ఎర్రబడుతున్న ఏజెన్సీ
* బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలోకి మావోయిస్టులు
* విశాఖ ఏజెన్సీలో బహిరంగ సభ నిర్వహణ
* గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుకు ప్రణాళిక
* ‘బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్’అని అల్టిమేటం
* ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకూ హెచ్చరిక
* చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టు అగ్రనేతల పర్యవేక్షణ!
* ప్రతివ్యూహానికి పోలీసుల సమాయత్తం
* ఏదేమైనా సరే తవ్వుతామంటున్న అధికారపార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాల అంశం కేంద్ర బిందువుగా విశాఖ ఏజెన్సీ ‘ఎరుపెక్కుతోంది’. విశాఖ ఏజెన్సీలో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలను తవ్వాలన్న సీఎం చంద్రబాబు ప్రకటన ఏజెన్సీలో కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే స్పందించిన మావోయిస్టు పార్టీ తాజాగా ప్రత్యక్ష కార్యాచరణకు ఉపక్రమించింది.
విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు-జీకే వీధి మధ్య ఓ ప్రదేశంలో మావోయిస్టు పార్టీ గిరిజనులతో శనివారం బహిరంగ సభ నిర్వహించింది. మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశానికి దాదాపు 600మందికిపైగా గిరిజనులు సంప్రదాయ ఆయుధాలు చేతబట్టి హాజరుకావడం గమనార్హం.
‘చంద్రబాబు డౌన్ డౌన్... బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం... మన్యాన్ని పరిరక్షించుకుంటాం’అని నినదించారు. ఈ సందర్భంగా మావోయిస్టు నేతలు మాట్లాడుతూ... ఐటీడీయే ముసుగులో ప్రైవేటు సంస్థలకు బాక్సైట్ నిల్వలను కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు ప్రస్తుతం సామ్రాజ్యవాద శక్తులకు తొత్తుగా మారారని దుయ్యబట్టారు.
దంతేవాడ నుంచి అగ్రనేతల పర్యవేక్షణ!
బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని విశాఖ ఏజెన్సీలో మళ్లీ పాగా వేసేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కొన్నేళ్ల క్రితం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) నుంచి చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడకు తరలివెళ్లిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ఉద్యమ ప్రణాళికను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. దంతేవాడలో గొప్ప ఫలితాలనిచ్చిన వ్యూహాన్నే బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి అన్వయించి మన్యంపై పట్టు సాధించాలన్నది పార్టీ వ్యూహం. ఇందులో భాగంగానే బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించింది.
‘మన్యం పితూరీ సైన్యం’పేరిట ఏజెన్సీలో గ్రామగ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. సామాన్య గిరిజనులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు తప్పనిసరిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. బాక్సైట్ తవ్వకాలను సమర్థించే ఏ ఒక్క ప్రజాప్రతినిధినీ మన్యంలో తిరగనీయమని తేల్చిచెప్పింది. మావోయిస్టు పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో గాలికొండ ఏరియా కమిటీ ఇన్‌చార్జ్ జాంబ్రీ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
గిరిజనులతో మావోయిస్టులు సమావేశం నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకోకుండా కట్టడి చేయడంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు సమాచా రం. దీనిపై నర్సీపట్నం ఏఎస్సీ సత్య ఏసుబాబును ‘సాక్షి’ సంప్రదించగా మన్యంలో మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించిన విషయం తమకు తెలిసిందన్నారు. దీని పూర్వాపరాలు తెలుసుకున్న తరువాత తగిన కార్యాచరణ ప్రణాళిక చేపడతామన్నారు.