‘రోడ్డు’ మ్యాప్‌ రెడీ | CM YS Jagan High Level Review On Roads And Ports And Airports | Sakshi
Sakshi News home page

‘రోడ్డు’ మ్యాప్‌ రెడీ

Published Tue, Sep 7 2021 2:24 AM | Last Updated on Tue, Sep 7 2021 8:15 AM

CM YS Jagan High Level Review On Roads And Ports And Airports - Sakshi

సాక్షి, అమరావతి: వర్షాలు తగ్గుముఖం పట్టగానే రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం వచ్చే లోగా పనులన్నింటినీ పూర్తి చేసి రోడ్లను బాగు చేయాలని సూచించారు. అక్టోబర్‌ చివరి నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనుల సీజన్‌ మొదలవుతుందని, ఈ సమయంలో ముందుగా రహదారులను బాగు చేయడంపై దృష్టిపెట్టాలని దిశా నిర్దేశం చేశారు. గత సర్కారు రహదారులు బాగు చేయడాన్ని పూర్తిగా వదిలేసిందని, చివరి రెండేళ్ల పాటు నిర్వహణను ఏమాత్రం పట్టించుకోకుండా అధ్వాన పరిస్థితులు సృష్టించిందని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. వనరుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

రైతన్నల్లో ఆనందం.. రోడ్లకు మాత్రం దెబ్బ
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడటం వల్ల రైతులంతా సంతోషంగా ఉన్నారని, అయితే మరోవైపు వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఏటా వానలు విస్తారంగా కురవడంతో కొన్ని రోడ్లు దెబ్బతిని మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు తగ్గగానే వచ్చే నెల చివరికి ఈ పనులన్నీ ప్రారంభం కావాలని ఆదేశించారు. 
 
పాజిటివ్‌ థృక్పథంతో ముందుకెళదాం..
కొంతమంది నెగెటివ్‌ ఉద్దేశాలతో ప్రచారం చేస్తున్నప్పటికీ మనం చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తిద్దామని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి సూచించారు. ఆ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దామన్నారు. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే .. నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారని చెప్పారు.
రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలపై ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్న సీఎం జగన్‌ 

అసంపూర్తి అప్రోచ్‌ రోడ్లు పూర్తవ్వాలి..
బ్రిడ్జిల వద్ద అప్రోచ్‌ రోడ్లు పూర్తికాకపోవడంతోచాలా రహదారులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, చాలా సంవత్సరాలుగా అవి అలాగే ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తన పాదయాత్ర సమయంలో చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలను చూశానని గుర్తు చేశారు. వీటిని వెంటనే పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధంచేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. 

జాతీయ రహదారుల పనుల ప్రగతిపై పరిశీలన
రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల నిర్మాణ ప్రగతి, ప్రతిపాదనలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో షీలానగర్‌ – సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టి సారించినట్లు చెప్పారు. విశాఖ సిటీ నుంచి అనకాపల్లి మీదుగా ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధాన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్ధమయ్యామని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఈ రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనిపై జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
 
రైల్వే ప్రాజెక్టుల భూ సేకరణపై దృష్టి
నడికుడి – శ్రీకాళహస్తి, కడప– బెంగళూరు, కోటిపల్లి–నరసాపురం, రాయదుర్గం – తుమకూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మరికొన్ని మార్గాల్లో డబ్లింగ్‌ పనులు ముందుకెళ్లేలా చొరవ చూపాలన్నారు.

కాకినాడ పోర్టుకు అపార అవకాశాలు
కాకినాడ ఎస్‌ఈజెడ్‌ గేట్‌వే పోర్టు అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భూములు విస్తారంగా ఉన్నందున పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని సీఎం తెలిపారు. పోర్టును మెరుగైన రోడ్లు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయాలని సూచించారు.
 
పోర్టుల్లో కాలుష్య నివారణకు చర్యలు
పోర్టులున్న ప్రాంతాల్లో ఫ్రీ ట్రేడ్‌ వేర్‌హౌసింగ్‌ జోన్స్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. పోర్టుల వద్ద కాలుష్యాన్ని నియంత్రించాలని, కొత్తగా నిర్మించనున్న పోర్టుల వద్ద ఇప్పటి నుంచే ఈమేరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
వేగంగా భోగాపురం పనులు
భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టి వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. మిగిలిన విమానాశ్రయాల అభివృద్ధి పనులపైనా సమీక్షించాలని అధికారులకు సూచించారు. వీటికి సంబంధించి పెండింగ్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

కర్నూలు, కడప నుంచి విశాఖకు మరిన్ని విమానాలు
కర్నూలు, కడప నుంచి విశాఖపట్నానికి విమాన సౌకర్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల నుంచి ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని సూచించారు. 

24 నెలల్లో రామాయపట్నం పోర్టు పూర్తి 
రాష్ట్రంలో పోర్టులు, సరుకు రవాణా తదితర అంశాలను సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోర్టులతో రోడ్లు, రైల్వేల అనుసంధానంపై వివరాలు అందచేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలు, పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. తొలివిడతలో భాగంగా 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా, నాలుగు బెర్తులు, రూ.2,647 కోట్ల వ్యయంతో అక్టోబరు 1 నుంచి రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. బ్రేక్‌ వాటర్‌ పనులను నవంబర్‌ మొదటివారంలో ప్రారంభిస్తామని, వచ్చే మే నాటికి కీలకమైన పనులు పూర్తిచేస్తామని తెలిపారు. భూ సేకరణ, సహాయ పునరావాస పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు.

అక్టోబర్‌ చివరికి భావనపాడు టెండర్లు
భావనపాడు పోర్టుపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. తొలిదశలో రూ.2,956 కోట్ల వ్యయంతో 15 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా సామర్ధ్యంతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

14లోగా బందరు పోర్టు టెండర్ల ప్రక్రియ పూర్తి
మచిలీపట్నం పోర్టుకు సంబంధించి సెప్టెంబరు 14లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. తొలిదశలో రూ.3,650 కోట్ల వ్యయంతో 35 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా సామర్థ్యంతో పనులు ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. మచిలీపట్నం తీర ప్రాంతంలో మట్టి ఎక్కువగా ఉన్నందున అనుసరించాల్సిన నిర్మాణ ప్రక్రియలపై అంతర్జాతీయ నిపుణులను సంప్రదించి వినూత్న విధానాలను పాటిస్తున్నట్లు చెప్పారు.

ఫిషింగ్‌ హార్బర్ల ప్రగతిపై పరిశీలన
రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 9 ఫిషింగ్‌ హార్బర్ల ప్రగతిపై అధికారులు వివరాలు అందచేశారు. మొదటి విడతలో 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప్రగతిపై సీఎంకు వివరాలు సమర్పించారు. వచ్చే ఏడాది మే – జూన్‌ నాటికి మొదటి విడత హార్బర్లను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెండో విడతలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సమీక్షలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కె.వెంకటరెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్‌అండ్‌బి ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం.ఎం.నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌ తదితరులు పాల్గొన్నారు. 

రూ.6,400 కోట్లతో నూతన రహదారులు
న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహాయంతో రూ.6,400 కోట్ల వ్యయంతో కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్లతో మంచి రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొంటూ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు.

జీర్ణించుకోలేకే వక్రీకరణలు
– పనులు పూర్తి చేసి నెగిటివ్‌ ప్రచారాన్ని తిప్పికొడదాం: సీఎం జగన్‌
ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబు లేకపోవడాన్ని పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోతోందని, అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తోందని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాకుండా పచ్చమీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నామని చెప్పారు. నెగిటివ్‌ ప్రచారాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకు వేద్దామని అధికార యంత్రాంగానికి సూచించారు. మనం బాగా పనిచేసి పనులను పూర్తి చేస్తే నెగిటివ్‌ మీడియా ఎన్ని రాసినా ప్రజలు పట్టించుకోరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

బాగు చేసిన రోడ్లే సాక్ష్యాలుగా..
మనం మరమ్మతులు చేసి బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే సాక్ష్యాలుగా నిలబడతాయి. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచాం. మిగిలిన చోట్ల ఎక్కడైనా జాప్యం చేస్తే వెంటనే టెండర్లు ఆహ్వానించాలి. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని మరొకసారి నిశితంగా పరిశీలించి రోడ్ల మరమ్మతులపై దృష్టి కేంద్రీకరించాలి. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి కార్యాచరణ రూపొందించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement