మంచిమాట
మన పూర్వులు పిల్లలకి జీవితం మీద ఆశని కలిగించి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా సానుకూల దృక్పథం పెం΄÷ందే విధంగా మనసులని మలచేవారు. అందుకే ఒకప్పుడు ఆత్మహత్యల వంటివి అంతగా కనపడేవి కావు. ఎక్కడో ఒకటి జరిగితే అదేదో వింత అన్నట్టు అందరూ కంగారు పడేవారు. ఇప్పుడు అవి అతి సామాన్యమై ΄ోయాయి. అది చాలా మామూలు విషయంగా పరిగణించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. ప్రతిస్పందించే సున్నితత్వాన్ని కూడా కోల్పోయాం.
‘‘బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు’’ అన్నది భారతీయుల విశ్వాసం. ఇటువంటి భావాలని అతి సామాన్యమైన మాటలలో అందరి మనస్సులలో నాటుకునేట్టు చేశారు. బ్రతుకుని అంతం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా వాతావరణాన్ని ఉంచేవారు. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చావో రేవో అన్నంత తీవ్రంగా తీసుకునే వారు కాదు. ‘‘కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా?’’ అని తేలిక చేసేవారు, మనం అందరం మనుషులం అని గుర్తు చేస్తూ.
ఈనాడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది చిన్నతనంలో కడుపునిండా తిండి కూడా లేనివారు అని వారి జీవితచరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ‘‘బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అని చెప్పి సాంత్వన కలిగించే వారు. పైగా, ఆ రోజుల్లో అనుకున్నది సాధించక ΄ోవటం, పరాజయాల పాలు కావటం జరిగి, తాత్కాలికంగా నిరాశ కలిగినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో లేదా కసితో అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నం చేసేవారు. తాము విఫలం కావటానికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకునేవారు. ఇది కార్యసాధకుల లక్షణం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపూ కాదు.
ఈ ఆలోచనా విధానం నేటి యువతరంలోను, మధ్యవయస్కులలోనూ మృగ్యం అయింది. తక్షణం అనుకున్న ఫలితం రావాలి, తన ప్రయత్నంతో సంబంధం లేకుండా. అపజయాన్ని, ఓటమిని అసలు ఎదుర్కో లేరు. కొంచెం కూడా ఆగలేరు. నిర్ధారణ చేసుకునే ఓపిక కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో ΄÷రపాటు పడే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉంటాం. మొదటి వంద స్థానాల్లో ఉండవలసిన అభ్యర్థి ఉత్తీర్ణుడు కాలేదని ప్రకటన రాగానే తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న మరునాడు ఆ ప్రకటన తప్పు అని సరి చేసుకోటం తెలుసు కదా! మనసుని ఆ మాత్రం అదుపులో ఉంచలేక ΄ోవటం వల్ల వచ్చిన ప్రమాదం అది.
ప్రాణాలు అర్పించి సాధించారు, బలిదానం చేశారు అంటూ ΄÷గిడితే వారికి ఒరిగేది ఏముంది? మిగిలిన వారు అనుభవించ వచ్చు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. సమయం పట్టవచ్చు.
మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఏమంటే, ప్రాణత్యాగం చేయదల్చుకున్న వారిని ఒక్క క్షణం ఆపగలిగితే చాలు నట. క్షణికావేశం చల్లారుతుంది అంటారు. ఆ పనిని ఎవరు చేయగలరు? అసలు ఎవరికైనా తెలియాలి కదా! అందుకే ఎవరికి వారే తమను తాము సముదాయించుకుని, పరిస్థితులతో ΄ోరాడి గెలవాలి. కలిగిన మేలు అనుభవించటానికి బ్రతికి ఉండాలి కదా!
ఈ బతుకుని అంతం చేసుకోవాలనే భావన ఎవరికీ రాదా? సీతమ్మకి, హనుమకి, రామచంద్రమూర్తికి, దుర్యోధనుడి వంటి వారికే వచ్చింది. కాని విచక్షణ వారిని ఆపని చేయకుండా కాపాడింది. సీతమ్మ కనపడలేదని హనుమ ఏ విధంగా శరీరం వదలాలి అని ఆలోచిస్తూ సీతారామలక్ష్మణులకి, సుగ్రీవాదులకి నమస్కారం చేయగానే అశోకవనం కనపడింది. దైవాన్ని, పెద్దలని స్మరిస్తే మార్గం కనపడుతుంది. సీత కూడా జుట్టుతో చెట్టు కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా త్రిజట మాటలు, హనుమ దర్శనం కలిగాయి. తొందర పడితే? రాముడు కూడా సీత లేకుండా ఉండలేనని అనుకుని, అరణ్యవాసం చేయలేదనే చెడ్డపేరు వస్తుందని ఆగాడు. ఆవేశ పడకుండా కొద్దిగా ఆలోచిస్తే మంచి జరిగి తీరుతుంది.
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment