పొరలు ఒలిచే రచయిత | Sakshi Editorial On South Korea Writer Han Kang | Sakshi
Sakshi News home page

పొరలు ఒలిచే రచయిత

Published Mon, Oct 14 2024 5:01 AM | Last Updated on Mon, Oct 14 2024 5:01 AM

Sakshi Editorial On South Korea Writer Han Kang

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్‌ కాంగ్‌ (సరైన ఉచ్చారణ: హన్‌ గాన్‌ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్‌  షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్‌ మర్నేన్, జపాన్‌  రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్‌  రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్‌ నడిచాయి. 

కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్‌  కాంగ్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్‌ అకాడెమీ. 2016లో తన కొరియన్‌  ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్‌ ’కు ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రెజ్‌’ గెలుచుకున్న హాన్‌  కాంగ్‌ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్‌  రచయిత కూడా కావడం విశేషం.

దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్‌  సుయెంగ్‌–వొన్‌  కూతురిగా 1970లో జన్మించిన హాన్‌  కాంగ్‌ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్‌  సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్‌. 

అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్‌ దురాక్రమణ (1910–45), కొరియన్‌  యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్‌కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్‌కు వెళ్లిపోయింది. 

సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ  వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్‌. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. 

అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్‌లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. 

ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్‌ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్‌  యాక్ట్స్‌’ నవల రాసింది కాంగ్‌. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.

పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్‌  కాంగ్‌కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. 

అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్‌ లెసన్‌ ్స’ నవల రాసింది కాంగ్‌. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.

హాన్‌  కాంగ్‌ ఎంత వేగంగా టైప్‌ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్‌ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్‌ చేసేది. 

కవయిత్రిగా మొదలైన కాంగ్‌కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్‌ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. 

తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్‌ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌’ కోసం ‘డియర్‌ సన్, మై బిలవ్డ్‌’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా!  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement