నార్వే : ఈ ఏడాది నోబెల్ అవార్డులు ప్రకటన మొదలైంది. తొలుత వైద్యరంగానికి నోబెల్ ప్రకటించారు. ఈ రంగంలో మొత్తం ముగ్గురుకి నోబెల్ పురస్కారం ప్రకటించారు. జెఫ్రీ సి.హాల్, హైకెల్ రోస్ బాష్, మైకెల్ డబ్ల్యూ యంగ్‌కు నోబెల్ అవార్డు అందించనున్నట్లు నోబెల్ అవార్డులను అందించే సంస్థ వెల్లడించింది. మానవ జీవక్రియల, మానసిక ఉద్వేగాల మార్పులను శరీరంలోని అణువులు ఏ విధంగా తమ ఆధీనంలో ఉంచుకుంటుందో వివరించినందుకు వీరికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది.
మొక్కలు, జంతువులు, మానవులు ప్రకృతిలో జరిగే మార్పులను ఎలా తమలో ఇముడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నారో వీరి పరిశోధనలు వివరించాయి. నోబెల్ అవార్డు కింద వీరికి 9 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు అంటే 1.1 మిలియన్ డాలర్లు అందనున్నట్టు నోబెల్ అసెంబ్లీ తెలిపింది. ప్రతి ఏడాది వైద్యరంగంలోనే తొలుత నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. 1901 నుంచి ఈ అవార్డుల ప్రదానం జరుగుతోంది.