మహాత్మగాంధీకి డల్లాస్‌లో ఘన నివాళి
- డాల్లస్‌లో జాతిపితకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఘన నివాళి
టెక్సాస్: అమెరికా దేశ సంరక్షణ కోసం అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వారికి నివాళులు అర్పించారు. ఈ తరుణంలో డాల్లస్‌లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద విశ్వశాంతికై కృషి చేసిన జాతి పిత మహాత్మా గాంధీకి.. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర నివాళులు అర్పించారు. వేదాలు, ఉపనిషత్తులు, భాగవత పురాణం, భగవద్గీత, బ్రహ్మ సూత్రాల్లాంటి అనేక ఆధ్యాత్మిక విషయాలపై వ్యాఖ్యానాత్మక ప్రవచనా పరంపరలతో కోట్లాది హృదయాల్లో భక్తి ప్రపత్తులు నింపిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేయడం సంతోషమని డాక్టర్. ప్రసాద్ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ తాను చెప్పిందే స్వయంగా ఆచరించేవారని, తాను ఆచరించిందే చెప్పేవారని, అను నిత్యం సమాజ శ్రేయస్సే శ్వాసగా తన జీవితాన్ని అంకితం చేశారని డాక్టర్. తోటకూర అన్నారు. కేవలం సనాతన ధర్మ విలువలను, వైశిష్ట్యాలను చాటి చెప్పడం, ఆధ్యాత్మిక ప్రభోధనలే గాక, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, వివిధ భారతీయ కళలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలు అందజేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గో సంరక్షణా బాధ్యతలు చేపట్టడం అనే విషయాలే ధ్యేయంగా ఋషి పీఠం అనే ధార్మిక సంస్థ ద్వారా సామాజిక సేవ చేస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కృషి అభినందనీయమని డాక్టర్. ప్రసాద్ తోటకూర కొనియాడారు.
డాక్టర్.సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతూ.. డాల్లస్ నగరంలో ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి విశ్వశాంతికై శ్రమపడిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కాల్వల కృషి ప్రశంసనీయమని అన్నారు. “గాంధీ సిద్ధాంతాలలో ప్రముఖమైనవి సామరస్యం, శాంతి, భిన్నత్వంలో ఏకత్వం. భగవద్గీత లాంటి సనాతన ధర్మాలలో కూడా ఇవే ఉన్నాయి. ఇక్కడి విగ్రహ విశేషం ఏమిటంటే గాంధీ చేతిలో భగవద్గీత ఉండటం. భారతదేశపు హృదయమే భగవద్గీత, దాన్ని తన చేతిలో పట్టుకొని చేతలో చూపించారు. గాంధీ స్వచ్ఛ భారతానికై కలలు గన్నారని, ప్రజల్లో శుభ్రత పట్ల ఒక అవగాహన కలిగించడానికి తానే స్వయంగా పారిశుధ్య కార్యక్రమాలు చేసేవారని, ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే బాటలో పయనించడం విశేషo. మహాత్మాగాంధీ గో సంరక్షణ జరగాలని, గో సంరక్షణ అనేది ఒక మతానికి సంబంధించినది కాదని, అది భారతీయతకు సంబంధించినదని, స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి సంతకం గోవధ నిషేధంపై జరగాలని ఆశించారు' అని అన్నారు.
ప్రస్తుత గోవధ నిషేధ ఆశయ సాధనలో ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ అన్ని మతాలను సమంగా గౌరవించాలి గాని మత మార్పిడులను ప్రోత్సహించకూడదని స్పష్టంగా చెప్పారని అన్నారు. గాంధీ విశ్వ మానవుడని, ఆయన చెప్పిన ప్రతి మాట మనం అమలుపరుచుకోగల్గితే, భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుస్తుందని అన్నారు. విశ్వశాంతికై పాటు పడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఎన్నో తీరిక లేని కార్యక్రమాలతో బిజీగా ఉండి కూడా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించడానికి విచ్చేసిన డాక్టర్. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు కృతజ్ఞతలు తెలుపుతూ అయన ఇచ్చిన సందేశం అమూల్యమైనదని, అలాగే ప్రవాస భారతీయులుగా మేము చేస్తున్న సామజిక సేవను ఆయన ప్రశంసించడం తమకు నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల వందన సమర్పణలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి పట్టిసం, లక్ష్మి గుంటూరి, శర్మ గుంటూరి, సాంబు మంథా, డాక్టర్. నరసింహారావు వేముల, ఎంవిఎల్ ప్రసాద్, కర్రా వెంకట్రావు, వెంకట్ ములుకుట్ల తదితరులు పాల్గొని జాతిపితకు నివాళులు అర్పించారు.