డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో అతిపెద్ద మహాత్మాగాంధీ స్మారక విగ్రహం వద్ద 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్‌లోని గాంధీ ప్లాజా వద్ద వేలాది మంది ప్రవాస భారతీయులు, వందలాదిగా చిన్నారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బోర్డు డైరెక్టర్ షబ్నమ్ మోడ్గిల్ ప్రారంభించారు. జాతిపిత బాపూజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
ఎంజీఎంఎన్‌టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం నిండుగా ఉండే అమెరికాలో 71 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి దేశానికి విముక్తి కల్పించిన గాంధీజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులైన సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబాయ్ పటేల్ ల సేవలను కొనియాడారు. అమెరికా, భారత్ ల మధ్య బంధం బలపడాలని ఆకాంక్షించారు.
ఎంజీఎంఎన్‌టీ సెక్రటరీ రావు కల్వల మాట్లాడుతూ.. గాంధీ మెమోరియల్ వద్ద ఈ వేడుకలను జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలైన శాంతి, అహింస మార్గాలను అనుసరించాలన్నారు. అక్టోబర్ 1న ఇదే వేదిక వద్ద జరగనున్న గాంధీ శాంతి పాదయాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలకు, వారి పిల్లలకు, వాలంటీర్లకు ఎంజీఎంఎన్‌టీ కో చైర్మన్ సల్మాన్ ఫర్షోరి ధన్యవాదాలు తెలిపారు.
భారత నేవీ మాజీ కమాండర్ గవి కుమార్, భారత ఆర్మీ మేజర్ రాజ్ దీప్‌లను స్పెషల్ గెస్ట్‌లుగా ఆహ్వానించారు. ఎన్‌ఆర్ఐలు ముఖ్యంగా చిన్నారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తీరును గవి కుమార్ ప్రశంసించారు. ఎంజీఎంఎన్‌టీ బృందం రెండు పార్కు బెంచీలను ఆవిష్కరించి కందూరి ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎంఎన్‌టీ బృందం సభ్యులు ఎంవీఎల్ ప్రసాద్, మన్హర్ మేఘని, తాయిబ్ కుందావాలా, పీయుష్ పటేల్, బీఎన్, బినజీర్ అర్ఫీ, రెహమన్, సూరి త్యాగరాజన్, జాక్ గోధ్వానిలు పాల్గొన్నారు.
డల్లాస్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలు
Published Thu, Aug 17 2017 12:01 AM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM
Advertisement
Advertisement