పోరుబాట
- ఉద్యమాలకు సిద్ధమవుతున్న గిరిజనం
- జర్రెలలో నేడు భారీ సభ
- 21న పాడేరు రానున్న రాఘవులు
బాక్సైట్ తేనెతుట్టె కదులుతోంది. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా వ్యతిరేక ఉద్యమానికి గిరిజనం సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖనిజం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేయించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా తవ్వకాలకు నిర్ణయించినట్టు ప్రకటించడాన్ని ఆదివాసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ జీకేవీధి మండలం జర్రెలలో ఆదివారం ఆందోళనకు నిర్ణయించారు.
పాడేరు: బాక్సైట్ ఖనిజ నిల్వలకు విశాఖ ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడున్నంత విలువైన ఖనిజం మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్‌టన్నులు, జీకేవీధిలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గతంలో నిపుణులు వెల్లడించారు. లక్షల కోట్ల విలువైన ఈ సంపదను వెలికితీస్తే ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుందని తేల్చారు.
వాస్తవాని కి వీటి తవ్వకాలతో జలాశయాలు దెబ్బతిని మైదానంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోతుంది. ప ర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఐటీడీఏలకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తామని చెబుతున్న సీఎం అసలు దానికి తవ్వకాల నైపుణ్యమే లేనప్పుడు ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు ప్రకటనపై గిరిజన సంఘాలు,పర్యావరణ సంస్థలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరిజనుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివారం జర్రెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు జర్రెల సర్పంచ్ అడపా విజయకుమారి, ఎంపీటీసీ సభ్యురాాలు ఉగ్రంగి జగ్గమ్మ తెలిపారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘా లు, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు ఇటీవల సాగాయి. ఆందోళనకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఇప్పటికే పిలుపునిచ్చాయి. సీపీఎం కూడా ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఆపార్టీ రాష్ట్ర నేత బివి రాఘవులు ఈ నెల 21న పాడేరు వస్తున్నారు. ఉద్యమానికి ఆరోజు ప్రణాళికను రూపొందిస్తారు. బీజేపీ నాయకులు కురసా బొజ్జయ్య, కురసా రాజారావు తదితరులు బాక్సైట్‌కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.