
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయాల సందర్శన సందర్భంగా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు నిధులు మంజూరు చేసి ప్రారంభించడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ వరకు 3,120 సచివాలయాల పరిధిలో రూ.624 కోట్ల విలువైన ప్రాధాన్యత పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 17,107 గుర్తించగా 15,163 అత్యంత ప్రాధాన్యత పనులను మంజూరు చేశారు.
ఇందులో ఇప్పటికే 1,697 సచివాలయాల పరిధిలో 8,248 పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అవసరమైన సిమెంట్‌ను వైఎస్సార్ నిర్మాణ పోర్టల్ ద్వారా రాయితీపై కొనుగోలు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ ఆదేశించారు. ప్రాధాన్యత పనులను చేపట్టేందుకు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.3,000.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనుల మంజూరు, ప్రారంభంపై సీఎస్ సమీర్ శర్మ ప్రతీ గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
అత్యధికంగా రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పనులు
గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యధికంగా అంతర్గత రహదారులు, మంచినీటి పథకాలు, డ్రైనేజీ పనులను మంజూరు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ లైన్ల మార్పు పనులకు డిమాండ్ ఉందని, ట్రాన్స్‌కోకు అడ్వాన్స్ చెల్లింపులు లేకుండా వీటిని చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. అడ్వాన్స్ చెల్లింపుల నుంచి వీటికి మినహాయింపు కల్పించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను అప్‌లోడ్ చేసిన వారంలోగా మంజూరు చేయడంతో పాటు నెల రోజుల్లోనే ప్రారంభిస్తున్నామన్నారు.