ప్రస్తుతం పరమత సహనంపై దృష్టిపెట్టాలన్న ఆర్థికవేత్త అమర్త్యసేన్
కోల్‌కతా: మతాలకతీతంగా హిందువులు, ముస్లింలు కలిసి జీవించడం, పనిచేసుకోవడం భారత సంప్రదాయమని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. అలీపూర్ జైలు మ్యూజియంలో జరిగిన పుస్తక పఠన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశ చరిత్రను చూస్తే.. కొన్ని యుగాలుగా హిందువులు, ముస్లింలు మతసామరస్యంతో కలిసిమెలసి జీవిస్తున్నారు.
క్షితిమోహన్ సేన్ దీనిని ‘జుక్తోసాధన’ అన్నారు. ఒకమతం వారు ఇంకో మతంపై విద్వేషాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత కాలంలో ఈ సిద్ధాంతంపై మనం దృష్టి పెట్టాల్సి ఉంది. పిల్లలు ఇలాంటి విషపూరిత భావజాల బారిన పడకపోవడం వల్లే వారు ఎలాంటి భేదభావాలు లేకుండా బతుకుతున్నారు. సమాజంలో పరమత సహనం విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. ‘జుక్తోసాధన’ సామాజిక సేవ, కళల్లో వ్యక్తమవుతోంది’’ అని ఆయన అన్నారు. ఉపనిషత్తులను పార్శీలోకి అనువదించిన ముంతాజ్ కుమారుడు దారా షికోను ప్రస్తావిస్తూ దేశంలోని బహుళ సంస్కృతిని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment