- జీసీసీ తీరుపై భగ్గుమన్న మంత్రి సునీత
- అరకులోయ, అనంతగిరిల్లో డీఆర్‌డిపోల తనిఖీ
- కాశీపట్నం గోదాము రికార్డులు సీజ్
- అవకతవకలపై దర్యాప్తునకు సబ్‌కలెక్టర్‌కు ఆదేశం
అరకు రూరల్/అనంతగిరి: విశాఖ ఏజెన్సీలో జీసీసీ పనితీరు పట్ల రాష్ర్ట పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. డీఆర్‌డిపోలు, వారపు సంతలను పరిశీలించారు. జీసీసీ గోదాములను తనిఖీ చేశారు. అనంతగిరి మండలం కాశీపట్నం జీసీసీ గోదామును పరిశీలించినప్పుడు రికార్డుల్లోని వివరాలకు నిల్వలకు ఏమాత్రంపొంతన లేకపోవడంతో ఆగ్రహం వ్వక్తం చేశారు.
రికార్డులు సీజ్‌చేసి దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బియ్యం. పప్పు, పంచదార, ఇతర సరకులను పరిశీలించారు. గిరిజనులకు పంపిణీకి నిల్వ ఉంచిన బియ్యంలో నాణ్యత లోపాన్ని గమనించారు. గోదాము నుంచి డీఆర్‌డిపోలకు తరలిస్తున్న బియ్యం బస్తాలను తూకం వేసి చూశారు. తక్కువ ఉండడాన్ని గమనించి సిబ్బందిని నిలదీశారు. మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేయకపోవడంపై ప్రశ్నించారు.
డీఆర్‌డిపో నిధులు పక్కదారి పట్టాయన్న వార్తలపై ఆరాతీశారు. వేలమామిడి సబ్‌డిపో పరిధిలోని పోడేల్తి గ్రామానికి చెందిన 40 మంది కార్డుదారులకు నాలుగు నెలల నుంచి ఎందుకు సరకులు పంపిణీ చేయలేదని మేనేజర్‌ను నిలదీశారు. పర్యవేక్షణలోపం వల్లే అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అనంతగిరి ఎంపీపీ పైడితల్లి, సీపీఐ నాయకు వంజరపు శంకరావులు మంత్రి దృష్టికి తెచ్చారు.
అనంతరం అరకులోయ మండలం సుంకరమెట్ట వారపు సంతలోని డీఆర్‌డిపోను పరిశీలించి, అందుతున్న సేవలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కిలో, అరకిలోగా ప్యాక్‌చేసి ఉన్న పంచదార, మరికొన్ని సరకుల ప్యాకెట్లను తూకం వేసి చూశారు. అన్నింటా 50 గ్రాముల వరకు తక్కువ ఉండటంతో సేల్సుమేన్‌ని నిలదీశారు. పంచదార, కందిపప్పు ఇవ్వడంలేదని, కిరోసిన్ కేవలం లీటరు మాత్రమే ఇస్తున్నారని అక్కడి మహిళలు మంత్రికి ఫిర్యాదు చేశారు. బోసుబెడ డీఆర్‌డిపోలోనూ ఇదే పరిస్థితిని మంత్రి గమనించారు. పెన్షన్ మంజూరు చేయలేదని పెదలబుడులో వి. గంగమ్మ అనే మహిళ ఆమె దృష్టికి తెచ్చారు.
ప్రస్తుతం ఇస్తున్న తొమ్మిది రకాలతోపాటు ఇంకేమి సరకులు పంపిణీ చేస్తే బాగుంటుందని గిరిజన మహిళలను సునీత అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటిపై స్పందించిన ఆమె దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను ఆదేశించారు. కార్యాక్రమంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి,మేనేజర్ విజయ్‌కుమార్, జేడ్పీ వైస్‌చైర్మన్ కోట్యాడా అప్పారావు, మాజీ ఎమ్మేల్యే సివేరి సోమ. అరుకు వైస్ ఎంపీపీ పొద్దు అమ్మన్న, అనంతగిరి తహశీల్దార్ భాగ్యవతి,ఎంపీడీవో సాంబశివరావు పాల్గొన్నారు.
ప్రభుత్యరాయితీలకు ఆధార్‌తో ముడి పెట్టొద్దు
అనంతగిరి: ప్రభుత్వ రాయితీలను పొందేందుకు ఆధార్‌తో అనుసంధానం ఉండితీరాలని, అలాగని రాయితీల కల్పనకు ఆధారతో ముడిపెట్టరాదని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. రాష్టంలో ఇప్పటి వరకు 60శాతం మాత్రమే ఆధార్ నమోదైందన్నారు. ఆధార్‌లేని విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందలేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీలోని మారుమూల గూడేల్లోని వారు ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను ఆదేశించారు. ప్రతి నెలా మొదటివారంలోగా జీసీసీ డీఆర్‌డిపోలకు నిత్యావసర వస్తువులు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. బాక్సైట్ తవ్వకాల గురించి విలేకరులు ప్రశ్నించగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత కల్పించుకుని గిరిజనుల అభిప్రాయం మేరకే జరుగుతుందన్నారు. ఏజేన్సీలో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.