రైల్వే జోన్ కోసం మహాసంకల్పం
అనకాపల్లి నుంచి భీమిలి వరకూ 250 కిలోమీటర్లు..
వచ్చే నెల 9 నుంచి ప్రారంభం
విశాఖపట్నం : సామాన్యుడి గుండె చప్పుడు వినేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేసిన మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. నాయకుడంటే జనం గుండెల్లో నిలిచేవాడేనని ఆయన చెప్పిన మాటల స్ఫూర్తితో.. విశాఖ ప్రజల చిరకాల కల అయిన రైల్వే జోన్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో బృహత్తర యజ్ఞానికి అంకురార్పణ చేయనుంది. ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం కన్ను తెరిపించడం కోసం అనకాపల్లి న జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాదయాత్ర చేయనున్నారు. వచ్చే నెల 9వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ పాదయాత్రను ప్రారంభించి 250 కిలోమీటర్లు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
దశాబ్దాల కల కోసం..
దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విశాఖ వాసులు నేటికీ రైల్వే జోన్ జాడ లేకపోవడంతో నిరాశలో ఉన్నారు. జోన్ వస్తే యువతకు ఉపాధి లభించడంతోపాటు కుటుంబాలు బాగుపడతాయన్న వారి ఆశలకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్కరే బాసటగా నిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా రు. తమ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని, ఆయన సూచనల మేర కు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్ గతేడాది ఏప్రిల్ 14న రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారు. విశాఖ ప్రజలతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం దీక్షను భగ్నం చేస్తే.. నేనున్నానంటూ ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే విశాఖ వచ్చి అమర్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోరాటం ఇక్కడితో ఆగిపోదని, మరింత ఉధృతం చేద్దామని చెప్పి వెళ్లారు. ఆ మాటలే నేటి పాదయాత్ర ఆలోచనకు అంకురార్పణ చేశాయి