అత్యంత సంక్లిష్టమైన అంశంగా, ఓ పట్టాన కొరుకుడుపడని విషయంగా దేన్నయినా చెప్పదల్చు కున్నప్పుడు దాన్ని రాకెట్ సైన్స్‌తో పోలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ పేదరిక నిర్మూలన అంశం ఇప్పుడు రాకెట్ సైన్స్‌లాగే తయారైంది. ఆర్థికాభివృద్ధిని సాధించే సమాజాలు సైతం సంక్షోభాల్లో చిక్కుకోవడం, పేదరికం మటుమాయం కాకపోవడం, బలమైన ఆర్థిక వ్యవస్థ లనుకున్నవి బీటలువారుతుండటం, బడా సంస్థలు సైతం నేలమట్టం కావడం... ఇవన్నీ సంపన్న దేశాలు మొదలుకొని సాధారణ దేశాల వరకూ అన్నిటినీ కలవరపరుస్తున్నాయి. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు... ఏం చేస్తే నిలబడుతుందో తోచదు. ముఖ్యంగా పేదవర్గాలవారిని ఏ మార్గంలో ఆదుకుంటే వారి బతుకులు మెరుగుపడతాయో, వారంతటవారు నిలదొక్కుకోగలు గుతారో అర్థంకాదు. అనేక దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై వినూత్న కోణంలో పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయన జీవన సహచరి ఎస్తర్ డఫ్లో, మరో శాస్త్రవేత్త మైకేల్ క్రెమెర్‌లకు సోమవారం నోబెల్ పురస్కారం లభించింది. అభిజిత్ బెంగాల్‌కు చెందినవారు. డఫ్లో ఫ్రాన్స్ దేశస్తురాలు, క్రెమెర్ అమె రికాకు చెందినవారు. భిన్నరంగాల్లో అద్వితీయమైన కృషిచేసేవారికి నోబెల్ కమిటీ అందజేసే పురస్కారాలకు అర్ధం, పరమార్థం ఉంటాయి. ఆ పురస్కారాల ద్వారా వారి కృషిని ప్రపంచ దేశా లన్నీ గుర్తించేలా చేయడం, ఆ పరిశోధనల నుంచి లబ్ధి పొందేందుకు ఆ దేశాలను ప్రోత్సహించడం ఆ పురస్కారాల లక్ష్యం. శాస్త్ర విజ్ఞానం, వైద్యం తదితర రంగాల మాటెలా ఉన్నా... ఆర్థిక రంగంలో జరిగే పరిశోధనలపైనా, వాటి ఫలితాలపైనా ఏ దేశమూ పెద్దగా దృష్టి పెడుతున్న దాఖలా లేదు. అయితే అభిజిత్ బెనర్జీ త్రయం భిన్నమైనది. అభిజిత్ సాగిస్తున్న పరిశోధనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ఆసక్తి కలిగింది. విద్యారంగంలో తాము తీసుకొచ్చిన మార్పులకు అభిజిత్ మార్గదర్శకమే కారణమని కేజ్రీవాల్ ప్రకటించగా, గత సార్వత్రిక ఎన్నికల్లో తాము ప్రకటించిన కనీస ఆదాయ పథకం ఆయన సలహాతో రూపొందిం చిందేనని రాహుల్ చెప్పారు. ముంబై, వడోదరా వంటిచోట్ల స్వచ్ఛంద సంస్థలు ఈ విధానాలను అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించాయి.
పేదరిక నిర్మూలన కోసం రెండున్నర దశాబ్దాలుగా బెనర్జీ, డఫ్లో, క్రెమెర్‌లు పరిశోధనలు సాగి స్తున్నారు. శాస్త్రీయ పరిశోధనల్లో ఖచ్చితత్వాన్ని సాధించడానికి అనుసరించే ప్రక్రియలనే ఆర్థిక శాస్త్రానికి అనువర్తింపజేసి ఈ ముగ్గురూ క్షేత్ర స్థాయిలో సాగించిన పరిశోధనలు మంచి ఫలితా లనిచ్చాయి. ఒక ప్రాంతాన్నో, ఒక గ్రామాన్నో, లేక కొంతమంది పౌరుల్నో నమూనాలుగా తీసుకుని పరిశోధించడం కాక... తక్కువమందిని నమూనాగా తీసుకుని వారిని రెండు చిన్న చిన్న బృందా లుగా విడగొట్టి ఆ బృందాలకు వేర్వేరు విధానాలను అనుసరించి ఫలితాలెలా వస్తున్నాయో వీరు పరిశోధించారు. ఇది ఒకరకంగా ఔషధ ప్రయోగంలో అనుసరించే విధానం. ఒక బృందానికి పూర్తిగా ఔషధాన్ని అందించడం, మరో బృందానికి ఉత్తుత్తి ఔషధాన్ని అందించడం ఆ విధానంలోని కీల కాంశం. ఔషధాన్ని నిజంగా తీసుకున్నవారూ, తీసుకున్నామని అనుకున్నవారూ తమకెలా ఉన్నదని చెబుతారో తెలుసుకుని వాటి ప్రాతిపదికన ఒక అవగాహనకు రావడం, ఔషధ ప్రభావాన్ని అంచనా వేయడం ఆ విధానం లక్ష్యం. చిన్న చిన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్ర స్థాయిలో వీరు సాగించిన అధ్యయనాలు అద్భుతమైన ఫలితాలను వెలువరించాయి. నిర్దిష్టమైన కాలంలో, నిర్దిష్టమైన ప్రాంతంలో జరిపే ప్రయోగాలు మెరుగైన ఫలితాలిచ్చినా... వాటిని సార్వత్రికంగా అమలు చేసినప్పుడు భిన్నమైన ఫలితాలు వెలువడుతుంటాయని ఆర్థిక రంగ అధ్యయనాలపై తరచు ఫిర్యాదులొస్తుంటాయి. అందువల్లే వీరు వినూత్న విధానాలు అనుసరించారు. టీచర్–పిల్లల నిష్పత్తి తక్కువుండేలా చూసి పిల్లలపై అధిక శ్రద్ధ ఉండేలా చూడటం, అలాగే ఆ టీచర్లను శాశ్వత ప్రాతిపదికన కొందరిని, స్వల్పకాలిక కాంట్రాక్టుపై మరికొందరిని తీసుకుని వారి బోధనా విధానం ఫలితాలెలా ఉన్నాయో చూడటం, చదువులో వెనకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అదనంగా సమయం కేటాయించడం, శారీరకంగా బలహీనంగా ఉంటున్న పిల్లలకు పోషకాహారాన్ని అందించి వారు చదువులో మెరుగుపడుతున్న విధానాన్ని గమనించడం వంటివి ఇందులో ఉన్నాయి. అతి సాధారణమైన అంశాలుగా కనబడే ఇటువంటివన్నీ అభివృద్ధి తీరునే మార్చివేశాయని నోబెల్ కమిటీ ప్రశంసించిందంటే ఈ ముగ్గురి ప్రతిభాపాటవాల్నీ అంచనా వేయొచ్చు. వీరి పరిశోధనలన్నీ ఎప్పటినుంచో అమలవుతున్నవేనని కొందరు నిపుణులు కొట్టిపారేశారు. కానీ అంతిమంగా ఇవి అత్యంత ప్రభావవంతమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవనీ తేలింది.
అభిజిత్‌కు నోబెల్ రావడంలోని ఇతర కోణాలను కూడా చూడాలి. ఆయన చిన్నప్పుడు బాగా చదివే విద్యార్థే తప్ప, ప్రథమశ్రేణికి చెందినవాడు కాదు. చదువుతోపాటు ఆటపాటలు, సినిమాలు వగైరాలపై ఆసక్తి. ఢిల్లీ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో చదువుతున్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని 12 రోజులు తీహార్ జైల్లో ఉన్నవాడు. విద్యార్థికి చదువు మినహా మిగిలినవన్నీ అస్పృశ్యమని, జీవితంలో ఎదుగుదలకు ఆటంకమని భావించేవారంతా అభిజిత్ నేపథ్యాన్ని గమ నించక తప్పదు. నిజానికి తన చుట్టూ నివసించేవారి జీవితాలను చిన్నప్పటినుంచీ గమనిస్తుండటం వల్లే, వారితో సన్నిహితంగా మెలగడం వల్లే వారి బతుకులను మెరుగుపరచడానికి తోడ్పడే అసా ధారణమైన విధానాలను అభిజిత్ కనుక్కోగలిగాడు. అమలవుతున్న విధానాలను అనుసరిస్తూ పోవడం కాక... వాటిని ప్రశ్నించడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే మరింత ఉన్న తమైన విధానాలు రూపుదిద్దుకుంటాయని నిరూపించాడు.
పేదరికంపై పోరుకు పురస్కారం
Published Wed, Oct 16 2019 4:20 AM | Last Updated on Wed, Oct 16 2019 4:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment