
కాగితాన్ని రకరకాల ఆకారాల్లోకి మడిచేసే ఒరిగామి.. రక్తాన్ని గడ్డకట్టించేందుకు వాడే మందు.. అప్పగించిన పని తు.చ. తప్పకుండా చేసే రోబో..! ఈ మూడు అంశాల్లో ఏమైనా సారూప్యం ఉందా? మామూలుగా చూస్తే అస్సలు ఉండదుగానీ.. ప్రాణాంతకమైన కేన్సర్ పనిపట్టేందుకు శాస్త్రవేత్తలు ఈ మూడింటిని ఒక దగ్గరకు చేర్చారు! అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో.. డీఎన్‌ఏ రోబోలు మన రక్తంలో ఈదుకుంటూ వెళ్లి.. కేన్సర్ కణితులను మాయం చేసేస్తాయి!
సాక్షి హైదరాబాద్ : కేన్సర్.. పేరు వినగానే చాలామంది ఇక చావు తప్పదన్న నిర్ధారణకు వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాధిబారిన పడినా.. ఏళ్లపాటు జీవించేందుకు అవకాశాలున్నాయి. అయితే ఆయుష్షు కొంతవరకూ పెంచగలమేమోగానీ.. పూర్తిస్థాయిలో చికిత్స అన్నది ఇప్పటికీ సాధ్యం కాదనే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చెబుతోంది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. శరీరంలో కేన్సర్ కణితులు ఎక్కడున్నా గుర్తించి మరీ వాటికి రక్తం సరఫరా చేసే నాడులను అడ్డుకోగల అద్భుత వ్యవస్థను వీరు రూపొందించారు.
కేన్సర్ కణితులు వేగంగా విభజితమవ్వాలంటే కణాలకు బోలెడంత శక్తి కావాలి. ఈ శక్తి కోసం కేన్సర్ కణాలు కొత్త కొత్త రక్తనాడులను సృష్టించుకుంటాయి. దీన్నే యాంజియోజెనిసిస్ అంటారు. ఇలా కొత్త రక్తనాళాలు పెరిగే వేగాన్ని తగ్గించగలిగితే కణితుల సైజును నియంత్రించడంతోపాటు వ్యాధి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ పని ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలోని బయోడిజైన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ డిజైన్ అండ్ బయో మిమిటిక్స్ విభాగపు ప్రొఫెసర్ హోయాన్ వినూత్నమైన రీతిలో పరిశోధనలు నిర్వహించారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒరిగామి అనే జపనీస్ కళ గురించి తెలసుకోవాల్సి ఉంటుంది. కాగితాన్ని మడత పెడుతూ రకరకాల ఆకృతులను సృష్టించడం ఒరిగామి ప్రత్యేకత. కాగితానికి బదులుగా మన కణాల్లోని డీఎన్‌ఏతో ఓ గొట్టం లాంటి ఆకారాన్ని తయారు చేశారు ప్రొఫెసర్ హోయాన్. ఈ గొట్టం లోపలిభాగంలో రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఉపయోగించే థ్రోంబిన్ అనే మందును ఉంచారు. డీఎన్‌ఏ గొట్టంతో కలసి మందు రక్తనాళాల్లో కేన్సర్ కణాల పరిసరాల్లోకి చేరుతుంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్ మూలకాలకు స్పందించి డీఎన్‌ఏ గొట్టం విచ్చుకుంటే.. దాంట్లోని మందు పనిచేయడం మొదలుపెడుతుంది. ఇంకేముంది.. ఆ ప్రాంతంలోని రక్తనాళం పూడిపోవడం.. దాంతోపాటే కేన్సర్ కణితి నాశనమైపోవడం చకచకా జరిగిపోతాయి.
తెలివైన డిజైన్..
మామూలుగా రోబో అనగానే మనకు యంత్రుడు గుర్తుకొస్తాడు గానీ.. దీనిని డీఎన్‌ఏనే చాలా తెలివిగా డిజైన్ చేసి తయారు చేసిన రోబోగా చెప్పాలి. చికిత్సకు ఉపయోగించే మందు కణితి వద్దకు వెళ్లకుండానే రక్తంలో కలిసిపోకుండా ఉండేందుకు డీఎన్‌ఏ పోగులతో చేసిన గొట్టం లాంటి నిర్మాణాన్ని ఉపయోగించారు. పైగా మందుల జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అది అవసరమైనప్పుడే కణితుల వద్ద విడుదలయ్యేలా ఈ డిజైన్ ఉపయోగపడింది. కేన్సర్ కణాలకే పరిమితమైన ప్రొటీన్‌ను గుర్తించి అతుక్కునేలా ఈ గొట్టం చివరల్లో ప్రత్యేకమైన మార్కర్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ మందు ఆరోగ్యకరమైన కణాల వద్ద పనిచేసి దుష్ప్రభావాలు చూపే అవకాశాలను తగ్గించారన్నమాట.
ఏఏ కేన్సర్లకు వాడవచ్చు..
ఈ కొత్త నానో డీఎన్‌ఏ రోబో విధానాన్ని ఎలుకల్లోని రొమ్ము కేన్సర్‌పై పరీక్షించి చూశారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తోపాటు గర్భాశయ కేన్సర్లు ఉన్న ఎలుకల్లోనూ ఈ విధానం మెరుగైన ప్రభావం చూపినట్లు నేచర్ బయోటెక్నాలజీ టుడేలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మూడు రోజుల్లో ఈ నానో డీఎన్‌ఏ రోబోలు కేన్సర్ కణితుల చుట్టూ ఉన్న రక్తనాళాలను మూసేయడంలో విజయం సాధించాయని, రక్త కేన్సర్ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్త కేన్సర్ల విషయంలో ఎనిమిది ఎలుకల్లో మూడింటిలో కణితులు పూర్తిగా తొలగిపోగా.. మిగిలిన వాటిలో సైజు గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా వాటి జీవితకాలం కూడా రెట్టింపు అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణితులు ఉన్న ప్రాంతానికి దూరంగా రక్తనాళాలపై ఎలాంటి చెడు ప్రభావం చూపకపోవడం ఈ విధానం ఇంకో ప్రత్యేకత. ఎలుకలతోపాటు తాము పందులపై కూడా ప్రయోగాలు జరిపి మంచి ఫలితాలు సాధించామని ప్రొఫెసర్ హోయాన్ అంటున్నారు. ఈ నానో డీఎన్‌ఏ రోబోలను కేన్సర్‌కే కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స అందించేందుకూ ఉపయోగించవచ్చని.. అవి మోసుకెళ్లే మందును మారిస్తే చాలని తాము అంచనా వేస్తున్నట్లు యాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment