సాక్షి, అమరావతి: రోడ్లపై సభలు, రోడ్‌షోలను నియంత్రించడం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం మధ్య ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట కారణంగా పలువురు మరణించిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, రోడ్‌షోలకు అనుమతివ్వకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రోడ్లు, రోడ్ మార్జిన్లలో సభలు, రోడ్‌షోలను నియంత్రిస్తూ జారీ చేసిన జీవో 1 విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిలక్ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. కందుకూరులో మానవ తప్పిదం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సన్నని వీధుల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
చదవండి: (Fact Check: రామోజీ వలంటీర్లంటే వణుకేల?.. వాస్తవాలివిగో..)
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రోడ్లపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని నిషేధించాలని కోరలేరని తెలిపింది. సభలు, రోడ్‌షోలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1పై ఓ వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగానే జీవో 1 జారీ చేసిందన్నారు. జీవో 1 అమలును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment