రైల్వే జోన్ సాధించే వరకు నిద్రపోం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
డీఆర్‌ఎం కార్యాలయం వద్ద మహాధర్నా
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధనకు వైఎస్సార్‌సీపీ నడుం బిగించింది. బడ్జెట్ ఘడియలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులు ఉద్యమించాయి. జోన్ సాధించడంలో ఎంపీలు విఫలమవుతున్నారంటూ తూర్పారబట్టాయి. దొండపర్తిలోని డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అమర్‌నాథ్ సారథ్యం వహించారు. భారీగా కార్యకర్తలు తరలివచ్చిన ఈ నిరసన కార్యక్రమంలో అమర్‌నాథ్ నేతల వైఫల్యంపై గళమెత్తారు. తూర్పు కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజనుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపారు. పూర్తి వివక్షతకు గురవుతున్న ఈ ప్రాంతానికి బడ్జెట్‌లో న్యాయం జరగకపోతే సహించేది లేదని హెచ్చరించారు. జోన్ సాధించేవరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని ప్రతిన పూనారు.
విశాఖపట్నం సిటీ: రైల్వే జోన్ విశాఖకు తెస్తామనే దమ్మూ ధైర్యం ఉత్తరాంధ్రలోని ఒక్క ఎంపీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విమర్శించారు. రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డీఆర్‌ఎం కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహా ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విశాఖ నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సంబల్‌పూర్, కుర్దా డివిజన్‌లకు పట్టుకుపోయి ఒడిశా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. వాల్తేరు రైల్వే ఆర్జిస్తున్న ఆదాయంలో రూపాయి కూడా ఉత్తరాంధ్రకు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగావకాశాల్లోనూ తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల రిక్రూట్ అయిన 140 అసిస్టెంట్ లోకోపెలైట్(డ్రైవర్) ఉద్యోగాల్లో ఒడిశా, బీహారీలే ఎలా నింపారో రైల్వే అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభును కలిసి రైల్వే జోన్ ప్రకటించాలని కోరినప్పుడు మీ సీఎం చంద్రబాబు అడగలేదని చెప్పడంతో అవాక్కయ్యామన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీలు చేతగాని వారేనని, అందుకే ఉత్తరాంధ్రకు రైల్వే ప్రాజెక్టులు రావడం లేదని అమరనాథ్ అన్నారు. 1989 నుంచీ విశాఖ ఎంపీలుగా ఇతర ప్రాంతీయులే విజయం సాధిస్తున్నారని, అందుకే వారంతా తమతమ ప్రాంతాల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని చెప్పారు.
ఇప్పుడున్న టీడీపీ ఎంపీలంతా రైల్వే జోన్‌ను విజయవాడకు తరలించుకుపోదామని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రైల్వే జోన్ సాధిస్తామంటూ ప్రగల్బాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు ఇప్పుడు మాట మార్చేశారని ఆరోపించారు. జోన్‌ను సాధించే వరకూ వైఎస్సార్‌సీపీ నిద్రపోదన్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు విశాఖ జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ప్రజల కష్టాలపై దృష్టి పెట్టే తీరిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులంటే మరీ దారుణంగా చూస్తున్నారన్నారు. ప్రజల మనోభావాలను ఏ మాత్రం గౌరవించడం లేదని దుయ్యబట్టారు. పార్టీ చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ జోన్ పట్ల ఎంపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విశాఖకు రాకపోతేనే మంచిదన్నారు. మంత్రి వర్గ సమావేశం కోసం ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఈ పచ్చని అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నామని మొదలెట్టిన మూడు రోజులకే హుద్‌హుద్ తుపాను వచ్చి పచ్చదనం మొత్తం తుడుచుకుపోయిందన్నారు. ఆ తర్వాత ఐటీ సెజ్‌కు వచ్చి తీరం కోసం పొగిడారని ఆ వెంటనే తీరం ఉగ్రరూపం దాల్చి బీచ్‌రోడ్డును కోరేసిందన్నారు. అలా ఆయన దేనిపై కన్నేస్తే అది మటాష్ అయిపోతుందని, అందుకే విశాఖకు రాకపోవడం మంచిదని సూచించారు. పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకూ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖ నుంచి ఢిల్లీకి, బెజవాడ మీదుగా వారణాసికి రైళ్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ మాట్లాడుతూ 9 నెలలుగా మభ్యపెడుతూనే పాలకులు కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు మాట్లాడుతూ మ్యానిఫెస్టోలతో మోసం చేసిన పార్టీలను నమ్మకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుడ్ల రమణి, జియ్యాని శ్రీధ ర్, సేనాపతి అప్పారావు, కంపా హానోక్, నేతలు శ్రీకాంత్ రాజు, రవి రెడ్డి, సనపల త్రినాధ స్వామి, కాంతారావు, పక్కి దివాకర్, విల్లూరి భాస్కరరావు, శ్రీ దేవి వర్మ, ఆర్వీ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్‌ఎం అనిల్‌కుమార్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని
అందజేశారు.
రైల్వే జోన్‌కోసం అవిశ్రాంతపోరు
Published Wed, Feb 25 2015 1:27 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM
Advertisement
Advertisement