
‘లివింగ్ టెంపుల్(Living Temple)’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం.
గుడి అనగానే గుర్తొచ్చేది దేవుడు, మొక్కులు, టెంకాయలు! కానీ గుడి అంటే సకల కళా నిలయం! జీవనశైలిని ఈస్తటిక్ లెన్స్‌లో చూపించే కాన్వాస్! నాడు వాస్తు, శిల్పం, చిత్రం, సంగీతం, నృత్యం అన్నిటికీ గుడే వేదిక.. వాటిని నేర్పే బడి కూడా! దాని ఆవరణలోని కొలను ఆధారంగా సాగూ సాగేది! అంటే సంస్కృతిని సంరక్షించే ఆలయంగానే కాదు సంపద పెంచే వనరుగానూ భాసిల్లింది!
మారిన కాలంలో గుడికి ప్రాముఖ్యం తగ్గకపోయినా దాన్ని చూసే మన ఈస్తటిక్ లెన్సే మసకబారాయి! అయినా టెంపుల్ ఆర్ట్ (Temple Art) స్ఫూర్తితో ఆ ఘనమైన సాంస్కృతిక చరిత్రను పరిరక్షిస్తున్న కళాకారులు ఉన్నారు! దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అలాంటి 31 మంది కళాకారులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వాళ్ల కళారూపాలతో ‘లివింగ్ టెంపుల్’ పేరుతో మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు క్యురేటర్ మడిపడిగ అన్నపూర్ణ! ఎప్పుడు... ఫిబ్రవరి 28 నుంచి మార్చి రెండు వరకు! ఎక్కడ... టీ వర్క్స్, హైదరాబాద్!
అసలీ అన్నపూర్ణ ఎవరు?
హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగిన అన్నపూర్ణ విజువల్ ఆర్ట్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమెకు స్ఫూర్తి.. తొలి గురువు తండ్రి రోహిణీ కుమార్. ఆయన వృత్తిరీత్యా పెయింటరే అయినప్పటికీ సొంతంగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించి దాన్నే వృత్తిగా చేసుకున్నారు. దాంతో ఉగ్గుపాల నాడే అన్నపూర్ణకు టెంపుల్ ఆర్ట్‌ను పరిచయం చేశారు. కూతురు పెరుగుతున్న కొద్దీ ఆ కళ విశిష్టతను వివరిస్తూ వచ్చారు. కళలను, మనిషి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వేదికగా గుడిని చూపించారు. ప్రతి ఆరునెలలకు ఒక పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి టెంపుల్ ఆర్ట్, జీవనశైలి మీదప్రాక్టికల్ జ్ఞానాన్నందించేవారు.
ఒక్కమాటలో కూతురికి ఈస్తటిక్ లెన్స్‌లో ప్రపంచాన్ని పరిచయం చేశారని చెప్పాచ్చు. ఆ ఆసక్తితోనే అన్నపూర్ణ ఆర్ట్స్‌లో చేరారు. అయితే అకడమిక్స్‌లో నాన్న చెప్పినంత ఘనమైన స్థానం కనిపించలేదు మన ఆర్ట్, కల్చర్‌కి. పాశ్చాత్య కళానైపుణ్యంతోనే నిండిపోయి ఉంది సిలబస్ అంతా! మన కళల పట్ల నిర్లక్ష్యమో.. పెద్దగా పరిగణించకపోవడమో.. లేదంటే బ్రిటిష్ వాళ్లు నిర్ధారించిన అకడమిక్స్ అయ్యుండటమో.. కారణమేదైనా మన కళాసంస్కృతి గొప్పదనమైతే తెలియకుండా పోయింది. కాలగమనంలో చాలా గుళ్ల స్వరూప స్వభావాలూ మారిపోయాయి.
వాస్తు శిల్ప చిత్రలేఖన సంపద మిగిలి ఉన్న గుళ్లల్లో సంగీతం, నాట్య కళల ఊసు లేదు. భవిష్యత్ తరాలకు అందాల్సిన ఆ సాంస్కృతిక వారసత్వ సంపద చెల్లాచెదురైంది. దాన్ని కాపాడాలి.. పరిరక్షించాలనే తపన పట్టుకుంది అన్నపూర్ణకు. చదువైపోయాక క్యురేటర్‌గా చేరినా.. ఆర్ట్ షోలు నిర్వహిస్తున్నా.. చిత్తమంతా టెంపుల్ ఆర్ట్ మీదే! ఆర్ట్ షోలు చేస్తున్న క్రమంలోనే దేశంలోని పలుప్రాంతాల్లో.. వాళ్ల వాళ్ల శైలిలో టెంపుల్ ఆర్ట్‌ను సాధన చేస్తున్న కళాకారులున్నారని తెలిసింది అన్నపూర్ణకు. అప్పుడు వచ్చింది ఆమెకు ‘లివింగ్ టెంపుల్’ ఆలోచన!
రెండేళ్ల శ్రమ
ఆ ఆలోచన వచ్చిన నాటి నుంచి టెంపుల్ ఆర్ట్ మీద పరిశోధన మొదలుపెట్టారు అన్నపూర్ణ. భారతదేశమంతా పర్యటించారు. శిథిలావస్థలోని గుళ్ల వాస్తుశిల్పాన్ని పునర్‌నిర్మిస్తున్న ఆర్కిటెక్ట్స్, విరిగిపోయిన విగ్రహాలను టెక్నాలజీ సహాయంతో తిరిగి చెక్కుతున్న.. రూపాలు చెదిరిన శిల్పాలను సాంకేతిక సహాయంతో తీర్చిదిద్దుతున్న శిల్పకారులు, చెదిరిపోయిన పెయింటింగ్స్ కు రంగులద్దుతూ పునరుద్ధరిస్తున్న చిత్రకారులు, గుళ్లల్లో పుట్టిన గాన.. నాట్య కళలను ఇంకా పోషిస్తున్న కళాకారుల కళారూపాలను చూశారు. వాళ్లలో విదేశీ కళాకారులూ ఉన్నారు. అందరూ సుప్రసిద్ధులే! అలాంటి 31 మంది కళాకారులను సంప్రదించారామె.
వాళ్లకు తన ‘లివింగ్ టెంపుల్’ కాన్సెప్ట్‌ను వివరించారు. సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ ఉత్సవానికి హైదరాబాద్‌నే వేదికగా చేయాలనుకున్నారు. టీ వర్క్స్‌ప్రాంగణాన్నివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు అన్నపూర్ణ ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ఏదో అనుకున్నామా.. చేశామా అన్నట్టు కాకుండా ఈ వేడుక ఒక స్ఫూర్తిని, ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు అన్నపూర్ణ. కళాకారులు, ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కలిసి టెంపుల్ ఆర్ట్ పరిరక్షణకు అడుగులు వేయాలి, ఆ సాంస్కృతిక వారసత్వ సంపదను మన భావితరాలకు అందించాలి.. ఫైన్ ఆర్ట్స్ సిలబస్‌లో మన కళలకూ సముచిత స్థానం ఉండాలన్నదే దాని ఉద్దేశం. ఆశయం! అందుకే ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలనుకుంటున్నారు.
చదవండి: రెక్కల గుర్రంపై.. విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలు
ఈ యజ్ఞం గురించి తెలుసుకున్న తమిళనాడు (Tamil Nadu).. వచ్చే ఏడాది తను ఆతిథ్యమివ్వడానికి ఉత్సాహపడింది. ‘లివింగ్ టెంపుల్’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. ఇంకో విషయం.. టెంపుల్ అనగానే ఇదొక మతానికి సంబంధించిన సెలబ్రేషన్‌గా అనుకోవద్దు. ఇది మన దేశ సంస్కృతికి సంబంధించినది. మన ఆలయాలు పరిరక్షించిన పర్యావరణానికి సంబంధించినది. దాన్ని మళ్లీ పునరుద్ధరించడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశం’ అంటారు అన్నపూర్ణ. ఆమె పనిని ఫుల్ హార్ట్‌తో స్వాగతిద్దామా!
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment