సాక్షి, విజయవాడ: కరోనా సంక్షోభం నుంచి తేరుకున్న రియల్ ఎస్టేట్ రంగం దూకుడు మీద ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రంగానికి ఊతమిచ్చినట్లు అయ్యింది. ప్రధానంగా కొత్త రూపు సంతరించుకున్న రోడ్లు, కల్పిస్తున్న మౌలిక వసతులు, ఫ్లైఓవర్ నిర్మాణాలు అభివృద్ధి సూచికలుగా మారాయి.
దీనికి తోడు విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో ఆ బైపాస్‌ను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెద్ద ఎత్తున భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఫలితంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా స్థిరాస్తుల లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,12,141 రిజిస్టేషన్లు జరిగాయి. గతేడాది జరిగిన రిజి‘స్టేషనలతో పోల్చితే దాదాపు 17 శాతం వృద్ధి రేటు నమోదైంది.
శివారు ప్రాంతాల్లో..
విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. నగరం ఇటు వైపు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, అటువైపు పెనుమలూరు, కంకిపాడు ప్రాంతాల వరకూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో బెజవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు వీలుగా విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగరంలోని నున్న, అజిత్‌సింగ్ నగర్, విజయవాడ రూరల్ మండలం, తాడిగడప, కానూరు, పెనమలూరు ప్రాంతాలు పెరుగుతున్నాయి. కంకిపాడు ప్రాంతం వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి.
పట్టణ పరిధిలో అధిక రిజిస్ట్రేషన్లు..
ప్రధానంగా నగరంలోని సబ్ రిజిస్టార్ ప్రాంతాల పరిధిలో లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. పటమట, విజయవాడ (గాంధీనగర్), నున్న, గుణదల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడంతోపాటు, గత ఏడాదితో పోల్చితే 20 శాతానికి పైగా ఆదాయం వచ్చింది. గుణదల ప్రాంతంలో గత ఏడాదితో పోల్చితే రిజిష్ట్రేషన్ల సంఖ్య నామమాత్రంగానే పెరిగింది. ఏనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రభావం వల్ల ఇక్కడ తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్లలో అధికంగా 35.44 శాతం వృద్ధి రేటు నమోదైంది. దానికి ప్రధాన కారణం, జగ్గయ్యపేట ప్రాంతంలో మైనింగ్ లీజులకు సంబంధించిన లావాదేవీలు జరగడమేనని అధికారులు చెబుతున్నారు. తిరువూరును డివిజన్ కేంద్రం చేయడంతో అక్కడ 26.69 శాతం వృద్ధి రేటు నమోదైంది. కాగా విస్సన్నపేటలో అతి తక్కువగా, నందిగామ ప్రాంతంలో మైనస్‌లో వృద్ధి రేటు నమోదైంది.
రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది..
గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో 17 శాతం వృద్ధి రేటు నమోదైంది. సేల్ డాక్యుమెంట్ల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది 1,12,141 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.565కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా ఆదాయం తగ్గుదల, పెరుగుదలకు సంబంధించిన కారణాలను సమీక్షిస్తున్నాం.
విజయవాడ నగర పరిధిలో ఆదాయం గణనీయంగా పెరిగింది.
– రవీంద్ర, డీఐజీ, ఉమ్మడి కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment