సాక్షి, అమరావతి: చుట్టూ పచ్చని కొండలు.. ఆకాశాన్ని తాకుతున్నట్టుండే దట్టమైన వృక్షాలు.. వాటి మధ్య నల్లటి నాగులా మెలికలు తిరుగుతూ రహదారి.. ఓ వైపు లోయలు.. అక్కడక్కడా కనువిందు చేసే జలపాతాలు.. సేద తీరేందుకు వేసవి విడిదిలు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా తూర్పుగోదావరి–విశాఖ ఏజెన్సీలను కలుపుతూ మణిహారం వంటి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ముందుగా నిర్ణయించిన రహదారులను అనుసంధానిస్తూ ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా కొత్త రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. 406 కి.మీ. మేర రూ.900 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది.
పర్యాటకానికి మణిపూసలా..
ఎన్‌హెచ్‌ఏఐ ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని విజయనగరం జిల్లాతో కలుపుతూ రెండు రహదారులను నిర్మిస్తోంది. బౌదర నుంచి విజయనగరం, పాడేరు నుంచి అరకు వరకు 76.31 కి.మీ. మేర రూ.493 కోట్లతో రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. అదేవిధంగా కొయ్యూరు నుంచి పాడేరు వరకు రూ.785.72 కోట్లతో మరో రహదారి నిర్మిస్తోంది. ప్రస్తుతం అరకులోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఈ మార్గం నుంచే వెళ్తున్నారు. అటు విశాఖపట్నం నుంచి.. ఇటు విజయనగరం నుంచి బౌదర మీదుగా అరకు వెళ్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర నుంచే ఆ మార్గం అరకుకు కనెక్టివిటీగా ఉంది. కాగా అరకు లోయకు రాష్ట్రంలోని మరో వైపు నుంచి కూడా కనెక్టివిటీ పెంచితే పర్యాటకులను మరింతగా ఆకర్షించ వచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు.
ప్రధానంగా రాజమహేంద్రవరం నుంచి నేరుగా అరకు లోయకు కనెక్టివిటీ మెరుగుపరిస్తే రాష్ట్రంలోని మిగిలిన 10 జిల్లాల వారికి కూడా అరకు పర్యటన మరింత సులభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారికి రాజమహేంద్రవరం మీదుగా అరకుకు అనుసంధానించేలా రహదారి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 406 కి.మీ. మేర నిర్మించే ఈ రహదారులకు రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రణాళికను ఖరారు చేశారు. దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)రూపొందిస్తున్నారు. డీపీఆర్ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.
అరకు అందాలకు రాచబాట
Published Tue, Aug 31 2021 3:13 AM | Last Updated on Tue, Aug 31 2021 3:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment