అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల.
అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!.
ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు.
ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు.
పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు)
Comments
Please login to add a commentAdd a comment