
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లా రాజాం మండల పరిధి రాజయ్యపేట గ్రామంలో నవీన శిలాయుగ ఆనవాళ్లు లభించాయని రాజాం రచయితల వేదిక నిర్వాహకులు గార రంగనాథం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజాం చరిత్ర రచనలో భాగంగా రాజయ్యపేట వెళ్లానన్నారు. అక్కడ మంచినీటి కోనేరు దక్షిణ గట్టున ఉన్న తుప్పల మధ్య బండరాతి మీద లోతుగా చెక్కినట్టు ఉన్న గుర్తులను గమనించానని, అవి క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల నాటివని తెలిపారు. ఆదిమానవుడు ఆధునికుడయ్యే క్రమంలో రాతి బండలమీద, కొండలమీద నల్ల శానపు రాళ్లను అరగదీసి పనిముట్లుగా మార్చుకునేవాడని, ఆ విధంగా ఏర్పడినవే ఆ రాతి గోతులని వివరించారు. ఈ విషయాన్ని విజయవాడ ఆర్కియాలజీ సాంకేతిక నిపుణులు లీలా సుబ్రహ్మణ్యంతో సంప్రదించి ధ్రువీకరించామని వెల్లడించారు. రాజాంలో పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment