'నాపై చర్య తీసుకునే దమ్ము ఎవరికీ లేదు'
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్నసిన్హా మరోసారి పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ పెద్దలు తనను పక్కన బెట్టడంపై ఆయన ఇంకా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. తనపై, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పార్టీ ఎంపీ ఆర్కే సింగ్పై చర్యలు తీసుకునే అధికారం బీజేపీలో ఎవరికి లేదంటూ శత్రుఘ్నసిన్హా మండిపడ్డారు. పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహించాలన్న అగ్రనేతల నిర్ణయాన్ని ఆయన మరోసారి తోసిపుచ్చారు. బిహార్ ఎన్నికల ఓటమికి బాధ్యులైనవారే అందుకు గల కారణాలు వెల్లడించాలని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.
బిహారీ 'సింహం' ఆర్కే సింగ్ చెసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. మా ఇద్దరిపై చర్యలు తీసుకోవడం, మందలించే అధికారం, ధైర్యం పార్టీకి చెందిన నేతల ఎవరి డీఎన్ఏలోనూ లేదంటూ విరుచుకుపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్స్కు పార్టీ టిక్కెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారన్న కారణంగా బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్లాల్ పార్టీ ఎంపీ శత్రుఘ్నసిన్హాకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. స్థానిక నేతలను పక్కనపెట్టి, స్థానికేతరులతో ప్రచారం చేయించినందునే బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన విషయం అందరికీ విదితమే.