డీఎన్‌ఏ శోధనకు నోబెల్
స్వీడన్, అమెరికా, టర్కిష్ అమెరికన్ శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్ర బహుమతి
స్టాక్‌హోమ్: దెబ్బతిన్న డీఎన్‌ఏను మానవ శరీరం స్వయంగా ఎలా మరమ్మతు చేసుకుంటుందనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. స్వీడన్‌కు చెందిన థామస్ లిండాహ్, అమెరికాకు చెందిన పాల్ మాడ్రిక్, టర్కిష్ అమెరికన్ అజీజ్ సంకార్‌లకు సంయుక్తంగా నోబెల్ అందజేయనున్నట్లు రాయల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ బుధవారం తెలిపింది. జీవకణాల పనితీరు ఏ విధంగా ఉంటుందనేది వీరి పరిశోధనతో వెల్లడైందని పేర్కొంది. వారసత్వంగా జన్యులోపాల వల్ల వచ్చే ఎన్నో రకాల వ్యాధులకు చికిత్సను, ఔషధాలను రూపొందించడానికి అది తోడ్పడిందని పేర్కొంది.
సాధారణంగా శరీరంలో కణ విభజన జరిగినప్పుడు, తీవ్రమైన సూర్యరశ్మి వంటి బాహ్యకారణాలతో కణాల్లోని డీఎన్‌ఏ దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న డీఎన్‌ఏను కణాల్లో ఉండే కొన్ని ప్రొటీన్లు మరమ్మతు చేస్తాయి. తద్వారా ఆ జీవకణం తిరిగి ఆరోగ్యవంతం అవుతుంది. ఈ డీఎన్‌ఏ మరమ్మతు ప్రక్రియను లిండాహ్, పాల్ మాడ్రిక్, అజీజ్ గుర్తించారు. టర్కీలోని సావర్‌లో జన్మించి అమెరికాకు వలస వెళ్లిన లిండాహ్.. అల్ట్రా వయోలెట్ రేడియేషన్ ద్వారా డీఎన్‌ఏ మరమ్మతు ప్రక్రియను గుర్తించారు. మాడ్రిక్ ఆ సంక్లిష్లమైన విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ విజేతలు ముగ్గురికీ కలిపి దాదాపు రూ. 6.17 కోట్లు బహుమతిగా అందజేస్తారు. ఇక నోబెల్ పురస్కారాల్లో భాగంగా గురువారం సాహిత్యం విభాగంలో, శుక్రవారం శాంతి విభాగంలో, సోమవారం ఆర్థిక విభాగంలో బహుమతులను ప్రకటించనున్నారు.
మరమ్మతు మెకానిక్‌లు
మీరెంత పొడవు పెరగాలో... మీకు ఏఏ వ్యాధులు వచ్చే అవకాశముందో.. అన్నీ మీరు పుట్టకముందే నిర్ణయమైపోతాయి! మీ శరీరంలోని ప్రతి కణంలోని డీఎన్‌ఏలో ఈ సమాచారం ఉంటుంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ డీఎన్‌ఏలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సూర్యుడి అతినీలలోహిత కిరణాలతోపాటు ధూమపానం, పలు రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల డీఎన్‌ఏలో వచ్చే మార్పుల ఫలితంగా వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. అదృష్టవశాత్తూ మన శరీరంలోని కొన్ని ఎంజైమ్‌లు, ప్రొటీన్లు ఈ మార్పులపై నిత్యం ఓ కన్నేసి ఉంటాయి. అంతేకాదు వాటిని మరమ్మతు చేస్తూంటాయి కూడా. ఇదెలా జరుగుతుందో గుర్తించిన శాస్త్రవేత్తలు థామస్ లిండాల్, పాల్ మాడ్రిక్, అజీజ్ సంకార్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది.
- సాక్షి, హైదరాబాద్
►46 ప్రతీ కణంలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య
►డీఎన్‌ఏ రసాయనిక నిర్మాణంలో ఒక్కో బ్లాకును ఏ, సీ, టీ, జీలుగా వ్యవహరిస్తారు
►23 తల్లిదండ్రుల్లో ఒక్కొక్కరి నుంచి వచ్చే క్రోమోజోమ్‌ల సంఖ్య
►మొత్తం 300 కోట్ల బ్లాకులతో మానవుని జీనోమ్ నిర్మితమై ఉంటుంది
►{పతి క్రోమోజోమ్‌లోనూ దాదాపు రెండు మీటర్ల పొడవున్న డీఎన్‌ఏ ఉండచుట్టుకుని ఉంటుంది.
►అడినైన్ (ఏ) థమమీన్ (టీ), గ్వానైన్ (జీ), సైటోసైన్ (సీ) అనే నాలుగు రసాయనాలతో డీఎన్‌ఏ ఏర్పడుతుంది. డీఎన్‌ఏ ఆకారం మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటుంది. దీంట్లోని మెట్లలో ఇరువైపులా రెండు రసాయనాలు ఉంటాయి.
► గ్వానైన్ - సైటోసైన్, అడినైన్ -థయమీన్‌లు డీఎన్‌ఏ పొడవునా వరుసగా ఉంటాయి. ఒక్కోదాన్ని ఒక బేస్‌పెయిర్ అంటారు.
లిండాల్ పరిశోధన
►కణ విభజన సమయంలో డీఎన్‌ఏ రెండు పోగులుగా విడిపోతుంది. సరిగ్గా మ్యాచింగ్‌తో కలసిపోయి కొత్త కణంలో పూర్తిస్థాయి డీఎన్‌ఏ ఏర్పడుతుంది.
►ఈ క్రమంలో ఒక్కోసారి డీఎన్‌ఏలోని సైటోసైన్‌లో కొన్ని మార్పులు వచ్చి యురాసిల్ అనే కొత్త రసాయనం ఏర్పడుతుంది.
►గ్లైకోసైలేస్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ ఈ తేడాను గుర్తించి యురాసిల్‌ను కత్తిరిస్తుంది. అదేసమయంలో మరికొన్ని ఎంజైమ్‌లు యురాసిల్ స్థానంలో నిరపాయకరమైన కొన్ని ఇతర రసాయనాలను చేరుస్తాయి.
అజీజ్ సంకార్ గుర్తించింది ఇదీ...
సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, సిగరెట్ పొగలోని కేన్సర్ కారకాల వల్ల డీఎన్‌ఏలో వచ్చే మార్పులు వాటంతట అవే ఎలా మరమ్మతు అవుతాయో అజీజ్ సంకార్ గుర్తించారు.
► అతినీల లోహిత కిరణాలు డీఎన్‌ఏ పోగులోని రెండు థయమీన్ అణువుల మధ్య రసాయన బంధం ఏర్పడేలా చేస్తాయి.
► ఎక్సిన్యూక్లియేస్ అనే ఎంజైమ్ ఈ మార్పును గుర్తిస్తుంది. వెంటనే డీఎన్‌ఏ పోగును కత్తిరించి, 12 న్యూక్లియోటైడ్‌లను తొలగిస్తుంది.
► ఫలితంగా ఏర్పడ్డ ఖాళీని డీఎన్‌ఏ పాలిమరేస్ అనే పదార్థం పూరిస్తుంది. ఆ వెంటనే డీఎన్‌ఏ లిగేస్ అనే రసాయనం పాలిమరేస్‌లోని థయమీన్‌ను, దిగువభాగంలోని అడినైన్‌లను కలిపేస్తుంది. దీంతో మరమ్మతు పూర్తవుతుంది.
పాల్ మాడ్రిక్ ఏం చేశారు...
► కణం రెండుగా విభజితమైనప్పుడు కొన్నిసార్లు సహజసిద్ధంగానే వాటిల్లోని బేస్‌పెయిర్లలో తేడాలు నమోదవుతూంటాయి. అంటే అడినైన్ థయమీన్‌తో కాకుండా మరో రసాయనంతో జతకడుతుందన్నమాట.
► ఈ తేడాలను మ్యూట్ ఎస్, మ్యూట్ ఎల్ అనే ఎంజైమ్‌లు గుర్తిస్తాయి.
►ఇంకో ఎంజైమ్ సరైన బేస్‌పెయిర్‌ను గుర్తించి మోసుకొస్తే... మ్యూట్ ఎస్ తేడాగా ఉన్న బేస్‌పెయిర్‌ను కత్తిరిస్తుంది.
► డీఎన్‌ఏ పాలిమరేస్, డీఎన్‌ఏ లిగేస్‌ల సాయంతో తేడాల్లేని డీఎన్‌ఏ పోగు, వాటిమధ్య రసాయన బంధం ఏర్పడుతుంది.