Ancestors
-
జీవన్ భద్రాణి పశ్యంతు
మన పూర్వులు పిల్లలకి జీవితం మీద ఆశని కలిగించి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా సానుకూల దృక్పథం పెం΄÷ందే విధంగా మనసులని మలచేవారు. అందుకే ఒకప్పుడు ఆత్మహత్యల వంటివి అంతగా కనపడేవి కావు. ఎక్కడో ఒకటి జరిగితే అదేదో వింత అన్నట్టు అందరూ కంగారు పడేవారు. ఇప్పుడు అవి అతి సామాన్యమై ΄ోయాయి. అది చాలా మామూలు విషయంగా పరిగణించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. ప్రతిస్పందించే సున్నితత్వాన్ని కూడా కోల్పోయాం. ‘‘బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు’’ అన్నది భారతీయుల విశ్వాసం. ఇటువంటి భావాలని అతి సామాన్యమైన మాటలలో అందరి మనస్సులలో నాటుకునేట్టు చేశారు. బ్రతుకుని అంతం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా వాతావరణాన్ని ఉంచేవారు. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చావో రేవో అన్నంత తీవ్రంగా తీసుకునే వారు కాదు. ‘‘కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా?’’ అని తేలిక చేసేవారు, మనం అందరం మనుషులం అని గుర్తు చేస్తూ. ఈనాడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది చిన్నతనంలో కడుపునిండా తిండి కూడా లేనివారు అని వారి జీవితచరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ‘‘బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అని చెప్పి సాంత్వన కలిగించే వారు. పైగా, ఆ రోజుల్లో అనుకున్నది సాధించక ΄ోవటం, పరాజయాల పాలు కావటం జరిగి, తాత్కాలికంగా నిరాశ కలిగినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో లేదా కసితో అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నం చేసేవారు. తాము విఫలం కావటానికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకునేవారు. ఇది కార్యసాధకుల లక్షణం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపూ కాదు. ఈ ఆలోచనా విధానం నేటి యువతరంలోను, మధ్యవయస్కులలోనూ మృగ్యం అయింది. తక్షణం అనుకున్న ఫలితం రావాలి, తన ప్రయత్నంతో సంబంధం లేకుండా. అపజయాన్ని, ఓటమిని అసలు ఎదుర్కో లేరు. కొంచెం కూడా ఆగలేరు. నిర్ధారణ చేసుకునే ఓపిక కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో ΄÷రపాటు పడే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉంటాం. మొదటి వంద స్థానాల్లో ఉండవలసిన అభ్యర్థి ఉత్తీర్ణుడు కాలేదని ప్రకటన రాగానే తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న మరునాడు ఆ ప్రకటన తప్పు అని సరి చేసుకోటం తెలుసు కదా! మనసుని ఆ మాత్రం అదుపులో ఉంచలేక ΄ోవటం వల్ల వచ్చిన ప్రమాదం అది. ప్రాణాలు అర్పించి సాధించారు, బలిదానం చేశారు అంటూ ΄÷గిడితే వారికి ఒరిగేది ఏముంది? మిగిలిన వారు అనుభవించ వచ్చు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. సమయం పట్టవచ్చు. మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఏమంటే, ప్రాణత్యాగం చేయదల్చుకున్న వారిని ఒక్క క్షణం ఆపగలిగితే చాలు నట. క్షణికావేశం చల్లారుతుంది అంటారు. ఆ పనిని ఎవరు చేయగలరు? అసలు ఎవరికైనా తెలియాలి కదా! అందుకే ఎవరికి వారే తమను తాము సముదాయించుకుని, పరిస్థితులతో ΄ోరాడి గెలవాలి. కలిగిన మేలు అనుభవించటానికి బ్రతికి ఉండాలి కదా!ఈ బతుకుని అంతం చేసుకోవాలనే భావన ఎవరికీ రాదా? సీతమ్మకి, హనుమకి, రామచంద్రమూర్తికి, దుర్యోధనుడి వంటి వారికే వచ్చింది. కాని విచక్షణ వారిని ఆపని చేయకుండా కాపాడింది. సీతమ్మ కనపడలేదని హనుమ ఏ విధంగా శరీరం వదలాలి అని ఆలోచిస్తూ సీతారామలక్ష్మణులకి, సుగ్రీవాదులకి నమస్కారం చేయగానే అశోకవనం కనపడింది. దైవాన్ని, పెద్దలని స్మరిస్తే మార్గం కనపడుతుంది. సీత కూడా జుట్టుతో చెట్టు కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా త్రిజట మాటలు, హనుమ దర్శనం కలిగాయి. తొందర పడితే? రాముడు కూడా సీత లేకుండా ఉండలేనని అనుకుని, అరణ్యవాసం చేయలేదనే చెడ్డపేరు వస్తుందని ఆగాడు. ఆవేశ పడకుండా కొద్దిగా ఆలోచిస్తే మంచి జరిగి తీరుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
చాళుక్య వంశ మూలపురుషుడి జన్మస్థలం.. ‘పెద్దముడియం’
జమ్మలమడుగు: ప్రాచీన మధ్య యుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజవంశాలలో చాళుక్యవంశం ఒకటి. బాదామి(వాతాపి) చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇలా శాఖోపశాఖలుగా దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలను సుదీర్ఘంగా పలించిన చాళుక్య వంశంలో మూల పురుషుడు విష్ణువర్థనుడు. విష్ణువర్థనుడు దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం గురించి వీరచోడుడు వేయించిన చెల్లూరు(తూర్పుగోదావరి జిల్లా) తామ్రా శాసనం వివరిస్తుంది. ఈ శాసనం ప్రకారం చాళుక్యులు అయోధ్యా నగరానికి చెందిన చంద్రవంశరాజులు. వీరి పరంపరలో ఉదయనుడు అనే రాజు తరువాత 59 మంది రాజులు అయోధ్యను పాలించారు. తరువాత ఆ వంశంలోని విజయాదిత్యుడు అనే రాజు దక్షిణ జనపథానికి వచ్చాడు. విజయాదిత్యుడు పల్లవ రాజు త్రిలోచనుడుకి జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు మరణించాడు. విజయాదిత్యుడి భార్య అప్పటికే గర్భవతి. ఆమె ముదివేము అనే అగ్రహారంలో విష్ణుభట్ట సోమయాజి అనే బ్రహ్మణుడి వద్ద ఆశ్రయం పొందింది. ఆమెకు మగ శిశువు జన్మించగా తమకు ఆశ్రయం ఇచ్చిన విష్ణుభట్ట పేరుమీద ఆ రాణి ఆ బాలుడికి విష్ణువర్థనుడు అని పేరు పెడుతుంది. విష్ణువర్థనుడు పెరిగి పెద్దయిన తర్వాత జరిగిన చరిత్రంతా తల్లి ద్వారా తెలుసుకుని చాణ్యు గిరికి వెళ్లి నందాదేవిని ఆరాధించి, కుమార నారాయణ, మాతృగణములను తృప్తి పరచి రాజచిహ్నాలైన శ్వేతా పత్రంలో శంఖము, పంచ మహా శబ్దము జెండా(పాలికేతన) వరాహా లాంఛనములు, పింఛ కుంత(బల్లెము) సింహాసనం మొదలైన వాటిని తీసుకుని కాదంబ, గాంగ రాజులను ఓడించి సమస్త దక్షిణ పథమును ఏలినాడు. ఈ విష్ణువర్థనుడే బాదామి చాణక్యులకు మూల పురుషుడు. చెల్లూరు శాసనంలో ముదివేము నేడు కడప జిల్లాలో ఉన్న పెద్దముడియం అని 1903లో జమ్మలమడుగు తాలూకా డివిజన్ ఆఫీసర్ అయిన శ్రీరామయ్య పంతులు ప్రతిపాదించారు. నేడు కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పెద్దముడియం మండలకేంద్రంగా కుముద్వతీ (కుందూ)నది తీరాన ఉన్నది పెద్దముడియం. విష్ణు వర్థనుడి తండ్రి విజయాదిత్యుడు యుద్ధం చేసింది త్రిలోచన పల్లవుడితో కాగా పెద్దముడియం ఆగ్రహారాన్ని దానమిచ్చింది కూడా త్రిలోచన పల్లవుడే. పెద్దముడియం శాసనాలలో విష్ణు వర్ధునుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. -
తమిళనాడు సీఎం పూర్వీకులు ఎక్కడి వారో తెలుసా..?
ఒంగోలు(ప్రకాశం జిల్లా): తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులోని వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాన విద్యాంసులుగా పని చేస్తుండేవారు. ఈ క్రమంలోనే వారికి అక్కడికి అతి సమీపంలోని ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో 150 ఎకరాల భూమిని, పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల మాగాణి భూమిని, చెరువుకొమ్ముపాలెంలో నివాసం ఉండేందుకు భూమిని ఇచ్చినట్లుగా ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంకటగిరి రాజుల వారసులు ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్నారు. వారు మాత్రం డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తాతల కాలంలోనే పంటలు పండక కరువు కాటకా వల్ల చెన్నపట్నంకు వలస వెళ్ళినట్లు తమ పూర్వీకులు చెబుతుండేవారని పేర్కొంటుంటారు. అయితే అలా వెళ్ళిన కరుణానిధి చివరకు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలగడం తమ గ్రామానికి గొప్పతనంగా వారు చెబుతుంటారు. భూములు ఇప్పటికీ ఉన్నా వారు ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవని చెబుతూ కరుణానిధి కుమారుడు మరలా స్టాలిన్ సీఎం కావడం తమకు గర్వంగా ఉందని పేర్కొంటున్నారు. కరుణానిధి ఏలూరులో జరిగిన ఒక సాహిత్య సభలో ఈ అంశాన్ని ప్రస్తావించాడని, ఒంగోలులో జరిగే సాహిత్య సభకు కూడా త్వరలోనే వస్తానని చెప్పారని, స్టాలిన్‌ను కూడా ఒకసారి జిల్లాకు రావాలని కోరడం జరిగిందని, అయితే ఆయన రాలేకపోయారంటూ నాయీ బ్రాహ్మణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా తెలుగువాడు, అందులోను మన ఒంగోలు వాసి తమిళనాట మరో సీఎం కావడం జిల్లావాసులకు కూడా గర్వ కారణంగానే చెప్పవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తమిళనాడు సీఎంగా స్టాలిన్ రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి -
3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’
కైరో: ఈజిప్ట్‌లో పురాతత్వవేత్త శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతన పట్టణాన్ని గుర్తించారు. 3 వేల సంవత్సరాల క్రితం నాటి ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అనే పేరుగల నగరాన్ని శాస్త్రవేత్తల బృందం ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్లో గుర్తించింది. ఈజిప్ట్‌లో గతంలో బయటపడిన టుటన్ఖమాన్ సమాధి తర్వాత ఈ పట్టణం అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘లాస్ట్ సిటీ’గా పిలివబడుతన్న ఈ పట్టణం పేరు ఏతెన్. 1391 నుంచి 1353 బీసీ మధ్యకాలంలో పురాతన ఈజిప్ట్‌ని పాలించిన 18 వ రాజవంశానికి చెందిన తొమ్మిదవ రాజు కింగ్ అమెన్హోటెప్ III ఈ నగరాన్ని నిర్మించినట్లు చరిత్ర వెల్లడిస్తుందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. లక్సోర్ పశ్చిమ ఒడ్డున నిర్మించిన ఈ నగరం ఆ యుగంలో అతిపెద్ద పరిపాలనా, పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్ర వెల్లడిస్తుంది. "ఈ లాస్ట్ సిటీ ఆవిష్కరణ.. టుటన్ఖమాన్ సమాధి తరువాత రెండవ అతి ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ" అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఈజిప్టు ప్రొఫెసర్, ఈ మిషన్ సభ్యుడు అయిన బెట్సీ బ్రయాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిష్కరణ సామ్రాజ్యం సంపన్న స్థితిలో ఉన్నప్పుడు పురాతన ఈజిప్షియన్ల జీవితానికి సంబంధించిన అరుదైన సమాచారాన్ని ఇస్తుంది" అన్నారు బెట్సీ. పురాతన ఈజిప్టును పాలించిన రాజవంశాల గురించి దేశవ్యాప్తంగా సాగుతున్న అధ్యయనంలో ఇటీవల కాలంలో కనుగొన్న పురావస్తు పరిశోధనల శ్రేణిలో ‘‘లాస్ట్ సిటీ’’ ఆవిష్కరణ తాజాది. కరోనా వైరస్ మహమ్మారి, ఇస్లామిస్ట్ మిలిటెంట్ దాడులు, రాజకీయ అస్థిరత వల్ల గత కొద్ది కాలంగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన ఈజిప్ట్ పర్యాటక రంగానికి ఇటువంటి ఆవిష్కరణలు పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని.. పర్యాటకులను ఆకర్షిస్తాయని ఈజిప్ట్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక గతంలో చాలా విదేశీ బృందాలు ఈ నగరం కోసం పరిశోధించాయని.. కానీ వారు ఎవరు దీన్నీ గుర్తించలేకపోయారని బెట్సీ తెలిపాడు. ఈ నగరం అమెన్హోటెప్ III కాలం నుంచి ఆయన కుమారుడు, టుటింఖ్మాన్ తండ్రి అమెన్హోటెప్ IV వరకు ఉన్నత స్థితిలో ఉన్నదని చరిత్ర వెల్లడిస్తోంది. నగరం వీధులు ఇళ్ళతో చుట్టుముట్టబడి ఉన్నాయని శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడైన హవాస్ తెలిపాడు. ఈ నగరంలో కొన్ని గోడలు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కింగ్ అమేన్హోటెప్ III ముద్రలను కలిగి ఉన్న వైన్ నాణాలు, ఉంగరాలు, స్కార్బ్‌లు, కుండలు, మట్టి ఇటుకలపై దొరికిన చిత్రలిపి శాసనాల ద్వారా పురావస్తు బృందం ఈ నగరం వర్థిల్లిన కాలాన్ని గుర్తించింది. నగరం దక్షిణ భాగంలో, పురావస్తు శాస్త్రవేత్తలు ఆహారాన్ని నిల్వ చేయడానికి కుండలు, ఓవెన్లు ఉన్న బేకరీతో పాటు పెద్ద వంటగదిని కనుగొన్నారు. ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉన్న జిగ్‌జాగ్ గోడతో కంచె వేయబడిన పరిపాలనా, నివాస జిల్లాను వారు కనుగొన్నారు. ఇది భద్రత కల్పించడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. మూడవ ప్రాంతంలో ఒక వర్క్‌షాప్ ఉంది. ఆలయం, సమాధులతో పాటు తాయెత్తులు, ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే కాస్టింగ్ అచ్చులను బృందం కనుగొంది. "తవ్విన ప్రాంతాలన్నిటిలో, స్పిన్నింగ్, నేత వంటి పారిశ్రామిక కార్యకలాపాలలో ఉపయోగించే అనేక సాధనాలను మా బృందం గుర్తించింది’’ అని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఒక గదిలో రెండు ఆవులు లేదా ఎద్దుల సమాధులు కనుగొన్నారు. మరొక ప్రాంతంలో ఒక వ్యక్తి అవశేషాలు గుర్తించారు. నగరానికి ఉత్తరాన ఒక పెద్ద స్మశానవాటిక, అలాగే రాతి నుంచి కత్తిరించిన సమాధుల సమూహం బయటపడినట్లు వెల్లడించారు. చదవండి: మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో! -
రాజాంలో ఆదిమానవుల ఆనవాళ్లు
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లా రాజాం మండల పరిధి రాజయ్యపేట గ్రామంలో నవీన శిలాయుగ ఆనవాళ్లు లభించాయని రాజాం రచయితల వేదిక నిర్వాహకులు గార రంగనాథం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజాం చరిత్ర రచనలో భాగంగా రాజయ్యపేట వెళ్లానన్నారు. అక్కడ మంచినీటి కోనేరు దక్షిణ గట్టున ఉన్న తుప్పల మధ్య బండరాతి మీద లోతుగా చెక్కినట్టు ఉన్న గుర్తులను గమనించానని, అవి క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల నాటివని తెలిపారు. ఆదిమానవుడు ఆధునికుడయ్యే క్రమంలో రాతి బండలమీద, కొండలమీద నల్ల శానపు రాళ్లను అరగదీసి పనిముట్లుగా మార్చుకునేవాడని, ఆ విధంగా ఏర్పడినవే ఆ రాతి గోతులని వివరించారు. ఈ విషయాన్ని విజయవాడ ఆర్కియాలజీ సాంకేతిక నిపుణులు లీలా సుబ్రహ్మణ్యంతో సంప్రదించి ధ్రువీకరించామని వెల్లడించారు. రాజాంలో పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని అన్నారు. -
‘నవంబర్, డిసెంబర్లోనే భారత్‌లో కరోనా?’
హైదరాబాద్: దేశంలోకెల్లా ప్రసిద్ధి గాంచిన రీసర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు సంబంధించి కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. దీని ప్రకారం వుహాన్‌లో గుర్తించిన కరోనా వైరస్ జాతి పూర్వ వైరస్ ఒకటి 2019 డిసెంబర్ 11 నుంచి భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘ఎమ్ఆర్సీఏ’(మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెస్టర్) అనే శాస్త్రీయ పద్దతి ద్వారా ప్రస్తుతం తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో ఉద్భవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండు తేదీల మధ్యస్థ సగటు సగటు డిసెంబర్ 11 కాబట్టి అప్పటినుంచే ఇది వ్యాప్తిలో ఉన్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే జనవరి 30కి ముందే చైనా నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ వైరస్‌ను తీసుకువచ్చారా, లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశంలో సామూహిక పరీక్షలు ఎక్కువ జరగలేదు కాబట్టి ఈ అంశంలో స్పష్టత లేదంటున్నారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్‌లోని సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు చెందిన అనేక జాతుల ‘మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెస్టర్’ వయస్సును లెక్కించారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఉన్న వాటికి భిన్నమైన మరో కొత్త జాతిని గుర్తించారు. దీనికి క్లాడ్ ఐ/ ఏ3(I / A3) అని పేరు పెట్టినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. భారతదేశంలో కేరళలో మొదటి కరోనా కేసును గుర్తించారు. ఈ వైరస్.. వుహాన్‌లో గుర్తించబడిన వైరస్ కుటుంబానికి చెందినది. అయితే, హైదరాబాద్‌లో గుర్తించిన వైరస్, వుహాన్ వైరస్‌కు భిన్నంగా ఉంది. క్లాడ్ ఐ/ ఏ3(I / A3) వైరస్ మూలం వుహాన్ కాదని.. ఆగ్నేయాసియాలో ఎక్కడో ఉందని నిర్ధారించబడినట్లు నివేదిక తెలిపింది. ఈ వైరస్ కచ్చితంగా ఏ దేశంలో ఉద్భవించింది అనే విషయం ఇంకా తెలియలేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె మిశ్రా వెల్లడించారు. మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెటర్ ప్రకారం ఈ కొత్త వైరస్ జాతి క్లాడ్ ఐ/ ఏ3 (I / A3) జనవరి 17, ఫిబ్రవరి 25 మధ్య కాలంలో వ్యాప్తి చెందడం ప్రారంభించిదని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ కొత్త క్లాడ్ కేసులు గరిష్టంగా ఉన్నాయని రాకేశ్ మిశ్రా తెలిపారు. (నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా) -
కీలెరిగిన పాదం
పూర్వీకులు అందించిన ఆయురారోగ్యశాస్త్రం యోగా. దేహంలోని ప్రతి అవయవాన్నీ చైతన్యవంతం చేసే ఏకైక సాధనం ఇది. శరీర భాగాలను ఆధారం చేసుకుని యోగాసనాలు సాధన చేసే క్రమంలో శరీరాన్ని ముందుకు కదిలించే పాదం సజీవ చైతన్యాన్ని సైతం ముందడుగు వేయిస్తోంది. ఆసనాలకు ఆసరాగా అమరిపోతూ ఆరోగ్య భాగ్యం అందిస్తోంది. అద్భుతమైన ఫలాలను అందించే ఆసనాలకు వందనం. వాటిని మనకు చేరువ చేస్తున్న యోగా నిపుణులకు పాదాభివందనం. పాదాలను ఆధారం చేసుకుని చేసే ఆసనాలు ఈ వారం... ఉభయ పాదాంగుష్టాసన సమస్థితిలో కూర్చుని కాళ్లు ముందుకు చేతులు రెండూ పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ తలనూ శరీరాన్ని ముందుకు శ్వాస తీసుకుంటూ చేతులు కాళ్లు రెండూ వీలైనంత వరకూ కలిపి ఉంచుతూ వెనుకకు రోల్ అవుతూ నావాసన సాధన చేసిన తరువాత మెడ వెన్నెముక బాగా రిలాక్స్ అవుతుంది. ఐదారుసార్లు వెనక్కు, ముందుకు బాగా రోల్ అయిన తర్వాత సీటు భాగం నేల మీద సపోర్ట్‌గా ఉంచి కాళ్లను పైకి లేపి కాలి బొటన వేళ్లను గాని పాదాలను గాని రెండు చేతుల్తో పట్టుకుని శ్వాస వదులుతూ కాళ్లు రెండూ శరీరానికి వీలైనంత దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్లను స్ట్రెయిట్‌గా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులు పాదాలను చేత్తో పట్టుకోవడం వీలుకాకపోతే ఏదైనా తాడును కాని చిన్న టవల్‌ను కాని ఉపయోగించవచ్చు. సీటు మీద బ్యాలెన్స్ చేయలేని వారు ముందు ఒక గోడకు వీపును ఆనించి కాళ్లు రెండూ పైకి లేపి చేత్తో పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఉపయోగాలు పొట్టలో భాగాలన్నింటికీ టోనింగ్ జరుగుతుంది. జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. లివర్, పాంక్రియాస్ ఉత్తేజితమవుతాయి. అధిక వెన్నెముక సమస్య, హెర్నియా నివారణకు మేలు. బ్యాలెన్సింగ్ వలన ఏకాగ్రత మెరుగవుతుంది. ప్రసారిత ఏక పాదాంగుష్టాసన ఉభయ పాదాంగుష్టాసనం తర్వాత శరీరం బాగా వార్మప్ అయి ఉంటుంది. అందువలన సాధారణ స్థితికి వచ్చాక, ఎడమకాలుని ఎడమవైపునకు స్ట్రెచ్ చేసి కుడికాలుని కుడి భుజం మీదకు తీసుకువచ్చి కుడి పాదం తలకు దగ్గరగా (ఏకపాద శిరాసనం) తీసుకురావాలి. కుడి అరచేతిని నేల మీదకు సపోర్ట్‌గా ఉంచి కుడి భుజంతో కుడి తొడ లోపలి భాగాన్ని లోపలకు నొక్కుతూ కుడి కాలి పాదాన్ని ఎడమచేతితో పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఆసనం లోనికి వెళ్లాక 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకున్న అనంతరం శ్వాస తీసుకుని, వదులుతూ కుడి చేతిని ముందుకు రెండు కాళ్లను ముందుకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా సాధన చేయాలి. ఉపయోగాలు తొడ కీలు భాగం, సయాటికా సమస్యల నుంచి విముక్తి. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం
భాద్రపదమాసంలోని బహుళపక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం. అందుకే దీనిని పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రవచనం. ఈ నెల 19, గురువారం నుంచి మొదలైన ఈ పితృపక్షం అక్టోబర్ 5న మహాలయ అమావాస్యతో ముగియనుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతిముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా తర్పణలు చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకలశుభాలూ కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి శక్తి లేదా స్థోమత లేనివారు ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణునికి స్వయంపాకం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలిదప్పులు తీరి తమ వంశస్థులను సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు. మన పితరుల ఆత్మకు శాంతి కలిగినప్పుడే ఇహలోకంలో మనకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయనీ, వంశాభివృద్ధి కలుగుతుందని ప్రామాణిక శాస్త్రగ్రంథాలయిన ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. ఎంతో దానశీలుడిగా పేరుపొందిన కర్ణుడు కోరినవారికి కాదనకుండా ధన, కనక, వస్తు, వాహన రూపేణా భూరిదానాలు చేశాడు. అయితే అన్నిదానాలలోనూ మిన్న అయిన అన్నదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా మరణానంతరం ఆయన ఆత్మ ఆకలిదప్పులు తీరక ఆర్తితో అలమటించవలసి వచ్చింది. అప్పుడు దేవతలందరి అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పక్షం రోజులపాటు ఉండి, కురుక్షేత్ర సంగ్రామంలో అసువులు బాసిన తన జ్ఞాతులకు అంటే దాయాదులకు, సైనికులకు తదితరులందరికీ తర్పణలు వదిలి తన రాజ్యంలోని పేదసాదలకు, పెద్దఎత్తున అన్నసంతర్పణలు చేసి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ పక్షం రోజులకే మహాలయపక్షాలని పేరు. శాస్త్రరీత్యా ఈ పదిహేను రోజులూ ఎటువంటి శుభకార్యాలూ నిర్వర్తించకూడదు. మహాలయ త ర్పణలు ఎవరెవరికి? స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, (తల్లిదండ్రుల జననీ జనకులు) తల్లిదండ్రుల తోబుట్టువులకు, గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టినవారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితునికి, అతని భార్యకు..... వీరిలో వారసులు లేకుండా మృతి చెందినవారికి ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా వివిధ ప్రమాదాలలో అకాల మరణం చెందిన వారికోసం కూడా తర్పణ విడిస్తే మంచిది. ఇలాంటి ఆచారవ్యవహారాల మీద విశ్వాసం ఉన్నప్పటికీ, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇంటిలో ఇటువంటివాటిని నిర్వహించడం వీలుపడనివారు శ్రీశైలం, తిరుమల, కాశీ, రామేశ్వరం తదితర నిత్యాన్నదాన సత్రాలలో శక్త్యనుసారం వీలైనంత మందికి భోజనాలు పెట్టేలా చందా లేదా విరాళాలు చెల్లిస్తే, మన పెద్దల పేరిట వారే భోజన సంతర్పణ ఏర్పాట్లు చేస్తారు. లౌకికంగా కూడా... అసలు ఈ తర్పణలు, తిలోదకాలు ... వంటి వైదికపరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేనివారు కూడా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా చనిపోయిన తల్లిదండ్రులను లేదా తాతముత్తాతలను తలచుకుని, మనం ఏ అన్నాన్నయితే తింటున్నామో, దానినే... అర్హులయిన పేదలను ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెడితే... వారికి కడుపు, మనకు గుండె నిండుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నవారైనా, వస్త్రదానం, ధనదానం తదితర ఏ రకమైన దానాలు చేసినప్పటికీ, ఆయా దానాలు పుచ్చుకునేవారు మాత్రం మొహమాటానికి చాలని చెప్పినా, మనసులో మాత్రం ‘వీరికి అంత ఉంది కదా, మరికొంచెం ఇస్తే బాగుండును’ అనిపిస్తుంది. అదే అన్నదానంతో మాత్రం కడుపు నిండా తిన్న తరువాత తృప్తి పడి ‘ఇక చాలు’ అని అనాల్సిందే. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే మిన్న అని శాస్త్రం చెప్పింది. ఈ పక్షంలో మిగిలిన కొద్దికాలాన్నైనా ఈ రీతిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. - డి.వి.ఆర్. మీకు తెలుసా! ఎల్ల అంటే గుర్తు లేదా గ్రామ సరిహద్దు అని అర్థం. ఎల్లలలో అంటే గ్రామ సరిహద్దులలో ఉండి ఊరినంతటినీ కాపాడే జగదాంబ స్వరూపమే ఎల్లమ్మ. పోలేరమ్మ అంటే పొలాలకు అమ్మ. పొలాలమ్మ అనే మాటే పోలేరమ్మగా పరిణమించింది. ఆమె పొలాలను కాపాడే చల్లని తల్లి అన్నమాట. మావూళ్లమ్మ అంటే ఊరిని కాపాడే తల్లి అని అర్థం. మా ఊరి అమ్మ అనే దాని నుంచే మావూళ్లమ్మ అనే నామం ఏర్పడింది.