పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం | Ancestors favored party ... Mahalayam | Sakshi
Sakshi News home page

పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం

Published Mon, Sep 30 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం

పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం

భాద్రపదమాసంలోని బహుళపక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం. అందుకే దీనిని పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రవచనం. ఈ నెల 19, గురువారం నుంచి మొదలైన ఈ పితృపక్షం అక్టోబర్ 5న మహాలయ అమావాస్యతో ముగియనుంది.
 
ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతిముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా తర్పణలు చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకలశుభాలూ కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి శక్తి లేదా స్థోమత లేనివారు ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణునికి స్వయంపాకం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలిదప్పులు తీరి తమ వంశస్థులను సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు. మన పితరుల ఆత్మకు శాంతి కలిగినప్పుడే ఇహలోకంలో మనకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయనీ, వంశాభివృద్ధి కలుగుతుందని ప్రామాణిక శాస్త్రగ్రంథాలయిన ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి.
 
ఎంతో దానశీలుడిగా పేరుపొందిన కర్ణుడు కోరినవారికి కాదనకుండా ధన, కనక, వస్తు, వాహన రూపేణా భూరిదానాలు చేశాడు. అయితే అన్నిదానాలలోనూ మిన్న అయిన అన్నదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా మరణానంతరం ఆయన ఆత్మ ఆకలిదప్పులు తీరక ఆర్తితో అలమటించవలసి వచ్చింది. అప్పుడు దేవతలందరి అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పక్షం రోజులపాటు ఉండి, కురుక్షేత్ర సంగ్రామంలో అసువులు బాసిన తన జ్ఞాతులకు అంటే దాయాదులకు, సైనికులకు తదితరులందరికీ తర్పణలు వదిలి తన రాజ్యంలోని పేదసాదలకు, పెద్దఎత్తున అన్నసంతర్పణలు చేసి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ పక్షం రోజులకే మహాలయపక్షాలని పేరు. శాస్త్రరీత్యా ఈ పదిహేను రోజులూ ఎటువంటి శుభకార్యాలూ నిర్వర్తించకూడదు.
 
 మహాలయ త ర్పణలు ఎవరెవరికి?

 
 స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, (తల్లిదండ్రుల జననీ జనకులు) తల్లిదండ్రుల తోబుట్టువులకు,  గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టినవారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితునికి, అతని భార్యకు..... వీరిలో వారసులు లేకుండా మృతి చెందినవారికి ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా వివిధ ప్రమాదాలలో అకాల మరణం చెందిన వారికోసం కూడా తర్పణ విడిస్తే మంచిది.
 
 ఇలాంటి ఆచారవ్యవహారాల మీద విశ్వాసం ఉన్నప్పటికీ, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇంటిలో ఇటువంటివాటిని నిర్వహించడం వీలుపడనివారు శ్రీశైలం, తిరుమల, కాశీ, రామేశ్వరం తదితర నిత్యాన్నదాన సత్రాలలో శక్త్యనుసారం వీలైనంత మందికి భోజనాలు పెట్టేలా చందా లేదా విరాళాలు చెల్లిస్తే, మన పెద్దల పేరిట వారే భోజన సంతర్పణ ఏర్పాట్లు చేస్తారు.
 
 లౌకికంగా కూడా... అసలు ఈ తర్పణలు, తిలోదకాలు ... వంటి వైదికపరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేనివారు కూడా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా చనిపోయిన తల్లిదండ్రులను లేదా తాతముత్తాతలను తలచుకుని, మనం ఏ అన్నాన్నయితే తింటున్నామో, దానినే... అర్హులయిన పేదలను ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెడితే... వారికి కడుపు, మనకు గుండె నిండుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నవారైనా, వస్త్రదానం, ధనదానం తదితర ఏ రకమైన దానాలు చేసినప్పటికీ, ఆయా దానాలు పుచ్చుకునేవారు మాత్రం మొహమాటానికి చాలని చెప్పినా, మనసులో మాత్రం ‘వీరికి అంత ఉంది కదా, మరికొంచెం ఇస్తే బాగుండును’ అనిపిస్తుంది. అదే అన్నదానంతో మాత్రం కడుపు నిండా తిన్న తరువాత తృప్తి పడి ‘ఇక చాలు’ అని అనాల్సిందే. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే మిన్న అని శాస్త్రం చెప్పింది. ఈ పక్షంలో మిగిలిన కొద్దికాలాన్నైనా ఈ రీతిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
 - డి.వి.ఆర్.
 
  మీకు తెలుసా!

 
 ఎల్ల అంటే గుర్తు లేదా గ్రామ సరిహద్దు అని అర్థం. ఎల్లలలో అంటే గ్రామ సరిహద్దులలో ఉండి ఊరినంతటినీ కాపాడే జగదాంబ స్వరూపమే ఎల్లమ్మ. పోలేరమ్మ అంటే పొలాలకు అమ్మ. పొలాలమ్మ అనే మాటే పోలేరమ్మగా పరిణమించింది. ఆమె పొలాలను కాపాడే చల్లని తల్లి అన్నమాట. మావూళ్లమ్మ అంటే ఊరిని కాపాడే తల్లి అని అర్థం. మా ఊరి అమ్మ అనే దాని నుంచే మావూళ్లమ్మ అనే నామం ఏర్పడింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement