సంక్షేమరాజ్య భావనకు నోబెల్‌ పట్టం | Nobel Prize For Fight Against Poverty | Sakshi
Sakshi News home page

సంక్షేమరాజ్య భావనకు నోబెల్‌ పట్టం

Published Thu, Oct 17 2019 5:00 AM | Last Updated on Thu, Oct 17 2019 5:00 AM

Nobel Prize For Fight Against Poverty - Sakshi

ప్రపంచ పేదరిక సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషించడంలో వినూత్న పద్ధతుల్లో ఆలోచించిన ముగ్గురు ఆర్థిక చింతనాపరులకు ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి ప్రకటించడం ముదావహం. ప్రపంచ పేదరిక సమస్య తాలూకు ప్రశ్నలను మరింత సరళమైన, నిర్దిష్టమైన రూపంలోకి వడకట్టి, తద్వారా పరిష్కారాన్ని సూచించే కృషిని చేశారనేది వారికి వస్తున్న ప్రశంస. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రభుత్వాలు, తమ పరిమిత వనరులను చీకట్లో రాయి విసిరినట్లు గుడ్డిగా తమకు తోచిన విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కాకుండా, ఆ నిధులను కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పద్ధతుల పైన వాడవచ్చు అని వీరి భావన. నిత్య జీవితంలో విద్య, వైద్యం వంటి రంగాల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం మనం అంతకుముందర ఆలోచించి ఉండని పరిష్కారాలను వారు ముందుకు తెచ్చారు.

2019 సంవత్సరానికి ఆర్థిక రంగంలో నోబెల్‌ బహుమతిని ముగ్గురు ఆచార్యులు కలిసి గెలుచుకున్నారు. వారిలో భారత సంతతి అమెరికా జాతీయు డైన అభిజిత్‌ బెనర్జీ, ఆయన సహచరి ఎస్తర్‌ డఫ్లో, హార్వర్డ్‌ విశ్వ విద్యాలయ ఆచార్యుడు మైకెల్‌ క్రెమర్‌లు ఉన్నారు. అమర్త్యసేన్‌ తరువాత ఆర్థిక రంగంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్న రెండవ భారతీయునిగా అభిజిత్‌ నిలిచారు. అయితే ప్రపంచ పేదరిక సమస్య పరిష్కారానికి అభిజిత్‌ సూచించిన పరిష్కారాలు మాత్రమే సరైన ఫలితాలను ఇస్తాయని భావించపనిలేదు. ఆర్థిక అసమానత్వంపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ సూచిం చిన పరిష్కార మార్గాలు కూడా జోడిస్తే వ్యవస్థాగత మౌలిక మార్పు లకు దోహదపడతాయి.

అర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన ఈ ముగ్గురి పరిశోధనలూ ప్రధానంగా ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని నోబెల్‌ అకాడమీ పేర్కొంది. ప్రపంచ పేదరిక సమస్యను అర్థం చేసుకుని, పరిష్కరించేందుకు గాను వీరు ఆ సమస్య తాలూకు ప్రశ్నలను మరింత సరళమైన, నిర్దిష్టమైన రూపంలోకి వడకట్టి, తద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచించే కృషిని చేశారనేది వారికి వస్తున్న ప్రశంస. అలాగే పేదరి కానికి సంబంధించి ఈ సరళీకరించిన, నిర్దిష్ట ప్రశ్నలకు  ప్రయోగా త్మక పద్ధతిలో పరిష్కారాలు కనుగొనేందుకు వీరు ప్రయత్నించారు. ఈ పరిశోధనల కోసం తమ విశ్వవిద్యాలయం ఎమ్‌.ఐ.టి లో వీరు ‘పేదరిక (పరిష్కార) కార్యాచరణ ప్రయోగశాల’ను ఒకదానిని 2000 సంవత్సరం ప్రాంతంలో ఏర్పరిచారు. ఈ పరిశోధనలో వీరు తాము ఎంచుకున్న ఒక పేదరిక అంశానికి లేదా సమస్యకు పరిష్కార పద్ధతిని రెండు బృందాల ద్వారా పరీక్షించేవారు. వాటిలో ఒక బృందంపై ఈ పరిష్కార పద్ధతిని అమలు జరిపేవారు. రెండవ బృందాన్ని ఈ పద్ధతి నుంచి మినహాయించే వారు. అంటే ఇది ఒక రకంగా ఫార్మా రంగంలోని క్లినికల్‌ ట్రయిల్స్‌ ప్రయోగ పద్ధతి వంటిది. తద్వారా వారు ఒక నిర్దిష్ట పేదరిక సమస్యకు తాము సూచి స్తోన్న పరిష్కార పద్ధతి సామర్థ్యాన్నీ పరీక్షించేవారు.

ఈ విధంగా కనుగొన్న పరిష్కారం ద్వారా  నిధుల కొరత అధి కంగా ఉన్న భారత్‌ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రభు త్వాలు, తమ పరిమిత వనరులను  చీకట్లో రాయి విసిరినట్లు గుడ్డిగా తమకు తోచిన విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కాకుండా, ఆ నిధులను కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పద్ధ తులపైన వాడవచ్చు అనేది ఈ ఆర్థికవేత్తల వాదన. ఈ విధంగా, ఎమ్‌.ఐ.టి.లోని ప్రయోగశాలలో అభిజిత్, ఎస్తర్‌లు జరిపిన పరిశోధ నలూ, ఈ పరిశోధనా పద్ధతిని మైకెల్‌ క్రెమర్, కెన్యా దేశంలోని పాఠ శాలలలో పరీక్షించడం ద్వారానూ కనుగొన్న పేదరిక నిర్మూలన పద్ధతులు కొన్నింటిని పరిశీలిద్దాం. ఈ ప్రయోగ పద్ధతులను వారు ప్రధానంగా విద్య, వైద్య రంగా లలో కేంద్రీకరించారు. విద్యారంగంలో ఈ పద్ధతులను అనుసరిం చడం ద్వారా భారత్, ఆఫ్రికాలలో 60 లక్షలమంది పిల్లలకు మెరుగైన విద్య ద్వారా ప్రయోజనం చేకూరిందనేది ఒక అంచనా. కాగా, వీరి సూత్రీకరణల ప్రకారంగా పాఠశాలల విద్యార్థులకు మరిన్ని పాఠ్య పుస్తకాలూ, ఉచిత భోజనాలను అందించడం కంటే, చదువులో వెను కబడిన విద్యార్థులకు నిర్దిష్టంగా అదనపు ట్యూషన్‌ వంటి సాయం అందించడం ద్వారా, మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయి. అలాగే, పిల్లలకు వారి కడుపులోని నులిపురుగులను నిర్మూలించే ఔషదాన్ని ఇవ్వడం అనే అతి చిన్న చర్య ద్వారా వారి ఆరోగ్యంలో మెరుగుదలా, వారి పాఠశాల హాజరును మెరుగుపరచడం సాధ్యం అయ్యాయని వారు చెబుతారు. ఇక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు బోధిం చాల్సిన విద్యార్థుల సంఖ్య, ఒక పరిమితిని మించితే దాని వలన విద్యా బోధన నాణ్యత పడిపోతుందనేది మనం నేటి వరకు నమ్ము తోన్న అంశం. కాగా, ఇది పూర్తిగా సరైనది కాకపోవచ్చుననీ, ఈ విధంగా విద్యార్థి  ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించే యత్నం కంటే, విద్యార్థులకు మంచి గ్రేడ్‌లు వచ్చేలా బోధించగలిగితేనే, ఆ ఉపా ధ్యాయునికి బోధనా కాంట్రాక్ట్‌ను పాఠశాల పొడిగించే విధానం మంచిదనేది ఈ నోబెల్‌ పరిశోధకుల తర్కం.

స్థూలంగా, ‘‘పరిమిత’’ వనరులు వున్న భారత్‌ వంటి దేశాలకు పేదరిక నిర్మూలనకుగాను ఈ లక్షి్యత పరిష్కార చర్యలు మంచి దనేది ఈ ఆర్థికవేత్తల తర్కం. కాగా, నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశా లలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆదేశిత పొదుపు చర్యలు అమలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ చర్యలలో భాగంగా వివిధ ప్రభుత్వాలు తమ తమ దేశాల విదేశీ అప్పులను తీర్చగలిగేటందుకు గాను తమ దేశాలలోని సామాన్య ప్రజలకు కల్పించే సంక్షేమ పథ కాలపై కోతలు పెడుతున్నాయి. అలాగే, వ్యయాల తగ్గింపులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కుదించడం, కొత్తగా ఉద్యో గులను భర్తీ చేయకపోవడం, ఉద్యోగుల పింఛను సదుపాయం వంటి వాటిని కుదించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇటువంటి చర్యలకు పెట్టిన పేరే ‘‘సంస్కరణలు’’. కాగా, ఈ సంస్కరణలలో ఆయా దేశాల  కార్పొరేట్లకూ, ధన వంతులకూ ఇచ్చే రాయితీలను పెంచుతూ పోవడం కూడా అంతర్భా గమే. ఉదాహరణకు, మన దేశంలో కూడా కార్పొరేట్లపై విధించే పన్నును తగ్గించడం... మరోవైపు, ద్రవ్య లోటును తగ్గించుకొనే పేరిట వంట గ్యాస్‌ సబ్సిడీ, కిరోసిన్‌ సబ్సిడీ, పంపిణీ వ్యవస్థ సబ్సి డీలు వంటి వాటిపై కోతలు వేస్తూ పోవడం వంటివన్నీ తెలిసినవే.

ఇటువంటి విధానాల పలితంగా నేడు మన దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొని వుంది. ఈ విషయాన్ని అభిజిత్‌ కూడా అనేక దఫాలు ప్రస్తావించారు. అలాగే గత వారం అమెరికాలోని బ్రౌన్‌ విశ్వ విద్యాలయంలో తాను చేసిన ఓ.పి జిందాల్‌ ఉపన్యాసంలో, భారత దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ స్థితికి సూచించిన పరిష్కారాలలో ముఖ్యమైనవి  ప్రజల చేతిలోకి డబ్బు చేరేలా చూడటం, జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వడం వంటివన్నీ ఉన్నాయి. కాగా, ఈ పరిష్కారాలు అన్నీ ప్రస్తుతం అమలు జరుగుతోన్న పొదుపు చర్యలకు భిన్నంగా, ప్రభు త్వం మరింతగా వ్యయాలు పెంచడంతో కూడినవి.  అయితే అభిజిత్‌తోపాటు ఈ ఏడాది ఆర్థికరంగంలో నోబెల్‌ గ్రహీతలకు ఆ బహుమతిని తెచ్చిపెట్టింది, నేడాయన భారత ఆర్థిక వ్యవస్థలోని మాంద్య స్థితి పరిష్కారానికి సూచించిన పై స్థూల ఆర్థిక పరిష్కారాలు కాదు. అభిజిత్, ఆయన సహచరులు తమ దృష్టిని ప్రధానంగా ఆర్థిక రంగం తాలూకు.. అందులోనూ ముఖ్యంగా విద్య, వైద్యరంగాలలోని సూక్ష్మ అంశాలపై కేంద్రీకరించారు. అత్యంత కేంద్ర స్థాయిలో తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకునే సమస్యలూ, వారి రోజువారీ పాఠశాల హాజరు, విద్యార్థుల విద్యార్జనపై వారి ఆరోగ్య ప్రభావం వంటి ప్రజల జీవితాల తాలూకు నిర్దిష్ట, అత్యంత సూక్ష్మ అంశాలపై వారు తమ పరిశోధనలను కేంద్రీకరించారు. తద్వారా, నిత్య జీవితంలో విద్య, వైద్యం వంటి రంగాల్లో తలెత్తు తున్న సమస్యలను పరిష్కరించేందుకుగాను మనం అంతకుముందు  ఎన్నడూ ఆలోచించి ఉండని పరిష్కారాలను వారు ముందుకు తెచ్చారు. కాగా, ప్రభుత్వాల ఆర్థిక విధానాలూ, అవి ఆర్థిక వ్యవస్థ యాజ మాన్యంలో అనుసరించే భిన్నమార్గాలు అనేవి అభిజిత్‌ ఆయన సహ చరుల దృష్టిని కేంద్రీకరించిన సూక్ష్మస్థాయి అంశాలను ప్రభావితం చేసేవిగా ఉండగలవు. ఉదాహరణకు ప్రభుత్వ విధానాలు మారి, కార్పొరేట్లకు, ధనికులకు పన్నురాయితీలూ సబ్సిడీలు ఇవ్వడం కాకుండా వారిపై మరింతగా పన్నులు విధించడం వంటిది చేయ గలిగితే ప్రభుత్వ ఖజానాకు అదనపు నిధులు సమకూరుతాయి.

ఆ స్థితిలో, నిధుల కొరత పరిస్థితుల్లో ఆమలు జరప వీలైనవిగా అభిజిత్, ఆయన సహచరులు చెప్పిన సూక్ష్మస్థాయి విధానాలకే ప్రభు త్వాలు పరిమితం కానవసరం ఉండదు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యానికి, అభిజిత్‌ సూచించిన పైన పేర్కొన్న పరిష్కార మార్గాల అమలుకు కావల్సిన వనరులు ప్రభుత్వం వద్ద ఉంటాయి. కాబట్టి అభిజిత్‌కు నోబెల్‌ బహుమతిని తెచ్చిపెట్టిన విద్యా, వైద్య రంగా లలోని ప్రభావవంతమైన సూక్ష్మస్థాయి కార్యాచరణతోపాటుగా ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రపంచంలోని ఆర్థిక అసమానతలపై విస్తృత పరిశోధనలు చేసిన థామస్‌ పికెట్టీ వంటి వారు సూచించిన, వ్యవస్థా గతంగానే మౌలిక మార్పులను తెచ్చే విధానాలు కూడా నేటి తక్షణ అవసరం.. ఆగత్యం కూడా..!!

డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98661 79615

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement