మన అడుగులు ఎటువైపు?! | India wants an egalitarian democracy | Sakshi
Sakshi News home page

మన అడుగులు ఎటువైపు?!

Published Fri, Dec 27 2024 4:09 AM | Last Updated on Fri, Dec 27 2024 4:09 AM

India wants an egalitarian democracy

భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్‌’ అర్థం కూడా ఇదే! 

కానీ ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సహజీవనంతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికే ప్రయత్నాలు జరుగుతున్నట్లనిపిస్తోంది. గతాన్ని మార్చలేము. గతం నుంచి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచారాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పిన పాఠం.

భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్‌ కుమార్, కేవీ విశ్వనాథన్ లు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడిన పిటిషన్ లను తిరిగి విచారించినప్పుడు, మీడియా మరోసారి పిటిషన ర్లను ‘హిందూ’ లేదా ‘ముస్లిం’ అనే రెండు పక్షాలుగా పేర్కొంటుంది. సీజేఐ, ఆయన తోటి న్యాయమూర్తులు తమ తీర్పును ఇచ్చిన తర్వాత, మీడియా ‘విజయం సాధించిన పక్షం’ అనే శీర్షికను పెడు తుంది. 

నిజానికి, ఆ తీర్పు విజయాన్ని మించి మరింత ప్రాముఖ్యం కలిగినది. ఇది రెండు సంఘర్షణాత్మక దృక్పథాల మధ్య ప్రభావం చూపుతుంది, ఒకటి భారతదేశంలో సమానత్వంతో కూడిన ప్రజాస్వా మ్యాన్ని కోరుకుంటుంది, మరొకటి మెజారిటీ ఆధిపత్యాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ తీర్పు హిందూ మతంపై ప్రపంచ అవగాహనను కూడా ప్రభావితం చేస్తుంది.

చికాగోలో 1893లో జరిగిన ప్రపంచ సర్వ మత మహాసభముందు స్వామి వివేకానంద పేర్కొన్న ప్రఖ్యాతిగాంచిన మాటలు హిందూ మతానికి ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠ తేవడంలో సాయపడ్డాయి: ‘‘సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ ప్రపంచానికి బోధించిన మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను. మేము విశ్వవ్యాప్తసహనాన్ని మాత్రమే నమ్ముతాము, మేము అన్ని మతాలూ నిజమని అంగీకరిస్తాం’’ అన్నారు. తిరిగి 1896లో లండన్‌లో... ‘‘భారతీయులు ప్రజాస్వామ్యాన్ని హత్తుకుంటారు. ఐక్యతను, సమానత్వాన్ని ప్రతిష్ఠి స్తారు’’ అని పునరుద్ఘాటించారు. 

భారతదేశం ఆలింగనం చేసుకోవాలని వివేకానంద ఆశించిన ప్రజాస్వామ్యం, భారత గడ్డపై ప్రతిష్ఠించాలని ఆయన కోరుకున్న ఐక్యత, నాటాలనుకున్న సమానత్వపు మొక్కలు.. భారత రాజ్యాంగం అమోదం పొందిన 1949 నాటి నుండి కనిపించాయి. దాని పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ,నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ; హోదా, అవకాశాల సమా నత్వం; అలాగే... సోదరత్వం, వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్ర తలకు హామీ ఇస్తోంది. 

తదుపరి 75 సంవత్సరాలలో, కొన్ని తీవ్రమైన మినహాయింపులను పక్కన పెడితే, భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఉల్లంఘించకుండా చాలా వరకు దూరంగా ఉన్నాయి. అయితే, ఆగ్రహం పెద్ద సంఖ్యలో ప్రజలను ఉత్తేజపరిచినప్పుడు, హింసను నియంత్రించడానికి అధికారులు నిరాకరించినప్పుడు రాజ్యాంగ వాగ్దానాలు మృతప్రాయంగా మారటం తెలిసిందే. సుప్రీంకోర్టు తన 2019 నాటి అయోధ్య తీర్పులో పేర్కొన్నట్లుగా, 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఇదే జరిగింది. 

2019 నాటి ఆ తీర్పులో, మసీదు ఉన్న మైదానంలో రామమందిరాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది. ఆ మసీదును ప్రార్థనా స్థలాల చట్టం–1991 నుండి జాగ్రత్తగా మినహాయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతర మసీదుల పునాదులపైన కూడా మును పటి హిందూ పుణ్యక్షేత్రాల చిహ్నాల కోసం శోధించడాన్ని అనుమతిస్తే, ఆ చట్టానికి అర్థమే లేకుండా పోతుంది. పైగా, అటువంటి తీర్పు... హిందూ మతం అసహనంతో, ఆగ్రహంతో కూడుకున్నదనీ; వివేకా నంద, ఆయనతో ఏకీభవించిన నాలుగు తరాల హిందూ ఆలోచనా పరులు ఆనాడు వాస్తవాన్ని గ్రహించలేకపోయారనీ ప్రపంచానికి చాటి చెబుతుంది.

అతని లేదా ఆమె పూర్వీకుడు నా పూర్వీకుడికి హాని కలిగించినందున నేను ఎవరినైనా గాయపరచడం చట్టబద్ధం కాదని ఆధునిక ప్రపంచం అంగీకరిస్తుంది. మూలవాస ఆఫ్రికన్‌లు, అమెరికన్లు, కెనడి యన్లు, ఇంకా ఆస్ట్రేలియన్లు స్వదేశీ అనుమతి లేకుండా తమ భూమిలో స్థిరపడిన బయటివారి (భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులు సహా) వారసులను బహిష్కరించాలని డిమాండ్‌ చేయరు. ఈ ‘అంగీకారాన్ని’ మనం మానవత్వం, ఇంగితజ్ఞానం, వ్యావహారిక సత్తా వాదం లేదా మరొకదాని ఘనతగా పేర్కొన్నప్పటికీ, అది మనప్రపంచ పురోగతి గాథను గుర్తించింది.

భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్త వులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్‌’ అర్థం కూడా ఇదే.

నేను 1999లో రాసిన పుస్తకం, ‘రివెంజ్‌ అండ్‌ రీకన్సిలియేషన్‌: అండర్‌స్టాండింగ్‌ సౌత్‌ ఏషియన్‌ హిస్టరీ’లో పేర్కొన్నట్లుగా, బుద్ధుడు ప్రబోధించిన సోదరభావానికీ, మహా భారత కథలో ఆధిపత్యం వహించిన ప్రతీకారానికీ మధ్య ఏదో ఒక దానిని మన ఉపఖండంలోని ప్రజలు ఎంచుకోవాల్సి వచ్చింది.

ప్రతీకారం సూత్రంగా, సర్వత్రా సంహారమే పరాకాష్ఠగా కనిపించే మహాభారతంలో కూడా, సయోధ్య స్ఫూర్తి, పాఠకుల హృద యాన్ని సాంత్వనపరిచే శక్తిమంతమైన మినహాయింపులు ఉండటం కనిపిస్తుంది. భారత ఇతిహాసంలోని అత్యంత నాటకీయ సన్నివేశా లలో, యుద్ధం ముగిసిన తర్వాత, దాదాపు ప్రతి కథానాయకుడు మరణానికి గురైన తరువాత, దుఃఖంలో ఉన్న స్త్రీలను, జీవించి ఉన్న కొంతమంది యువరాజులను పురాణకర్త వ్యాసుడు ఓదార్చాడు. 

వ్యాసుడు అప్పుడప్పుడు కథా సన్నివేశాలలోకి ప్రవేశిస్తాడు. ‘నేను మీ దుఃఖాన్ని పోగొడతాను’ అని దుఃఖిస్తున్న వారితో చెబుతూ, వ్యాసుడు చనిపోయిన వారిని భాగీరథీ నదీ జలాల నుండి బయటకు వచ్చేలా చేశాడు:  ద్వేషం అసూయ నుండి ప్రక్షాళన కాబడినది / తండ్రిని తల్లిని కొడుకు కలిసాడు / భార్య భర్తను కలుసుకున్నది / స్నేహితుడు స్నేహితుడిని పలకరించాడు/ పాండవులు కర్ణుడిని కలి శారు/ అతడిని కౌగిలించుకున్నారు/ అని రాశాడు. అది సయోధ్యకు సంబంధించిన దృశ్యం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, అను మానం లేదు, నిందలు లేవు. అది ప్రేమించే మనసుల కలయిక తప్ప మరేమీ కాదు. (పి లాల్‌ వ్యాఖ్యానం). 

అయితే తెల్లవారుజాము నాటికి, ఆ కలయిక కల ముగిసింది. జీవం పోసుకున్న వారు భాగీరథీ నదీ జలాల లోతుల్లోకి తిరిగి వెళ్లి పోయారు. పాండవుల ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అర్జునుడు సాగించిన యుద్ధానంతర ఉపఖండ దండయాత్ర సమయంలో మరొక సయోధ్య దృశ్యం మనకు కనిపిస్తుంది. సైంధవ భూభాగంలో (సింధ్‌లో) ఓడిపోయిన కౌరవుల సోదరి దుశ్శల, ఒక బిడ్డతో కలిసి అర్జునుడిని కలుస్తుంది. అర్జునుడు అన్యాయంగా చంపిన కౌరవ పక్ష యోధుడైన జయద్రథుడిని దుశ్శల వివాహం చేసుకుంది. 

అర్జునుడు ఆమె కొడుకు సురథుడి గురించి దుశ్శలను అడుగుతాడు. ‘అతను చనిపోయాడు,’ అని ఆమె చెబుతుంది, ‘అతను విరిగిన హృదయంతో మరణించాడు, ఎందుకంటే నీవు అతని తండ్రిని చంపావని సురధు నికి తెలుసు. నేను ఇప్పుడు సురథుడి కొడుకును నీ వద్దకు తీసుకు వస్తాను. నేను నీ రక్షణను కోరుతున్నాను’’ అంటుంది. అర్జునుడు దుశ్శలని అక్కున చేర్చుకుని తన రాజభవనానికి రావాలని ఆమెను కోరాడు. తర్వాత అర్జునుడు సైంధవులతో సంధి చేసుకున్నాడు.

మనం ఇప్పుడు ఒకటే ప్రశ్నించాలి. ఈరోజు భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికి ప్రయత్నించడం ముఖ్యమా? అని. గతం ముగిసిపోయింది. మనం దానిని మార్చలేం. జరిగిపోయిన దాన్ని పునరుద్ధరించలేము. అవును, మనం చరిత్ర నుండి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచా రాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పే పాఠాలలో ఒకటి.

- వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత
- రాజ్‌మోహన్‌ గాంధీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement