AP: 'దారి'కొస్తున్నాయి.. ఒక్క ఏడాదిలో రూ.2,205 కోట్లు | CM YS Jagan Comments On Road maintenance and repairs works | Sakshi
Sakshi News home page

AP: 'దారి'కొస్తున్నాయి.. ఒక్క ఏడాదిలో రూ.2,205 కోట్లు

Published Tue, Feb 15 2022 3:13 AM | Last Updated on Tue, Feb 15 2022 7:37 AM

CM YS Jagan Comments On Road maintenance and repairs works - Sakshi

నాడు గుంతలమయంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం–బొబ్బర్లంక రహదారి.. నేడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ చర్యలతో సుందరమయంగా మారిన దృశ్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.2,205 కోట్లు ఇచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఏ ప్రభుత్వమూ ఇంత డబ్బులు ఇవ్వలేదని, ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. గత సర్కారు ఐదేళ్ల పాటు రహదారుల నిర్వహణను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లుగా వర్షాలు జోరుగా కురవడంతో రోడ్లు మరింత దెబ్బతిన్నాయన్నారు.

గత సర్కారు ఐదేళ్లలో రోడ్లకు ఇచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈ ప్రభుత్వ పాలనలోనే హఠాత్తుగా ఇప్పటికిప్పుడే రోడ్లన్నీ పాడైపోయినట్లు వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్ల పనులకు టెండర్లు పూర్తి చేశామని, నెలాఖరు నాటికి 100 శాతం పూర్తవుతాయని సమీక్షలో అధికారులు తెలిపారు. 

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల టౌన్‌ అప్రోచ్‌ రోడ్డు , తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ–వాడపల్లి రహదారి 

టూరిజం ప్రాజెక్టుల రాకతో పెరిగిన ప్రాధాన్యం
విశాఖ బీచ్‌ కారిడార్‌ రోడ్డుపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి– భోగాపురం– తిరిగి ఎన్‌హెచ్‌–16కు అనుసంధానమయ్యే బీచ్‌ కారిడార్‌ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  రోడ్డు నిర్మాణ డిజైన్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, ఈ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రహదారిని ఆనుకుని టూరిజం ప్రాజెక్టులు రానుండటంతో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలపై నిరంతరం ఆంక్షలు, రాత్రి పూట ల్యాండింగ్‌కు నేవీ ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బీచ్‌ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. 

33 ఆర్వోబీల పూర్తికి రూ.571.3 కోట్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులను మే చివరి నాటికి దాదాపుగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 33 ఆర్వోబీలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలోనే ఇవి పూర్తి కాలేదనే రీతిలో కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గత సర్కారు హయాం నుంచే ఇవి పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసేందుకు ఇప్పుడు సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement