ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కొత్తగా టెండర్లు నిర్వహించనున్న రోడ్ల పునరుద్ధరణ పనులకు తాజాగా సవరించిన రేట్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన రేట్లను అధికారికంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.40 లక్షలు పైబడిన పనులన్నీంటికీ ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ సహాయంతో చేపట్టనున్న రెండో దశ రోడ్ల పునరుద్ధరణ పనులకు ఈ నిర్ణయం సానుకూలంగా మారింది.
రాష్ట్రంలో రెండో దశ పనుల కోసం రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్(ఆర్డీసీ) టెండర్ల ప్రక్రియ చేపట్టింది. రూ.1,601.32 కోట్లతో దాదాపు 819 రోడ్ల పనులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరిస్తారు. ఆర్డీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టిన దశలోనే ప్రభుత్వం రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకోవడం సానుకూలంగా మారింది. కాంట్రాక్టర్లు మరింత ఆసక్తితో టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.
బిల్లుల చెల్లింపునకు ప్రత్యేక ఖాతా!
ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2 వేల కోట్ల రుణ సేకరణకు రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను నేరుగా బ్యాంకు ఖాతా నుంచి కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కోసం వెచ్చించనుంది. ఇందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ నిధులను జమ చేయనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు తీసుకువచ్చిన రూ.3 వేల కోట్లను ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించింది. దీంతో రోడ్ల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
ఈ పరిస్థితి పునరావృతం కాకూడదని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈనెల రెండోవారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వర్షాలు తగ్గగానే నెలాఖరులోగా పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment