బాక్సైట్ దోపిడీని అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ స్పష్టీకరణ
{పజా సమస్యలపై పార్టీ నిరంతర పోరాటం
ఎంపీ గీత కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి
పాడేరు :విశాఖ ఏజెన్సీలో గిరిజనుల సంపదైన బాక్సైట్‌ను దోచుకుని రాజధాని నిర్మాణానికి ఉపయోగించాలనే ప్రభుత్వ కుట్రను ప్రాణాలు ఒడ్డైనా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలమంతా అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన ఇక్కడి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటైన పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బాక్సైట్ ఖనిజాలు తవ్వాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తామంతా అడ్డుకుంటామన్నారు. వైఎస్సార్‌సీపీ అన్ని మండలాల్లో బాక్సైట్ వ్యతిరేక పోరాటాలను ఉధృతం చేస్తుందని, అవసరమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కూడా రప్పిస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు గిరిజనులందరికీ మేలు చేస్తానని హామీలు ఇచ్చి, ఇప్పుడు విస్మరించారని ఆరోపించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తన ప్రాంతంలో ఉన్న ఆన్‌రాక్ ఫ్యాక్టరీ పక్షాన నిలిచి బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు, ఆరు నెలల్లో తన నిజ స్వరూపం రుజువు చేసుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ఉన్న అభిమానం, ఆదరణతో కొత్తపల్లి గీతను రికార్డు మెజార్టీతో ఎంపీగా గిరిజనులు గెలిపించారని అయితే ఆమె మాత్రం అధికారం, డబ్బు ఆశతో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పని చేస్తుండటం గిరిజనులను బాధిస్తుందన్నారు. బాక్సైట్‌కు కొత్తపల్లి గీత అనుకూలమో, వ్యతిరేకమో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భిక్షతో గెలిచిన కొత్తపల్లి గీతకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అరకు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హుద్‌హుద్ తుఫానుతో ఏజెన్సీలోని కాఫీ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినా వాటిని పరిశీలించకుండానే మొక్కుబడి సాయాన్ని ప్రకటించారన్నారు. ఈ సమావేశంలో పాడేరు, చింతపల్లి, జీకేవీధి జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, పద్మకుమారి, నళిని, మహిళా విభాగం జిల్లా నేత పీల వెంకటలక్ష్మి, పాడేరు, జీకేవీధి, జి.మాడుగుల ఎంపీపీలు వర్తన ముత్యాలమ్మ, సాగిన బాలరాజు, ఎం.వెంకట గంగరాజు, పాడేరు మాజీ ఎంపీపీ ఎస్.వి.వి.రమణమూర్తి, కొయ్యూరు, పాడేరు వైస్ ఎంపీపీలు వై.రాజేశ్వరి, ఎం.బొజ్జమ్మ, పలు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు కర్రి నాయుడు, వారం చిట్టిబాబునాయుడు, కె.చంద్రమోహన్‌కుమార్, పాడేరు కో-ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్ జోగిరాజు, టి.ఎస్.రాందాసు, ఎ.బొంజునాయుడు, ఐసరం హనుమంతరావు, కె.చిన్నయ్య, చిట్టిబాబు, లకే రత్నాభాయి, సూరిబాబు, రామస్వామి, రఘునాథ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.