టెక్సాస్: కరోనా కారణంగా చనిపోయిన మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా మృతి పట్ల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్‌జీఎమ్ఎన్‌టీ) వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ రెండో కుమారుడు మణిలాల్, సుశీలాబెన్‌ల కుమార్తె సీతా, శశికాంత్‌ల తనయుడు సతీష్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో మృతి చెందారని తెలిపారు. గత నెల రోజులగా న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలోనే ఆస్పత్రిలో కరోనాసోకి నవంబర్ 22న మృతి చెందడం విచారకరమన్నారు. మూడు రోజులక్రితమే సతీష్ ఆస్పత్రిలో తన 66 వ జన్మదినాన్ని జరుపుకున్నారన్నారు.
2014 లో అక్టోబర్ 2 వ తేదిన అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ను డల్లాస్‌లో సతీష్ చేతులమీదుగా ఆవిష్కరణ జరుపుకోవడం ఒక మధురానుభూతని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్ తయారుచేసిన ఆ మహాత్మాగాంధీ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోందని సతీష్ ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉన్న నాలుగు రోజులు డల్లాస్‌లో అనేక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: సియాటిల్‌లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ)
గాంధీ మునిమనవడు సతీష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎమ్‌జీఎమ్ఎన్‌టీ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రావు కల్వల, మురళి వెన్నం, జాన్ హేమండ్, రన్నా జాని, అభిజిత్ రాయల్కర్, స్వాతి షా, శైలేష్ షా, లోక్ నాథ్ పాత్రో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన సతీష్ వృత్తి పరంగా మీడియా ఫోటోగ్రాఫర్‌గా, వీడియో గ్రాఫర్‌గా పని చేశారు. ప్రవృత్తి పరంగా మహాత్మాగాంధీ 1904లో స్థాపించిన ఫేనెక్ష్ సెటిల్మెంట్‌లో, డర్బాన్ దగ్గరలో ఉన్న సంస్థలోను, గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్‌లోనూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. సతీష్‌కు ఉమ, కీర్తి అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. (చదవండి:అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment