Nobel award
-
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్‌కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్‌కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్‌కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్‌కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా! -
Amartya Sen: ‘జుక్తోసాధన’ భారత సంప్రదాయం
కోల్‌కతా: మతాలకతీతంగా హిందువులు, ముస్లింలు కలిసి జీవించడం, పనిచేసుకోవడం భారత సంప్రదాయమని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. అలీపూర్ జైలు మ్యూజియంలో జరిగిన పుస్తక పఠన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశ చరిత్రను చూస్తే.. కొన్ని యుగాలుగా హిందువులు, ముస్లింలు మతసామరస్యంతో కలిసిమెలసి జీవిస్తున్నారు. క్షితిమోహన్ సేన్ దీనిని ‘జుక్తోసాధన’ అన్నారు. ఒకమతం వారు ఇంకో మతంపై విద్వేషాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత కాలంలో ఈ సిద్ధాంతంపై మనం దృష్టి పెట్టాల్సి ఉంది. పిల్లలు ఇలాంటి విషపూరిత భావజాల బారిన పడకపోవడం వల్లే వారు ఎలాంటి భేదభావాలు లేకుండా బతుకుతున్నారు. సమాజంలో పరమత సహనం విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. ‘జుక్తోసాధన’ సామాజిక సేవ, కళల్లో వ్యక్తమవుతోంది’’ అని ఆయన అన్నారు. ఉపనిషత్తులను పార్శీలోకి అనువదించిన ముంతాజ్ కుమారుడు దారా షికోను ప్రస్తావిస్తూ దేశంలోని బహుళ సంస్కృతిని గుర్తు చేశారు. -
ఏడాది ప్రాయంలోనే అద్భుత గ్రాహకశక్తి
అనకాపల్లి: ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన గాలి దృశ్యంత్‌కుమార్ బుడి బుడి అడుగుల నాడే అద్భుతమైన గ్రాహక శక్తితో నోబెల్ ప్రపంచ రికార్డు సాధించి అందరిని అబ్బుర పరిచాడు. తమిళనాడుకు చెందిన నోబెల్ వరల్డ్ రికార్‌ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తండ్రి గాలి నాగేశ్వరరావు ఇక్కడ బుధవారం విలేకరులకు తెలిపారు. నాగేశ్వరరావు, శ్రీదేవి దంపతుల కుమారుడైన దృశ్యంత్ కుమార్ పుట్టినప్పటి నుంచి చురుగ్గా ఉండడమే కాకుండా అపరిమితమైన గ్రాహక శక్తి ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. పది నెలల వయస్సు నుంచి కుమార్‌కు అనేక రకాల వస్తువులు, ఫొటోలు, వివిధ దేశాల జెండాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దృశ్యంత్ ఏడాది వయసులోనే 300 రకాల ఫొటోలను గుర్తించడమే కాకుండా వస్తువులు, పూలు, పండ్లు, కూరగాయలను సునాయాసంగా గుర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుని గ్రాహక శక్తిని వీడియో ద్వారా రికార్డు చేసి తమిళనాడులో ఉన్న నోబుల్ వరల్డ్ రికార్‌ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ఇటీవల పంపించారు. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఉగ్గినపాలెం వచ్చి పరిశీలించిన మీదట నోబెల్ వరల్డ్ రికార్డులో నమోదు చేసి పురస్కారాన్ని ప్రకటించారు. సర్టిఫికెట్, పతకాన్ని అందిస్తూ పోస్టు ద్వారా ఇక్కడకు పంపారు. దీంతో పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఎంపీ డాక్టర్ సత్యవతి అభినందన చిన్నతనంలోనే అద్భుతాలు చేస్తున్న దృశ్యంత్కుమార్కు అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తన కార్యాలయంలో బుధవారం జ్ఞాపికను అందజేసి సత్కరించి కొద్దిసేపు ముచ్చటించి అభినందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కూడా సత్కరించారు. ఈ చిన్నారి మరిన్ని అద్బుతాలు సాధించి అందరికి ఆదర్శంగా నిలవగలడని ఆకాంక్షించారు. డాక్టర్ కె. విష్ణుమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. క్వాంటం చుక్కల ఆవిష్కరణ, సంశ్లేషణకు గాను మౌంగి జి. బావెండి, లూయిస్ ఇ. బ్రస్, అలెక్సీ ఐ. ఎకిమోవ్‌లకు నోబెల్ ప్రైజ్ బహుకరించింది. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Chemistry to Moungi G. Bawendi, Louis E. Brus and Alexei I. Ekimov “for the discovery and synthesis of quantum dots.” pic.twitter.com/qJCXc72Dj8 — The Nobel Prize (@NobelPrize) October 4, 2023 క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష్మమైన నానోపార్టికల్స్. నానోటెక్నాలజీలో ఈ క్వాంటమ్ డాట్స్‌ను ప్రస్తుతం టెలివిజన్లు, ఎల్ఈడీ దీపాలతో పాటు అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా ఇవి కణితి కణజాలాన్ని తొలగించినప్పుడు సర్జన్లకు కూడా ఇవి మార్గనిర్దేశం చేయగలవు. Today quantum dots are an important part of nanotechnology’s toolbox. The 2023 #NobelPrize laureates in chemistry have all been pioneers in the exploration of the nanoworld. pic.twitter.com/Yjj3FqpM2X — The Nobel Prize (@NobelPrize) October 4, 2023 విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. నిన్న భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా నేడు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: 2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్ -
Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో
సాక్షి, హైదరాబాద్: మానవ జాతి పుట్టిందెలా? వానరాల నుంచి అని చెప్పడం సులువే కానీ.. మానవులను పోలిన వానరాలూ బోలెడన్ని ఉండగా పరిణామ క్రమంలో కొన్ని నశించిపోయాయి. కొన్ని అవసరాలకు తగ్గట్టుగా పరిణామం చెందుతూ నేటి ఆధునిక మానవుడు ‘హోమో సేపియన్’గా ఎదిగాయి. ఈ అద్భుత పరిణామ క్రమంలో కీలకమైన ఘట్టాలను పరిశోధించి మరీ ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఎప్పుడో అంతరించిపోయిన హోమోసేపియన్ దూరపు చుట్టం ‘నియాండెర్తల్’ జాతి జన్యుక్రమాన్ని నమోదు చేయడంతోపాటు ఇప్పటివరకూ అస్సలు గుర్తించని మరో బంధువు డెనిసోవన్ జాతిని గుర్తించినందుకు ఈ బహుమతి లభించింది. సుమారు 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైన హోమో సేపియన్ల ప్రస్థానంలో పరిణామంలో నియాండెర్తల్, డెనిసోవన్ జాతుల జన్యువులూ చేరాయని, ఈ చేరిక ప్రభావం మనపై ఈ నాటికీ ఉందని పాబో గుర్తించారు. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల కారణంగా వచ్చే జబ్బులకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు మనలో చేరిన నియాండెర్తల్, డెనిసోవన్ జాతి జన్యువులపై ఆధారపడి ఉందని పాబో పరిశోధనలు చెబుతున్నాయి. ప్రత్యేక శాస్త్ర విభాగం మానవ పరిణామంపై జరుగుతున్న పరిశోధనల్లో పాబో సరికొత్త శకానికి, విభాగానికి దారి వేశానడంలో ఎలాంటి సందేహమూ లేదు. నియాండెర్తల్, డెనిసోవన్ జాతులపై పాబో చేసిన పరిశోధనల కారణంగా ఇప్పుడు ‘పాలియో జినోమిక్స్’ అనే కొత్త శాస్త్ర విభాగం ఒకటి ఉనికిలోకి వచ్చింది. హోమో సేపియన్లను, మానవుల్లాంటి ఇతర జాతులను (హోమినిన్లు) వేరు చేసే జన్యువులను గుర్తించడం ఈ శాస్త్రం ఉద్దేశం. హోమో సేసియన్లలోని ప్రత్యేక లక్షణాలను గుర్తించడం అన్నమాట. అంతరించిపోయిన హోమినిన్ జాతి హోమో సేపియన్లు ఎప్పుడో మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పరిణమించారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నియాండెర్తల్ జాతి ఆఫ్రికాకు అవతల... స్పష్టంగా చెప్పాలంటే యూరప్, పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన వారు. నాలుగు లక్షల ఏళ్ల క్రితం నుంచి ముప్ఫై వేల ఏళ్ల క్రితం వరకూ వీరి మనుగడ కొనసాగింది. ఆ తరువాత ఈ హోమినిన్ జాతి అంతరించిపోయింది. కానీ, 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మధ్యాసియా ప్రాంతానికి వలస వెళ్లిన హోమో సేపియన్లు నియాండెర్తల్ జాతితో కలిశారని పాబో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాతి కాలంలో హోమో సేపియన్లు క్రమేపీ ప్రపంచమంతా విస్తరించారన్నమాట. ఇరు జాతులు యురేసియా ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కలిసి జీవించాయని అంచనా. అయితే ఈ నియాండెర్తల్స్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 1990 చివరి నాటికి మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కాగా.. హోమినిన్లతో మనకున్న సంబంధాలను వెతకడం మాత్రం మొదలు కాలేదు. నియాండెర్తల్స్ వంటి హోమినిన్ల జన్యుక్రమం ఏదీ అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాబో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నియాండెర్తల్స్ డీఎన్ఏను అధ్యయనం చేసేందుకు స్వాంటే పాబో ప్రయత్నించారు. వేల ఏళ్ల క్రితం నాటి.. అంతరించి పోయిన జాతి డీఎన్ఏ దొరకడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాలక్రమంలో ఎంతో డీఎన్ఏ నాశనమైపోయి లేశమాత్రమే మిగిలి ఉంటుంది. పైగా బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పరిణామ జీవశాస్త్ర నిపుణులు అలన్ విల్సన్ వద్ద స్వాంటే పాబో పోస్ట్ డాక్టరల్ విద్యార్థిగా నియాండెర్తల్ డీఎన్ఏ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. 1990లో జర్మనీలో మ్యూనిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పురాతన డీఎన్ఏపై పరిశోధనలను కొనసాగించిన పాబో నియాండెర్తల్‌ల మైటోకాండ్రియా నుంచి డీఎన్ఏను సేకరించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. క్రోమోజోముల్లోని డీఎన్ఏతో పోలిస్తే ఈ మైటోకాండ్రియల్ డీఎన్ఏ కాపీలు వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి విశ్లేషణ విజయవంతమవుతుందని పాబో అంచనా. సుమారు 40 వేల ఏళ్ల క్రితం నాటి నియాండెర్తల్ ఎముక ముక్క నుంచి తొలిసారి ఈయన మైటోకాండ్రియల్ డీఎన్ఏను వేరు చేయగలిగారు. ఈ జన్యుక్రమంతో మానవులు, చింపాంజీల జన్యుక్రమాన్ని పోల్చి చూడటం సాధ్యమైంది. కణ కేంద్రక డీఎన్ఏను విశ్లేషించి నమోదు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీల సాయంతో దాదాపు అసాధ్యమనుకున్న నియాండెర్తల్ జన్యుక్రమ నమోదును 2010లో పూర్తి చేశారు. ఈ జన్యుక్రమాన్ని హోమో సేపియన్ల జన్యుక్రమంతో పోల్చి చూసినప్పుడు ఇరుజాతుల ఉమ్మడి పూర్వ జాతి భూమ్మీద సుమారు ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రాంతాల్లోని హోమోసేపియన్ల జన్యుక్రమాలను పోల్చి చూడటం ద్వారా మనకున్న ప్రత్యేకతలు తెలిశాయి. యూరోపియన్, ఆసియాకు చెందిన హోమోసేపియన్లలో 1–4 శాతం జన్యుక్రమం నియాండెర్తల్స్‌దని తెలిసింది. సరికొత్త హోమినిన్ గుర్తింపు స్వాంటే పాబో పరిశోధనల్లో అత్యంత కీలకమైంది.. డెనిసోవన్ అనే సరికొత్త హోమినిన్ జాతి గుర్తింపు. సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40 వేల ఏళ్ల క్రితం నాటి చేతి వేలి ఎముక ఆధారంగా ఇది జరిగింది. మంచులో కప్పబడి ఉండటం వల్ల ఈ ఎముకలోని డీఎన్ఏకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ డీఎన్ఏ జన్యుక్రమాన్ని నమోదు చేసి నియాండెర్తల్స్, హోమోసేపియన్లతో పోల్చి చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సరికొత్త జీవజాతికి డెనిసోవ అని పేరు పెట్టారు. తదుపరి పరిశోధనల్లో డెనిసోవన్, హోమోసేపియన్ల మధ్య జన్యువుల ఆదాన ప్రదానాలు జరిగినట్లు తెలిసింది. హోమో సేపియన్లు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చే సమయానికి యూరప్ పశ్చిమ ప్రాంతంలో నియాండెర్తల్స్, తూర్పు ప్రాంతంలో డెనిసోవన్లు ఉండేవారని స్పష్టమైంది. హోమోసేపియన్లు విస్తరిస్తున్న కొద్దీ ఈ రెండు జాతులతో కలవడం కూడా ఎక్కువైంది. పరిణామక్రమంపై పరిశోధనలకు నోబెల్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్య శాస్త్ర నోబెల్ స్టాక్‌హోమ్: వైద్య శాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మానవ పరిణామ క్రమంలో ఆయన సాగించిన విశిష్టమైన పరిశోధనలు ఆదిమ మానవుల (హోమినిన్స్) కంటే ఆధునిక మానవులు ఏ విధంగా భిన్నమో తెలియజేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గురించి కీలక విషయాలను బహిర్గతం చేస్తాయని వెల్లడించింది. నియాండెర్తల్స్, డెనిసోవన్స్ వంటి హోమినిన్స్ జన్యువును, ఆధునిక మానవుడి జన్యువును సరిపోల్చి చూసి, రెండింటి మధ్య తేడాలను వివరించే నూతన సాంకేతికతను స్వాంటే పాబో అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. స్వాంటే పాబో తండ్రి సూనే బెర్గ్స్ట్రామ్ 1982లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో, మ్యాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతను మంగళవారం, రసాయన శాస్త్రంలో విజేతను బుధవారం, సాహిత్యంలో విజేతను గురువారం, శాంతి బహుమతి విజేతను శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో విజేతను ఈ నెల 10వ తేదీన నోబెల్ కమిటీ ప్రకటించనుంది. నోబెల్ ప్రైజ్ గ్రహీతకు 9 లక్షల డాలర్ల (రూ.7.35 కోట్లు) నగదు అందజేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం జరుగనుంది. -
పేదరికంపై పోరుకు పురస్కారం
అత్యంత సంక్లిష్టమైన అంశంగా, ఓ పట్టాన కొరుకుడుపడని విషయంగా దేన్నయినా చెప్పదల్చు కున్నప్పుడు దాన్ని రాకెట్ సైన్స్‌తో పోలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ పేదరిక నిర్మూలన అంశం ఇప్పుడు రాకెట్ సైన్స్‌లాగే తయారైంది. ఆర్థికాభివృద్ధిని సాధించే సమాజాలు సైతం సంక్షోభాల్లో చిక్కుకోవడం, పేదరికం మటుమాయం కాకపోవడం, బలమైన ఆర్థిక వ్యవస్థ లనుకున్నవి బీటలువారుతుండటం, బడా సంస్థలు సైతం నేలమట్టం కావడం... ఇవన్నీ సంపన్న దేశాలు మొదలుకొని సాధారణ దేశాల వరకూ అన్నిటినీ కలవరపరుస్తున్నాయి. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు... ఏం చేస్తే నిలబడుతుందో తోచదు. ముఖ్యంగా పేదవర్గాలవారిని ఏ మార్గంలో ఆదుకుంటే వారి బతుకులు మెరుగుపడతాయో, వారంతటవారు నిలదొక్కుకోగలు గుతారో అర్థంకాదు. అనేక దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై వినూత్న కోణంలో పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయన జీవన సహచరి ఎస్తర్ డఫ్లో, మరో శాస్త్రవేత్త మైకేల్ క్రెమెర్‌లకు సోమవారం నోబెల్ పురస్కారం లభించింది. అభిజిత్ బెంగాల్‌కు చెందినవారు. డఫ్లో ఫ్రాన్స్ దేశస్తురాలు, క్రెమెర్ అమె రికాకు చెందినవారు. భిన్నరంగాల్లో అద్వితీయమైన కృషిచేసేవారికి నోబెల్ కమిటీ అందజేసే పురస్కారాలకు అర్ధం, పరమార్థం ఉంటాయి. ఆ పురస్కారాల ద్వారా వారి కృషిని ప్రపంచ దేశా లన్నీ గుర్తించేలా చేయడం, ఆ పరిశోధనల నుంచి లబ్ధి పొందేందుకు ఆ దేశాలను ప్రోత్సహించడం ఆ పురస్కారాల లక్ష్యం. శాస్త్ర విజ్ఞానం, వైద్యం తదితర రంగాల మాటెలా ఉన్నా... ఆర్థిక రంగంలో జరిగే పరిశోధనలపైనా, వాటి ఫలితాలపైనా ఏ దేశమూ పెద్దగా దృష్టి పెడుతున్న దాఖలా లేదు. అయితే అభిజిత్ బెనర్జీ త్రయం భిన్నమైనది. అభిజిత్ సాగిస్తున్న పరిశోధనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ఆసక్తి కలిగింది. విద్యారంగంలో తాము తీసుకొచ్చిన మార్పులకు అభిజిత్ మార్గదర్శకమే కారణమని కేజ్రీవాల్ ప్రకటించగా, గత సార్వత్రిక ఎన్నికల్లో తాము ప్రకటించిన కనీస ఆదాయ పథకం ఆయన సలహాతో రూపొందిం చిందేనని రాహుల్ చెప్పారు. ముంబై, వడోదరా వంటిచోట్ల స్వచ్ఛంద సంస్థలు ఈ విధానాలను అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించాయి. పేదరిక నిర్మూలన కోసం రెండున్నర దశాబ్దాలుగా బెనర్జీ, డఫ్లో, క్రెమెర్‌లు పరిశోధనలు సాగి స్తున్నారు. శాస్త్రీయ పరిశోధనల్లో ఖచ్చితత్వాన్ని సాధించడానికి అనుసరించే ప్రక్రియలనే ఆర్థిక శాస్త్రానికి అనువర్తింపజేసి ఈ ముగ్గురూ క్షేత్ర స్థాయిలో సాగించిన పరిశోధనలు మంచి ఫలితా లనిచ్చాయి. ఒక ప్రాంతాన్నో, ఒక గ్రామాన్నో, లేక కొంతమంది పౌరుల్నో నమూనాలుగా తీసుకుని పరిశోధించడం కాక... తక్కువమందిని నమూనాగా తీసుకుని వారిని రెండు చిన్న చిన్న బృందా లుగా విడగొట్టి ఆ బృందాలకు వేర్వేరు విధానాలను అనుసరించి ఫలితాలెలా వస్తున్నాయో వీరు పరిశోధించారు. ఇది ఒకరకంగా ఔషధ ప్రయోగంలో అనుసరించే విధానం. ఒక బృందానికి పూర్తిగా ఔషధాన్ని అందించడం, మరో బృందానికి ఉత్తుత్తి ఔషధాన్ని అందించడం ఆ విధానంలోని కీల కాంశం. ఔషధాన్ని నిజంగా తీసుకున్నవారూ, తీసుకున్నామని అనుకున్నవారూ తమకెలా ఉన్నదని చెబుతారో తెలుసుకుని వాటి ప్రాతిపదికన ఒక అవగాహనకు రావడం, ఔషధ ప్రభావాన్ని అంచనా వేయడం ఆ విధానం లక్ష్యం. చిన్న చిన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్ర స్థాయిలో వీరు సాగించిన అధ్యయనాలు అద్భుతమైన ఫలితాలను వెలువరించాయి. నిర్దిష్టమైన కాలంలో, నిర్దిష్టమైన ప్రాంతంలో జరిపే ప్రయోగాలు మెరుగైన ఫలితాలిచ్చినా... వాటిని సార్వత్రికంగా అమలు చేసినప్పుడు భిన్నమైన ఫలితాలు వెలువడుతుంటాయని ఆర్థిక రంగ అధ్యయనాలపై తరచు ఫిర్యాదులొస్తుంటాయి. అందువల్లే వీరు వినూత్న విధానాలు అనుసరించారు. టీచర్–పిల్లల నిష్పత్తి తక్కువుండేలా చూసి పిల్లలపై అధిక శ్రద్ధ ఉండేలా చూడటం, అలాగే ఆ టీచర్లను శాశ్వత ప్రాతిపదికన కొందరిని, స్వల్పకాలిక కాంట్రాక్టుపై మరికొందరిని తీసుకుని వారి బోధనా విధానం ఫలితాలెలా ఉన్నాయో చూడటం, చదువులో వెనకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అదనంగా సమయం కేటాయించడం, శారీరకంగా బలహీనంగా ఉంటున్న పిల్లలకు పోషకాహారాన్ని అందించి వారు చదువులో మెరుగుపడుతున్న విధానాన్ని గమనించడం వంటివి ఇందులో ఉన్నాయి. అతి సాధారణమైన అంశాలుగా కనబడే ఇటువంటివన్నీ అభివృద్ధి తీరునే మార్చివేశాయని నోబెల్ కమిటీ ప్రశంసించిందంటే ఈ ముగ్గురి ప్రతిభాపాటవాల్నీ అంచనా వేయొచ్చు. వీరి పరిశోధనలన్నీ ఎప్పటినుంచో అమలవుతున్నవేనని కొందరు నిపుణులు కొట్టిపారేశారు. కానీ అంతిమంగా ఇవి అత్యంత ప్రభావవంతమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవనీ తేలింది. అభిజిత్‌కు నోబెల్ రావడంలోని ఇతర కోణాలను కూడా చూడాలి. ఆయన చిన్నప్పుడు బాగా చదివే విద్యార్థే తప్ప, ప్రథమశ్రేణికి చెందినవాడు కాదు. చదువుతోపాటు ఆటపాటలు, సినిమాలు వగైరాలపై ఆసక్తి. ఢిల్లీ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో చదువుతున్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని 12 రోజులు తీహార్ జైల్లో ఉన్నవాడు. విద్యార్థికి చదువు మినహా మిగిలినవన్నీ అస్పృశ్యమని, జీవితంలో ఎదుగుదలకు ఆటంకమని భావించేవారంతా అభిజిత్ నేపథ్యాన్ని గమ నించక తప్పదు. నిజానికి తన చుట్టూ నివసించేవారి జీవితాలను చిన్నప్పటినుంచీ గమనిస్తుండటం వల్లే, వారితో సన్నిహితంగా మెలగడం వల్లే వారి బతుకులను మెరుగుపరచడానికి తోడ్పడే అసా ధారణమైన విధానాలను అభిజిత్ కనుక్కోగలిగాడు. అమలవుతున్న విధానాలను అనుసరిస్తూ పోవడం కాక... వాటిని ప్రశ్నించడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే మరింత ఉన్న తమైన విధానాలు రూపుదిద్దుకుంటాయని నిరూపించాడు. -
ఆలిస్ మన్రో
ఆధునిక చెహోవ్ అనిపించుకున్న రచయిత్రి ఆలిస్ మన్రో. 1931లో కెనడాలో జన్మించారు. అసలు పేరు ఆలిస్ యాన్ లెయిడ్‌లా. వాళ్ల నాన్న నక్కలను పెంచేవాడు. వాటి తోలుకు అప్పట్లో మంచి గిరాకీ ఉండేది. డిమాండ్ పడిపోయాక, కుటుంబం టర్కీ కోళ్ల వైపు మళ్లింది. ఈ వాతావరణం ఆలిస్ కథల్లో కనిపిస్తుంది. ఆలిస్ కూడా వెయిట్రెస్గానూ, పొగాకు తోటల్లోనూ, గ్రంథాలయ గుమస్తాగానూ పనిచేసింది. యూనివర్సిటీ సహవిద్యార్థి జేమ్స్ మన్రోను పెళ్లి చేసుకుని, ఆలిస్ మన్రో అయిన తర్వాత దంపతులిద్దరూ ‘మన్రోస్ బుక్స్’ పేరిట బుక్ స్టోర్ తెరిచారు. తర్వాతి కాలంలో అది ప్రతిష్టాకరమైన పుస్తకాలయంగా పేరు తెచ్చుకుంది. కొత్తలో అందులోని పుస్తకాలు కొన్ని చదివి, తాను ఇంతకంటే బాగా రాయగలనని రాయడం ప్రారంభించానని వ్యాఖ్యానించారు. కానీ ఆమె టీనేజ్లోనే రాయడం మొదలైంది. 1968లో ఆమె తొలి కథా సంపుటి వెలువడినప్పుడు సానుకూల స్పందన వచ్చింది. కథకు కొత్త నిర్మాణపద్ధతిని ఇచ్చిన మన్రో విస్తృతంగా రాస్తూ, సుమారు నాలుగేళ్లకో కథా సంపుటి వెలువరిస్తూ వచ్చారు. మానవ సంక్లిష్టతను అత్యంత సరళంగా ఆవిష్కరించే తీరు విమర్శకుల మెప్పు పొందింది. ఆమె కొన్ని కథలు సినిమాలుగా కూడా తీశారు. 2013లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. పాత కథకే కొత్త వెర్షన్ రాయడం ఆలిస్ ప్రత్యేకతల్లో ఒకటి. -
లైంగిక స్కామ్‌కు నోబెల్ అవార్డుకు లింకేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి అత్యంత ప్రపంచ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డును సాహిత్యానికి ప్రకటించలేదు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఈసారికి ఈ అవార్డును వాయిదా వేస్తున్నామని, వచ్చే ఏడాది 2018కి, 2019 సంవత్సరానికి నోబెల్ అవార్డులు ప్రకటిస్తామని స్వీడిష్ అకాడమి శుక్రవారం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ అవార్డును వాయిదా వేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంటే వాయిదా వేయడం ఇదే మొదటి సారి. ఇంతకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎవరి మీద వచ్చాయి? ఎందుకొచ్చాయి? అవార్డు ఇవ్వకపోవడానికి లైంగిక వేధింపుల ఆరోపణలకు ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏమిటీ? ఈప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే కాస్త లోతుగా అధ్యయనం చేయాల్సిందే. అలా చేస్తే ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్‌స్టైన్ సెక్స్ స్కామ్‌కు, తద్వారా పుట్టిన ‘మీ టూ’ ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం, తెలుగు సినీ రంగంపై శ్రీరెడ్డి సాగిస్తున్న ప్రస్తుత పోరాటానికి పరోక్ష సంబంధం కనిపిస్తుంది. స్వీడిష్ భాష అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వచనం, కవిత్వం సహా పలు భాషా ప్రక్రియలను ప్రోత్సహించడం కోసం 1786లో ఈ స్వీడిష్ అకాడమీ ఏర్పాటయింది. అప్పటి నుంచి ఈ అకాడమీ ఏటా స్వీడిష్ సాహిత్యంలో ఉత్తమ రచయిత లేదా కవికి అవార్డు ఇస్తూ వస్తోంది. ప్రధానంగా ఈ అకాడమిలో 18 మంది సభ్యులు ఉంటారు. వారిలో శాశ్వత సెక్రటరీ ఒకరు ఉంటారు. సాహిత్యంలో నిపుణులైన వారిని మాత్రమే సాధారణంగా సభ్యులుగా తీసుకుంటారు. వీరిలో ఒకరు స్వీడిష్ అకాడమీకి శాశ్వత కార్యదర్శిగా ఉంటారు. దాదాపు 230 సంవత్సరాల అకాడమీ చరిత్రలో తొలిసారిగా శాశ్వత కార్యదర్శి సారా డేనియస్ (మహిళ) ఏప్రిల్ 12వ తేదీన తన పదవికి రాజీనామా చేయడంలో అకాడమీలో సంక్షోభం మొదలైంది. అకాడమీ నియమ నిబంధనల ప్రకారం సభ్యులు మరణిస్తే లేదా తీవ్ర అనారోగ్యానికి గురైయితేనే వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. సభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిపై అభిశంసన తీర్మానం పెట్టి మెజారిటీ నిర్ణయంతో వారిని తొలగించవచ్చు. కానీ సభ్యులు తమంతట తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయడానికి వీల్లేదు. కాకపోతే అకాడమీ కార్యకలాపాలకు స్వచ్ఛందంగా దూరంగా ఉండొచ్చు. కొత్త సభ్యులను ఎన్నుకోవాలంటే కనీసం 12 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనాలి. 1895 ప్రముఖ సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన వీలునామా వల్ల ఈ స్వీడిష్ అకాడమీ జాతకమే మారిపోయింది. కావాల్సినంత ధనం వచ్చి పడింది. నోబెల్ పేరిట సాహిత్యంలో మొట్టమొదటి అవార్డును 1901లో ఫ్రెంచ్ కవికి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ అవార్డుకు ఎంతో విలువ పెరిగింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్ రంగాలతోపాటు శాంతి నోబెల్ అవార్డులను వేర్వేరు అకాడమీలు ఎంపిక చేసినట్లే సాహిత్య నోబెల్ అవార్డును ఈ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేస్తోంది. స్వీడిష్ అకాడమీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు మూలాలు 1989 పరిణామాల్లోనే ఉన్నాయి. ప్రముఖ ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ రష్దీ ‘శటానిక్ వర్సెస్’ రాసినందుకు ఆయనపై ఇరాన్ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. ఆ ఫత్వాకు వ్యతిరేకంగా పోరాడలంటూ స్వీడిష్ ప్రభుత్వానికి ఓ మెమోరాండం సమర్పించాలని అకాడమీ మెజారిటీ సభ్యులు నిర్ణయించారు. అందుకు నిరసనగా కెరిస్టిన్ ఎక్మన్, లార్స్ జిల్లెస్టైన్లు తమ సభ్యత్వాన్ని వదులుకుంటున్నామని నోటిమాటగా చెప్పి వెళ్లిపోయారు. వారిలో లార్స్ జిల్లెస్టైన్ చనిపోవడంతో ఆయన స్థానంలో క్రిస్టినా లుగున్ అనే సాహిత్యవేత్తను ఎన్నుకున్నారు. 2015లో లొట్టా లొటాస్ అనే మహిళ కూడా వ్యక్తిగత కారణాలతో అకాడమీ నుంచి తప్పుకుంది. దీంతో అకాడమీ సభ్యుల సంఖ్య 18 నుంచి 16కు పడిపోయింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉండగా వారిలో శాశ్వత కార్యదర్శి సారా డేనియస్ ఈ నెల 12న అకాడమీ నుంచి తప్పుకున్నారు. ఆమె బాటలోనే కవయిత్రి కతరినా ఫ్రోస్టెన్సన్ తన భర్త జీన్ క్లాడ్ ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అకాడమీ నుంచి తప్పుకున్నారు. భర్తపై ఆరోపణలు వస్తే భార్య ఎందుకు బలి కావాలన్న చర్చ అకాడమీలో కూడా జరిగింది. అయితే ఆర్నాల్ట్ నడుపుతున్న కళాకారుల క్లబ్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నదే స్వీడిష్ అకాడమీ. పైగా ఈ లైంగిక ఆరోపణలు ఈ నాటివి కావు. 1996లో అన్నా కరీన్ బైలండ్ అనే యువ కళాకారిని తనను ఆర్నాల్ట్ లైంగికంగా వేధిస్తున్నారంటూ నాటి స్వీడిష్ అకాడమీ శ్వాశ్వత కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. 2017లో ప్రముఖ హాలివుడ్ నిర్మాత హార్వీ విన్‌స్టైన్ సెక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన కారణంగా మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా ఆర్నాల్ట్‌కు వ్యతిరేకంగా 18 మంది యువతులు మీడియా ముందుకు వచ్చి తామూ లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. దీంతో ఆర్నాల్ట్ భార్య కతరినా ప్రోస్టెన్సన్ను తొలగించాలంటూ అకాడమీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అకాడమీ సారా డేనియస్ ఏప్రిల్ 12న తన పదవికి గుడ్‌బై చెప్పగా, కతరినా రాజీనామా చేశారు. ఆమెకు మద్దతుగా నవలా రచయిత క్లాస్ ఆస్టర్ గ్రెన్, సాహితీవేత్త స్కాలర్ కేజెల్, చరిత్రకారులు పీటర్ ఎంగ్లండ్లు కూడా అకాడమీకి రాజీనామా చేశారు. దీంతో అకాడమీ సభ్యత్వం 11కు పడిపోయింది. అకాడమీ నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను ఎన్నుకోవాలంటే 12 మంది సభ్యులు ఉండాలి. నిబంధనలను మార్చే హక్కు అకాడమీకి లేదు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో నోబెల్ అవార్డు ఎంపికను పక్కన పెట్టి మిగిలిన సభ్యులు స్వీడన్ రాజు వద్దకు సమస్యను తీసుకెళ్లారు. త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
బ్రిటన్ రచయితకు సాహిత్య నోబెల్
స్టాక్‌హోం/లండన్: బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురోను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ నవలా రచయితగా అందరికీ సుపరిచితమైన ఇషిగురోను నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది. ఇషిగురో నవలల్లో అద్భుతమైన భావోద్వేగ శక్తి ఉంటుందని, కల్పిత భావనలను అత్యద్భుతంగా తన రచనల్లో ప్రతిబింబించిన రచయిత ఇషిగురో అని అకాడమీ కొనియాడింది. ఇషిగురో 8 పుస్తకాలతో పాటు పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్ట్‌లు అందించారు. ఆయన రచించిన ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ నవలకు 1989లో మాన్ బుకర్ ప్రైజ్ లభించింది. 62 ఏళ్ల ఇషిగురో జపాన్‌లోని నాగసాకీలో జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసులో కుటుంబం మొత్తం బ్రిటన్‌కు వలస వచ్చింది. ఇషిగురో 1982లో తొలి నవల ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ను.. 1986లో ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’ను రచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాగసాకీలో పరిస్థితులపై ఈ రెండు నవలలను రాశారు. ఇక ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ద రిమైన్స్ ఆఫ్ ద డే నవల ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆంటోని హాప్కిన్స్ ప్రధాన పాత్రలో సినిమాగా తెరకెక్కింది. ఇక 2005లో ‘నెవర్ లెట్ మీ గో’అనే సైన్స్ ఫిక్షన్ నవలను, 2015లో ద బరీడ్ జెయింట్ అనే నవలను రచించారు. ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి సంబంధించి ఫేవరెట్ల జాబితాలో అసలు ఇషిగురో లేరు. ఇషిగురో పబ్లిషర్ ఫబర్ అండ్ ఫబర్ ట్వీటర్లో స్పందిస్తూ.. ఇషిగురోను నోబెల్ వరించడం తమను థ్రిల్‌కు గురిచేసిందని పేర్కొంది. ఇషిగురోకు నోబెల్ సాహిత్య పురస్కారంతో పాటు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందజేయనున్నారు. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో ఇషిగురో ఈ పురస్కారాన్ని అందు కోనున్నారు. నోబెల్ సాహిత్య పురస్కారం వరించిన 114వ రచయిత ఇషిగురో కావడం గమనార్హం. వదంతి అనుకున్నా: ఇషిగురో తనకు నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చిందన్న వార్తలను తొలుత నమ్మలేదని, వాటిని వదంతులుగా భావించానని కజువో ఇషిగురో చెప్పారు. తనకు ఈ పురస్కారం రావడం నిజమని ఆ తర్వాత తెలిసిందన్నారు. ఇది తనకు అద్భుతమైన గౌరవమని బీబీసీతో ఇషిగురో చెప్పారు. అయితే ఇప్పటి వరకూ నోబెల్ కమిటీ తనను సంప్రదించలేదన్నారు. ‘‘ఇది అద్భుతమైన గౌరవం. ప్రపంచంలోని గొప్ప రచయితల అడుగుజాడల్లో నేను నడిచాను. దాని వల్లే నాకు ఈ గొప్ప పురస్కారం దక్కింది’’అని చెప్పారు. ఈ పురస్కారం తనకు మంచి చోదక శక్తిగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిరతతో కూడి ఉందని, నోబెల్ పురస్కారాలు ప్రపంచంలో సానుకూల వాతావరణం నెలకొనేందుకు ఓ శక్తిగా పనిచేస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. -
2017 నోబెల్ గ్రహీతలు వీరే...
స్టాక్‌హోం: ఫిజిక్స్‌లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది (2017) ముగ్గురు అమెరికన్లను వరించింది. లిగో-విర్గో డిటెక్టర్ కొలాబరేషన్‌కు చెందిన రైనర్ వీస్, బారీ సీ బారిష్, థోర్న్లకు గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నందుకు ఈ పురస్కారం దక్కింది. ప్రపంచాన్ని కుదిపివేసే ఆవిష్కరణకు ఈ ఏడాది నోబెల్ లభించిందని స్టాక్‌హోమ్‌లో జరిగిన సమావేశంలో నోబెల్ కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు. 1901 నుంచి ఫిజిక్స్‌లో అవార్డును ఇప్పటివరకూ 111 సార్లు నోబెల్ కమిటీ ప్రదానం చేసింది. గత ఏడాది టోపోలజీలో చేసిన అసమాన కృషికి గాను ముగ్గురు పరిశోధకులు నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ విజేతలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, మేరి క్యూరీ, నీల్స్ బోర్ వంటి దిగ్గజాల సరసన చేరతారు. ఇక 2010లో నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్‌ను యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు అండ్రీ జీమ్, నొవొసెలొవ్లు పొందారు. గ్రఫీన్తో వీరు అద్భుత ప్రయోగాలు చేసినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. -
వైద్యరంగంలో ముగ్గురుకి నోబెల్
నార్వే : ఈ ఏడాది నోబెల్ అవార్డులు ప్రకటన మొదలైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ ప్రకటించారు. ఈ రంగంలో మొత్తం ముగ్గురుకి నోబెల్ పురస్కారం ప్రకటించారు. జెఫ్రీ సి.హాల్, హైకెల్ రోస్ బాష్, మైకెల్ డబ్ల్యూ యంగ్‌కు నోబెల్ అవార్డు అందించనున్నట్లు నోబెల్ అవార్డులను అందించే సంస్థ వెల్లడించింది. మానవ జీవక్రియల, మానసిక ఉద్వేగాల మార్పులను శరీరంలోని అణువులు ఏ విధంగా తమ ఆధీనంలో ఉంచుకుంటుందో వివరించినందుకు వీరికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. మొక్కలు, జంతువులు, మానవులు ప్రకృతిలో జరిగే మార్పులను ఎలా తమలో ఇముడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నారో వీరి పరిశోధనలు వివరించాయి. నోబెల్ అవార్డు కింద వీరికి 9 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు అంటే 1.1 మిలియన్ డాలర్లు అందనున్నట్టు నోబెల్ అసెంబ్లీ తెలిపింది. ప్రతి ఏడాది వైద్యరంగంలోనే తొలుత నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. 1901 నుంచి ఈ అవార్డుల ప్రదానం జరుగుతోంది. -
పిల్లలపై వేధింపులకు పాల్పడితే పీడీ చట్టం
పిల్లలపై దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త పర్యటన: సత్యార్థి సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో బాల బాలికలపై దాడులు చేసినా, ఆకృత్యాలకు పాల్పడినా పీడీ చట్టం ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘సురక్షిత బాల్యం–సురక్షిత భారతదేశం’ కార్యక్రమానికి కర్నూలు నాంది పలకాలని సీఎం పిలుపునిచ్చారు. పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి చేపట్టిన భారత యాత్ర మంగళవారం కర్నూలు జిల్లాకు వచ్చిన సందర్భంగా సీఎం ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించారు. గత 40 ఏళ్లుగా 140 దేశాల్లో పర్యటించి పిల్లలు, మహిళల సంరక్షణకు సత్యార్థి పోరాడుతు న్నారని కొనియాడారు. పిల్లలు, మహిళల కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాలు తెస్తామన్నారు. పిల్లలపై లైంగిక హింస ఘటనలు దారుణమని సత్యార్థి అన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో లైంగిక వేధింపులు, బాలికలపై అసభ్య ప్రవర్తన వంటి కేసులు 15 వేలు నమోదు కాగా... 4 శాతం పరిష్కారం అయ్యాయన్నారు. బుద్ధుడు, గాంధీ పుట్టిన ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు మనకు చెంపపెట్టులాంటివన్నారు. పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాపై తాను 11 వేల కిలోమీటర్ల మేర 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా భారతయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సత్యార్థి 80 వేల మంది పిల్లలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ తెలిపారు. మరోవైపు సీఎం పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించారు. సభ కాస్తా మధ్యాహ్నం రెండు గంటల వరకూ కొనసాగడంతో పిల్లలు ఆకలితో అలమటించారు. -
18న జిల్లాకు నోబోల్ గ్రహీత కైలాస్ సత్యార్థి
పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ఈనెల 18న జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. ఏర్పాట్లపై సోమవారం స్థానిక రెవెన్యూభవన్‌లో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నోబెల్ గ్రహీత సత్యార్థి భారతయాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటిస్తున్న నేపథ్యంలో 18న బెంగళూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్‌కు చేరుకుంటారన్నారు. 21, 22న సీఎం కాన్ఫరెన్స్: ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా ప్రగతి నివేదికలు ఈనెల 14వ తేదీలోపు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల ప్రగతి నివేదికలు, పపర్‌పాయింట్ ప్రజెంటేషన్లు గడువులోపు సీపీవో వాసుదేవరావుకు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ టీకే రమామణి, జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీఆర్వో మల్లీశ్వరీదేవి, డ్వామా పీడీ నాగభూషణం, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎన్ఏ శోధనకు నోబెల్
స్వీడన్, అమెరికా, టర్కిష్ అమెరికన్ శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్ర బహుమతి స్టాక్‌హోమ్: దెబ్బతిన్న డీఎన్ఏను మానవ శరీరం స్వయంగా ఎలా మరమ్మతు చేసుకుంటుందనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. స్వీడన్‌కు చెందిన థామస్ లిండాహ్, అమెరికాకు చెందిన పాల్ మాడ్రిక్, టర్కిష్ అమెరికన్ అజీజ్ సంకార్‌లకు సంయుక్తంగా నోబెల్ అందజేయనున్నట్లు రాయల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ బుధవారం తెలిపింది. జీవకణాల పనితీరు ఏ విధంగా ఉంటుందనేది వీరి పరిశోధనతో వెల్లడైందని పేర్కొంది. వారసత్వంగా జన్యులోపాల వల్ల వచ్చే ఎన్నో రకాల వ్యాధులకు చికిత్సను, ఔషధాలను రూపొందించడానికి అది తోడ్పడిందని పేర్కొంది. సాధారణంగా శరీరంలో కణ విభజన జరిగినప్పుడు, తీవ్రమైన సూర్యరశ్మి వంటి బాహ్యకారణాలతో కణాల్లోని డీఎన్ఏ దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న డీఎన్ఏను కణాల్లో ఉండే కొన్ని ప్రొటీన్లు మరమ్మతు చేస్తాయి. తద్వారా ఆ జీవకణం తిరిగి ఆరోగ్యవంతం అవుతుంది. ఈ డీఎన్ఏ మరమ్మతు ప్రక్రియను లిండాహ్, పాల్ మాడ్రిక్, అజీజ్ గుర్తించారు. టర్కీలోని సావర్‌లో జన్మించి అమెరికాకు వలస వెళ్లిన లిండాహ్.. అల్ట్రా వయోలెట్ రేడియేషన్ ద్వారా డీఎన్ఏ మరమ్మతు ప్రక్రియను గుర్తించారు. మాడ్రిక్ ఆ సంక్లిష్లమైన విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ విజేతలు ముగ్గురికీ కలిపి దాదాపు రూ. 6.17 కోట్లు బహుమతిగా అందజేస్తారు. ఇక నోబెల్ పురస్కారాల్లో భాగంగా గురువారం సాహిత్యం విభాగంలో, శుక్రవారం శాంతి విభాగంలో, సోమవారం ఆర్థిక విభాగంలో బహుమతులను ప్రకటించనున్నారు. మరమ్మతు మెకానిక్‌లు మీరెంత పొడవు పెరగాలో... మీకు ఏఏ వ్యాధులు వచ్చే అవకాశముందో.. అన్నీ మీరు పుట్టకముందే నిర్ణయమైపోతాయి! మీ శరీరంలోని ప్రతి కణంలోని డీఎన్ఏలో ఈ సమాచారం ఉంటుంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ డీఎన్ఏలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సూర్యుడి అతినీలలోహిత కిరణాలతోపాటు ధూమపానం, పలు రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల డీఎన్ఏలో వచ్చే మార్పుల ఫలితంగా వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. అదృష్టవశాత్తూ మన శరీరంలోని కొన్ని ఎంజైమ్‌లు, ప్రొటీన్లు ఈ మార్పులపై నిత్యం ఓ కన్నేసి ఉంటాయి. అంతేకాదు వాటిని మరమ్మతు చేస్తూంటాయి కూడా. ఇదెలా జరుగుతుందో గుర్తించిన శాస్త్రవేత్తలు థామస్ లిండాల్, పాల్ మాడ్రిక్, అజీజ్ సంకార్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. - సాక్షి, హైదరాబాద్ ►46 ప్రతీ కణంలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య ►డీఎన్ఏ రసాయనిక నిర్మాణంలో ఒక్కో బ్లాకును ఏ, సీ, టీ, జీలుగా వ్యవహరిస్తారు ►23 తల్లిదండ్రుల్లో ఒక్కొక్కరి నుంచి వచ్చే క్రోమోజోమ్‌ల సంఖ్య ►మొత్తం 300 కోట్ల బ్లాకులతో మానవుని జీనోమ్ నిర్మితమై ఉంటుంది ►{పతి క్రోమోజోమ్లోనూ దాదాపు రెండు మీటర్ల పొడవున్న డీఎన్ఏ ఉండచుట్టుకుని ఉంటుంది. ►అడినైన్ (ఏ) థమమీన్ (టీ), గ్వానైన్ (జీ), సైటోసైన్ (సీ) అనే నాలుగు రసాయనాలతో డీఎన్ఏ ఏర్పడుతుంది. డీఎన్ఏ ఆకారం మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటుంది. దీంట్లోని మెట్లలో ఇరువైపులా రెండు రసాయనాలు ఉంటాయి. ► గ్వానైన్ - సైటోసైన్, అడినైన్ -థయమీన్లు డీఎన్ఏ పొడవునా వరుసగా ఉంటాయి. ఒక్కోదాన్ని ఒక బేస్పెయిర్ అంటారు. లిండాల్ పరిశోధన ►కణ విభజన సమయంలో డీఎన్ఏ రెండు పోగులుగా విడిపోతుంది. సరిగ్గా మ్యాచింగ్‌తో కలసిపోయి కొత్త కణంలో పూర్తిస్థాయి డీఎన్ఏ ఏర్పడుతుంది. ►ఈ క్రమంలో ఒక్కోసారి డీఎన్ఏలోని సైటోసైన్లో కొన్ని మార్పులు వచ్చి యురాసిల్ అనే కొత్త రసాయనం ఏర్పడుతుంది. ►గ్లైకోసైలేస్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ ఈ తేడాను గుర్తించి యురాసిల్ను కత్తిరిస్తుంది. అదేసమయంలో మరికొన్ని ఎంజైమ్‌లు యురాసిల్ స్థానంలో నిరపాయకరమైన కొన్ని ఇతర రసాయనాలను చేరుస్తాయి. అజీజ్ సంకార్ గుర్తించింది ఇదీ... సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, సిగరెట్ పొగలోని కేన్సర్ కారకాల వల్ల డీఎన్ఏలో వచ్చే మార్పులు వాటంతట అవే ఎలా మరమ్మతు అవుతాయో అజీజ్ సంకార్ గుర్తించారు. ► అతినీల లోహిత కిరణాలు డీఎన్ఏ పోగులోని రెండు థయమీన్ అణువుల మధ్య రసాయన బంధం ఏర్పడేలా చేస్తాయి. ► ఎక్సిన్యూక్లియేస్ అనే ఎంజైమ్ ఈ మార్పును గుర్తిస్తుంది. వెంటనే డీఎన్ఏ పోగును కత్తిరించి, 12 న్యూక్లియోటైడ్లను తొలగిస్తుంది. ► ఫలితంగా ఏర్పడ్డ ఖాళీని డీఎన్ఏ పాలిమరేస్ అనే పదార్థం పూరిస్తుంది. ఆ వెంటనే డీఎన్ఏ లిగేస్ అనే రసాయనం పాలిమరేస్లోని థయమీన్ను, దిగువభాగంలోని అడినైన్లను కలిపేస్తుంది. దీంతో మరమ్మతు పూర్తవుతుంది. పాల్ మాడ్రిక్ ఏం చేశారు... ► కణం రెండుగా విభజితమైనప్పుడు కొన్నిసార్లు సహజసిద్ధంగానే వాటిల్లోని బేస్పెయిర్లలో తేడాలు నమోదవుతూంటాయి. అంటే అడినైన్ థయమీన్‌తో కాకుండా మరో రసాయనంతో జతకడుతుందన్నమాట. ► ఈ తేడాలను మ్యూట్ ఎస్, మ్యూట్ ఎల్ అనే ఎంజైమ్‌లు గుర్తిస్తాయి. ►ఇంకో ఎంజైమ్ సరైన బేస్‌పెయిర్‌ను గుర్తించి మోసుకొస్తే... మ్యూట్ ఎస్ తేడాగా ఉన్న బేస్‌పెయిర్‌ను కత్తిరిస్తుంది. ► డీఎన్ఏ పాలిమరేస్, డీఎన్ఏ లిగేస్ల సాయంతో తేడాల్లేని డీఎన్ఏ పోగు, వాటిమధ్య రసాయన బంధం ఏర్పడుతుంది. -
తరగతి పరీక్షలపై మలాలా బెంగ!
లండన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన మలాలా యూసఫ్‌జాయ్(17) సందిగ్ధంలో పడింది. నోబెల్ అవార్డు తీసుకునే సమయంలోనే తరగతి పరీక్షలకు హాజరవుతున్నందున మలాలా బెంగపెట్టుకుంది. ప్రస్తుతం బర్మింగ్ హమ్ లో తన తల్లి దండ్రులతో కలసి ఉన్న మలాల నోబెల్ అవార్డును గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరుగనున్న స్కూలు పరీక్షలపై ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో ఆమె కలత చెందుతున్నట్లు పేర్కొంది. బాలికల విద్యా హక్కు కోసం ధైర్యంగా, సాహసోపేతంగా పోరాడిన మలాలాకు నోబెల్ అవార్డుతో కొత్త సమస్య వచ్చిపడటం ఆసక్తికరంగా మారింది. గత రెండు సంవత్సరాల క్రితం తాలిబన్లు తుపాకీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా అనంతరం మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న సంగతి తెలిసిందే. నోబెల్ అవార్డు గెలుచుకున్న తరువాత ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటూర్యూలో పలు విషయాలను వెల్లడించింది. 'ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజంగా గొప్ప గౌరవం. ప్రజలు చూపించిన ప్రేమతోనే నేను తిరిగి బయటపడ్డాను'అని పేర్కొంది. 'నాకు అవార్డు వచ్చే విషయంలో నా టీచర్లే ఎక్కువ ఆసక్తి చూపారు. అవార్డు వచ్చినట్లు ప్రకటించాక వారే ఎక్కువగా ఆనంద పడ్డారు' అని మలాలా పేర్కొంది. అవార్డు వచ్చే సమయంలో కెమిస్ట్రీ టీచర్ వద్ద తాము ఒక పాఠ్యాంశాన్ని నేర్చుకుంటున్నామని మలాలా తెలిపింది. అయితే తన వద్ద ఎటువంటి సెల్ ఫోన్ లేకపోవడంతో ఆ విషయాన్ని తన టీచర్లే తెలిపినట్లు మలాలా పేర్కొంది. -
మలాలాకు నోబెల్‌పై తాలిబ న్ల ధ్వజం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో బాలికల విద్యా హక్కుల కోసం ఉద్యమిస్తున్న బాలిక మలాలా యూసఫ్‌జాయ్ మతంపై నమ్మకంలేని వాళ్ల ఏజెంటు అని గతంలో ఆమెపై తుపాకీ కాల్పులతో దాడికి పాల్పడిన తాలిబన్లు విమర్శించారు. ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించటాన్ని పాక్ తాలిబన్ వేర్పాటు వర్గం జమాత్ ఉల్ అహ్రార్ తప్పుపట్టింది. ‘తుపాకులు, సాయుధ సంఘర్షణలకు వ్యతిరేకంగా మలాలా చాలా మాట్లాడుతోంది. పేలుడు పదార్థాలను కనుగొన్నది.. ఆమెకు ప్రకటించిన నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడేనన్న విషయం ఆమెకు తెలియదా?’ అని జమాత్ ఉల్ అహ్రార్ ప్రతినిధి ఎహ్సానుల్లా ఎహ్సాన్ అన్నాడు. ‘గౌరవం కోసం కృషి చేసే వారి విజయం’ వాషింగ్టన్: భారత సామాజిక కార్యకర్త కైలాశ్ సత్యార్థి, మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించటం.. ప్రతి ఒక్క మానవుని గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషిచేస్తున్న వారందరి విజయమని అమెరికా అధ్యక్షుడుఒబామా అభివర్ణించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆయన.. ఈ ఏడాది ఆ అవార్డు విజేతలకు ఓ సందేశంలో అభినందించారు. బాల కార్మికతను నిర్మూలించేందుకు, ప్రపంచం నుంచి బానిసత్వమనే కళంకాన్ని తుడిచివేసేందుకు కైలాశ్ సత్యార్థి తన జీవితాన్ని అంకితం చేశారు’ అని కొనియాడారు. -
ఐదో ‘నోబెల్’ భారతీయుడు
న్యూఢిల్లీ: కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా(1978, శాంతి), అమర్త్యసేన్(1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు. మదర్ థెరిసా నాటి యుగోస్లేవియాలో జన్మించినప్పటికీ 1948లో భారత పౌరసత్వం తీసుకున్నారు. కాబట్టి ఆమెను భారతీయురాలిగానే పరిగణిస్తున్నారు. వీరే కాకుండా భారత్‌తో సంబంధమున్న నోబెల్ గ్రహీతలు భారత్‌లో పుట్టిన బ్రిటిష్ పౌరులు-రొనాల్డ్ రాస్(1902, వైద్యం), రుడ్యార్డ్ కిప్లింగ్(1907, సాహిత్యం) భారత్‌లో పుట్టి అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంతతి శాస్త్రవేత్త హర్గోబింద్ ఖురానా(1968, వైద్యం) భారత్‌లో పుట్టిన పాకిస్థాన్ పౌరుడుఅబ్దుస్ సలాం (1979, భౌతిక శాస్త్రం) భారత్‌లో జన్మించి, అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంతతి శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్(1983, భౌతిక శాస్త్రం) భారత్‌లో నివసిస్తున్న టిబెట్ బౌద్ధుల గురువు దలైలామా(1989, శాంతి) ట్రినిడాడ్‌లో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత వీఎస్ నైపాల్(2001, సాహిత్యం) భారత్‌లో పుట్టిన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యూనస్(2006, శాంతి) భారత్‌లో పుట్టి అమెరికా, బ్రిటన్ పౌరసత్వాలున్న వెంకట్రామన్ రామకృష్ణన్(2009, రసాయన శాస్త్రం) ఐపీసీసీ పేరుతో భారతీయుడు రాజేంద్రకుమార్ పచౌరి నిర్వహిస్తున్న ఛారిటీ సంస్థ కూడా 2007లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకుంది. -
పురుషులకూ సర్వైకల్ కేన్సర్ టీకా
నోబెల్ అవార్డు గ్రహీత హరాల్డ్ జూర్ హాసెన్ సూచన వ్యాక్సిన్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: గర్భాశయ ముఖద్వార కేన్సర్(సర్వైకల్ కేన్సర్) నిరోధక వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహా ప్రయత్నం జరగాలని నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ హరాల్డ్ జూర్ హాసెన్ పిలుపునిచ్చారు. సర్వైకల్ కేన్సర్‌కు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) కారణమని గుర్తించిన ఈ శాస్త్రవేత్త మంగళవారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో విలేకరులతో మాట్లాడారు. హాసెన్ పరిశోధనలు ఆసరాగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. సర్వైకల్ కేన్సర్‌తోపాటు కొన్ని ఇతర రకాల కేన్సర్ల నివారణకు మల్టీవాలెంట్ (వేర్వేరు వైరస్‌లను ఒకే టీకాతో నియంత్రించేవి) వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్‌ను 15-30 ఏళ్ల మధ్య వయసు వారందరికీ వేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ వయసు పురుషులకు లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ద్వారా హెచ్‌పీవీ వైరస్ ఎక్కువమంది మహిళలకు వ్యాపించే అవకాశముండటం దీనికి కారణమని వివరించారు. అందువల్ల ఈ వయసు పురుషులకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లయితే హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - ఎనిమిదేళ్లుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సంతృప్తికరంగా సాగడం లేదు. వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువ కావడమే కారణం. - అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛందసంస్థల సాయంతో తక్కువధరకే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. - అన్ని రకాల కేన్సర్లను జయించేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. - కొన్నిరకాల పశుమాంసం ద్వారా కేన్సర్ వచ్చే అవకాశముందని మేం జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది. దీన్ని నిర్ధారించేందుకు ఆయా పశువుల రక్తంలో ఉన్న కొన్ని వినూత్న వైరస్‌లను వేరు చేసి ప్రయోగాలు నిర్వహిస్తున్నాం. - సీసీఎంబీ డెరైక్టర్ సి.హెచ్.మోహన్‌రావు మాట్లాడుతూ దేశంలో సర్వైకల్ కేన్సర్ నిరోధక వ్యాక్సిన్ రూ.8 వేలకు లభిస్తోందని, కొన్నిదేశాల్లో గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్(గావి) వంటి సంస్థలు రూ.300కే దీనిని అందుబాటులోకి తెస్తున్నాయని చెప్పారు.