ఆత్మగౌరవయాత్రకు తరగని ఆదరణ
ఉత్తర,దక్షిణ నియోజకవర్గాల్లో కొనసాగింపు
విశాఖపట్నం : రైల్వే జోన్ కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా గుడివాడ అమర్‌నాథ్‌కు నగరవాసులు బ్రహ్మరథం పడుతున్నారు. నీ సంకల్పం గొప్పది.. ఎలాగైనా రైల్వేజోన్ సాధించి తీరువావ్.. అంటూ పాదయాత్ర పొడవునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. దారిపొడవునా మహిళలు ఎదురేగి స్వాగతం పలుకుతూ మంగళహారతులిస్తూ దీవిస్తున్నారు. రైల్వేజోన్ కోసం అమర్‌నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. ఏడోరోజు 21.50 కి.మీ మేర నడిచిన అమర్ ఇప్పటివరకు 106 కి.మీ. మేర పాదయాత్రను పూర్తి చేయగలిగారు.
తొలుత ఉదయం తాటిచెట్లపాలెం 80 అడుగుల రోడ్డు వద్ద బసచేసిన చోట దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తర కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరాగా అమర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవధానుల అజశర్మతో పాటు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజశర్మ మాట్లాడుతూ హోదా మాదిరిగానే రైల్వే జోన్ ఎగ్గొట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన తెలుగుదేశం పట్టించుకోవడం లేదన్నారు. రైల్వేజోన్‌తో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
80 అడుగుల రోడ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తాటిచెట్లపాలెం మెయిన్‌రోడ్, మహారాణి పార్లర్, జగ్గారావు వంతెన, సంఘం ఆఫీస్, శంకరమఠం రోడ్, దుర్గాగణపతి ఆలయం, బీవీకే కళాశాల, డైమాండ్ పార్కు, దొండపర్తి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్ సర్కిల్, అల్లిపురం బజారు మీదుగా మనోరమ థియేటర్ ఎదురుగా కల్యాణ మండపం వరకు సాగింది. అక్కడ భోజన విరామం అనంతరం తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర దుర్గలమ్మగుడి, డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా జగదాంబ, అక్కడ నుంచి çహోటల్ దసపల్లా, పూర్ణామార్కెట్, పోస్టాఫీస్, వెలంపేట, ఎవీఎస్ కళాశాల, కలెక్టరేట్, జెడ్పీ సెంటర్ ఆంకోసా ఆడిటోరియం, పందిమెట్ట, గ్రీన్‌పార్కు హోటల్, సెవన్‌హిల్స్, రామ్‌నగర్ మార్కెట్ మీదుగా వేమన మందిరం వరకు సాగింది. బుధవారం పూర్తిగా సామాన్య, మధ్యతరగతి ప్రజలుండే ప్రాంతాల్లో సాగిన పాదయాత్రకు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించింది.
అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల్లో నివాసం ఉంటున్న వారు సైతం పాదయాత్రకు ఎదురేగి స్వాగతం పలుకుతూ విశాఖకు జోన్ రావాలంటూ తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. అమర్‌నా«థ్ కూడా పలుచోట్ల ప్రజలనుద్దేశించి తన ప్రాణాలనైనా ఫణంగా పెట్టి జోన్‌ను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. విభజన హామీల్లో ఇచ్చిన జోన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలుడుతున్నాయని కో ఆర్డినేటర్లు తైనాల విజయకుమార్, కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
పాదయాత్రలో పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు,సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖి, నగర అధికార ప్రతినిధి మూర్తియాదవ్, ఎస్సీసెల్ నగరాధ్యక్షుడు బోని శివరామకృష్ణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ కాంతారావు,యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.