అడవికి రాచబాట! | Construction of roads to various residential areas in Visakhapatnam Agency | Sakshi
Sakshi News home page

అడవికి రాచబాట!

Published Thu, Oct 28 2021 4:01 AM | Last Updated on Thu, Oct 28 2021 4:01 AM

Construction of roads to various residential areas in Visakhapatnam Agency - Sakshi

పెదబయలు మండలం గుల్లేలు నుంచి కొండ్రు రహదారి

విశాఖ జిల్లా పెదబయలు మండలంలోని నివాసిత ప్రాంతం కొండ్రుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ దుస్థితి తొలగనుంది. గుల్లేలు నుంచి కొండ్రుకు రూ.15.93 కోట్లతో 18.40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. 
► డుంబ్రిగుడ మండలం సోవ్వ నుంచి చెమడపొడు వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.11.42 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా అక్కడ రోడ్డు సదుపాయం లేదు. 
► పెదబయలు మండలం రుద్రకోట నుంచి కుమడ పంచాయతీ కిందుగూడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. కిందుగూడకు ఇన్నేళ్లుగా కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షాకాలం అక్కడకు వెళ్లాలంటే అసాధ్యమే. ఇప్పుడు అక్కడ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి.
► ముంచంగిపుట్టు మండలం బుంగపుట్‌ ఏజెన్సీ గ్రామానికి 25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కరువయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని పలు నివాసిత ప్రాంతాలకు రహదారుల సదుపాయం లేక అడవి బిడ్డలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరైతే కొండకోనల్లో ప్రయాసలతో వెళ్లాల్సిందే. మట్టి రోడ్లున్నా వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తితే దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ దుస్థితిని తొలగించి ఏజెన్సీ గ్రామాలకు మట్టి రోడ్లు కాకుండా మెటల్, బీటీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. విడతలవారీగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రవాణా సదుపాయం పెరిగి రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 

548.91 కిలోమీటర్లు... రూ.308.98 కోట్లు
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 11 మండలాలున్నాయి. ఇందులో 3,789 నివాసిత ప్రాంతాల్లో (ఆవాసాలు) 6,58,354 మంది జీవనం సాగిస్తున్నారు. వీటిల్లో 1,610 నివాసిత ప్రాంతాలు, గ్రామాలకు మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రూ.308.98 కోట్లతో గత రెండేళ్లలో 340 నివాసిత ప్రాంతాలకు 548.91 కిలోమీటర్ల మేర రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడంతో మొత్తం 1,950 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ఇంకా 1,839 నివాసిత ప్రాంతాలకు రోడ్డు సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రూ.714 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేశారు. 

సాగు హక్కులు.. పథకాల ప్రయోజనం
ఇప్పటికే గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల ద్వారా భూ పంపిణీ చేపట్టి సాగు హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవలతో పాటు హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గిరిజనులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏజెన్సీలోని అన్ని నివాసిత ప్రాంతాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ
ఏజెన్సీ గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వే చేపట్టింది. ‘కనెక్ట్‌ పాడేరు’ పేరుతో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు బాగా ఇబ్బంది  పడుతున్నారు. గత రెండేళ్లుగా 340 నివాసిత ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా పనులు జరుగుతున్నాయి. 
–ఆర్‌.గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో

దశాబ్దాల కల సాకారం
గుల్లేల గ్రామం నుంచి కొండ్రు వరకు దశాబ్దాల తర్వాత రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజనుల రవాణా కష్టాలు తీరతాయి. రహదారి సమస్యను గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. 
– వరద నాగేశ్వరరావు, ఇంజిరి పంచాయతీ, పెదబయలు మండలం

డోలి కష్టాలకు తెర...
సోవ్వ నుంచి ఒడిశా బోర్డర్‌ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండడం శుభపరిణామం. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర పరిస్థితుల్లో మేం పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలుసు. రోగులు, గర్భిణులను డోలిలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించే కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలకు ఉపయోగం. ఒడిశా వాసులకు సైతం రవాణా సౌకర్యం కలుగుతుంది.     
– తిరుమలరావు, సోవ్వ గ్రామం, డుంబ్రిగుడ మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement