స్టాక్‌హోం/లండన్: బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురోను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ నవలా రచయితగా అందరికీ సుపరిచితమైన ఇషిగురోను నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది. ఇషిగురో నవలల్లో అద్భుతమైన భావోద్వేగ శక్తి ఉంటుందని, కల్పిత భావనలను అత్యద్భుతంగా తన రచనల్లో ప్రతిబింబించిన రచయిత ఇషిగురో అని అకాడమీ కొనియాడింది.
ఇషిగురో 8 పుస్తకాలతో పాటు పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్ట్‌లు అందించారు. ఆయన రచించిన ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ నవలకు 1989లో మాన్ బుకర్ ప్రైజ్ లభించింది. 62 ఏళ్ల ఇషిగురో జపాన్‌లోని నాగసాకీలో జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసులో కుటుంబం మొత్తం బ్రిటన్‌కు వలస వచ్చింది. ఇషిగురో 1982లో తొలి నవల ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ను.. 1986లో ‘యాన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’ను రచించారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాగసాకీలో పరిస్థితులపై ఈ రెండు నవలలను రాశారు. ఇక ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ద రిమైన్స్ ఆఫ్ ద డే నవల ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆంటోని హాప్‌కిన్స్ ప్రధాన పాత్రలో సినిమాగా తెరకెక్కింది. ఇక 2005లో ‘నెవర్ లెట్ మీ గో’అనే సైన్స్ ఫిక్షన్ నవలను, 2015లో ద బరీడ్ జెయింట్ అనే నవలను రచించారు. ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి సంబంధించి ఫేవరెట్ల జాబితాలో అసలు ఇషిగురో లేరు.
ఇషిగురో పబ్లిషర్ ఫబర్ అండ్ ఫబర్ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ఇషిగురోను నోబెల్ వరించడం తమను థ్రిల్‌కు గురిచేసిందని పేర్కొంది. ఇషిగురోకు నోబెల్ సాహిత్య పురస్కారంతో పాటు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందజేయనున్నారు. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో ఇషిగురో ఈ పురస్కారాన్ని అందు కోనున్నారు. నోబెల్ సాహిత్య పురస్కారం వరించిన 114వ రచయిత ఇషిగురో కావడం గమనార్హం.
వదంతి అనుకున్నా: ఇషిగురో
తనకు నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చిందన్న వార్తలను తొలుత నమ్మలేదని, వాటిని వదంతులుగా భావించానని కజువో ఇషిగురో చెప్పారు. తనకు ఈ పురస్కారం రావడం నిజమని ఆ తర్వాత తెలిసిందన్నారు. ఇది తనకు అద్భుతమైన గౌరవమని బీబీసీతో ఇషిగురో చెప్పారు. అయితే ఇప్పటి వరకూ నోబెల్ కమిటీ తనను సంప్రదించలేదన్నారు. ‘‘ఇది అద్భుతమైన గౌరవం. ప్రపంచంలోని గొప్ప రచయితల అడుగుజాడల్లో నేను నడిచాను. దాని వల్లే నాకు ఈ గొప్ప పురస్కారం దక్కింది’’అని చెప్పారు. ఈ పురస్కారం తనకు మంచి చోదక శక్తిగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిరతతో కూడి ఉందని, నోబెల్ పురస్కారాలు ప్రపంచంలో సానుకూల వాతావరణం నెలకొనేందుకు ఓ శక్తిగా పనిచేస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment