భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది.
‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది.
ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు.
తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు.
దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment