డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు
డల్లాస్ :
భారత 68వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగరం నడబొడ్డున గాంధీ మెమోరియల్ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు.
గాంధీ విగ్రహానికి ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జాన్ హామ్మోండ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు.
'భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము. భారత జాతి పిత మహాత్మాగాంధీ ఎనలేని కృషి వల్ల 1947 ఆగష్టు15న భారత్‌కు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మన రాజ్యాంగం అమలులోకి రావడానికి దాదాపు రెండున్నర ఏళ్లు పట్టింది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంబేడ్కర్ కృషి వల్ల 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. పేద, ధనికలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించి పాటించాలి. పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య విలువలను మనం పాటించడం భారత అమెరికన్లుగా గర్వించదగ్గ విషయం' అని డాక్టర్ ప్రసాద్ తోట కూర పేర్కొన్నారు.
ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ నాయకులు తయ్యబ్ కుందావాలా, షబ్నమ్ మోడ్గిల్, జాక్ గోద్వానీ, కుంతేష్ చోస్కీ, కమల్ కౌశల్, సూరి తయ్యగరాజన్, బెనజీర్ అర్ఫీలు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.