారి, దిగుడుపుట్టు గెడ్డలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
దెబ్బతిన్న రవాణా సౌకర్యాలు..
డుంబ్రిగుడ మండలంలోని అన్ని ప్రధాన గెడ్డలలో వరదనీరు అధికంగా ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. మారుమూల గోమంగి, గుల్లెలు, జామిగుడ ,బొంగరం, లింగేటి, కుమడ, లక్ష్మిపురం ప్రాంతాల్లో గెడ్డల వరద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. జోలాపుట్టు రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదిలారు.
ముంపులో వరి నాట్లు..
భారీవర్షాలు ఖరీఫ్ వ్యవసాయానికి కొంత నష్టాన్ని కలిగించాయి. లోతట్టు ప్రాంతాల్లో పొలాలు మునిగిపోయాయి.కొండవాగుల నుంచి వచ్చిన వరదనీరు పొలాల్లోకి వచ్చేయడంతో చాలాచోట్ల వరి నాట్లు కొట్టుకుపోయాయి. హుకుంపేట మండలంలోని రంగశీల,కొట్నాపల్లి,తడిగిరి,పాతకోట,సూకూరు,కొంతిలి.ములియాపుట్టు, పంచాయతీల్లో పంట భూములపై వరదనీరు పారింది.
చెరువులను తలపిస్తున్న పొలాలు..
తడిగిరి పంచాయతీలోని ఉక్కుర్బ గ్రామ సమీపంలో కొండవాగు పంట పొలాలను ముంచేసింది. సుమారు 30 ఎకరాల వరి పొలాలల్లో ఇసుక, మట్టి మేటలు వేసింది. హుకుంపేట–అరకు రోడ్డులోని బలోర్డ, రంగశీల ప్రాంతాల్లోని కొండవాగుల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఖరీఫ్ వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఖరీఫ్ పంట భూములను వరదనీరు ముంచెత్తింది.
కొట్టుకుపోయిన మత్స్యపురం వంతెన..
రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హుకుంపేట మండలంలోని పెదగరువు సమీపంలో మత్స్యపురం వంతెన శుక్రవారం ఉదయం కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని కొట్నాపల్లి పంచాయతీ, బిసాయిపుట్టు, మత్స్యపురం, పందిమెట్ట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద వంతెన కొట్టుకుపోవడంతో ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.10 గ్రామాల గిరిజనులకు రవాణా స్తంభించింది.
కొట్టుకుపోయిన లింగాపుట్టు కల్వర్టు..
పాడేరు రూరల్: అల్పపీడన ప్రభావంతో మన్యంలో నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి మండలంలోని గొండెలి పంచాయతీ లింగాపుట్టు వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్వర్టుకు అటువైపుగా ఉన్న గొండెలి, కించూరు, బడిమెల పంచాయతీల పరిధిలోని సుమారు 15 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వంతెన పనులు నేటికీ పూర్తికాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షానికి కాలువ పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వారు వాపోతన్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేయాలని పరిసర గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. బొక్కెళ్లు వద్ద రాయిగెడ్డ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
స్తంభించిన రాకపోకలు..
ముంచంగిపుట్టు/పెదబయలు (అరకు): మండలంలో వారం రోజుల నుంచి కురుసున్న వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామాల గిరిజనులు గెడ్డలుదాటి రావడానికి ఇబ్బందిగా మారింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని బుంగాపుట్టు, లక్ష్మీపురం. రంగబయలు, బూషిపుట్టు గ్రామాలకు వెళ్లే మార్గంలో గెడ్డలు పొంగి ప్రవహించడంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. బుంగాపుట్టుకు వెళ్లే మార్గంలో ముం త గుమ్మి, బిరిగూడ గెడ్డలు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. వనగుమ్మ పంచాయ తీ తర్లగుడ గ్రామానికి వెళ్లే కల్వర్టు ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది. గ్రామస్తులు విద్యుత్ స్తంభాన్ని వారధిగా ఏర్పాటుచేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ముంచంగి పుట్టు నుంచి రూడకోట, కుమడ పంచాయతీలకు వెళ్లే మార్గంలో గెండిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయా యి. ప్రధాన రోడ్లు జలమయం అయ్యాయి.
వంద గ్రామాలకు స్తంభించిన రాకపోకలు..
జి.మాడుగుల (పాడేరు): మండలంలో గురువారం కురిసిన కుండపోత వర్షానికి జి.మాడుగుల– మద్దిగరువు ఆర్‌అండ్‌బి మార్గంలో సూరిమెట్ట వద్ద పైపు కల్వర్టు, అప్రోచ్ రోడ్డు కోతకు గురై కొట్టుకుపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. సూరిమెట్ట పైపు కల్వర్టు, అప్రోచ్‌రోడ్లు ధ్వంసమవడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కల్వర్టు, అప్రోచ్‌రోడ్డు నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
పెద్దేరుకు వరద నీరు..
మాడుగుల: ఎగువు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం తెల్లవారుజా మును నుంచి వర్షం కురుస్తూనే ఉంది. జలాశయం డ్యామ్ ప్రాంతంలో 60 ఎంఎం వర్షపాతం నమోదయింది. జలాశయం సా మర్థ్యం 320.05 ఎంసీఎఫ్‌టీ కాగా ప్రస్తుతం 218.25 ఎంసీఎఫ్‌టీల నీరు ఉంది. జలాశయంలోకి రోజుకు 80 క్యూసెక్కుల చొప్పున వరద నీరు చేరుతుండటంతో అదే మేర పంట పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు. జలా శయం ఆయకట్టు పరిధిలో చేపట్టిన 4,600 ఎకరాల వరికి, చెరకు పంటకు సాగునీటికి ఢోకా లేదని ప్రాజెక్ట్ జేఈ సుధాకర్‌రెడ్డి తెలి పారు. ప్రాజెక్ట్ పరిధిలో ఖరీఫ్ సాగుకు వర్షాలతో పనిలేదన్నారు. జలాశయం గరిష్ట నీటి మ ట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 135 మీటర్ల మేర నీరు ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
ఉధృతంగా వాగులు, గెడ్డలు
పెదబయలు (అరకు): పెదబయలు మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం 12 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. పెదబయలులో శుక్రవారం రికార్డు స్థాయిలో 108.2 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. ప్రధాన గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలు దాటి రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముంచంగిపుట్టులో 76.8 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. మత్స్యగెడ్డ నిండుకుండను తలపిస్తోంది. ఏడేళ్ల తరువాత మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడం ఇదే మొదటిసారి అని గిరిజనులు తెలిపారు. గెడ్డలు పొంగి ప్రవహించడం వల్ల మారుమూల గిన్నెలకోట, జామిగుడ పంచాయతీలకు వెళ్లేందుకు గిరి జనులు ఇబ్బందులు పడుతున్నారు. పరదా నిపుట్టు వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పెదబయలు రేవులో బోట్ల రవాణా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment